7 ప్రధాన ఆలయాల సెక్యూరిటీ సిబ్బంది నియామకానికి మళ్లీ టెండర్లు
అస్మదీయుల కోసం ఎప్పటికప్పుడు నిబంధనల మార్పు
మంత్రి, సీఎంవో అధికారి మధ్య పోటీతో గతంలో టెండర్లను రద్దుచేసిన దేవదాయశాఖ
సాక్షి, అమరావతి: ఏ కాంట్రాక్టు అయినా కావాల్సినవాళ్లకు ఇవ్వాలనో, తమను కనిపెట్టుకునేవాళ్లకు ఇవ్వాలనో చూసే కూటమి ప్రభుత్వ పెద్దలు దేవదాయశాఖపైనా కన్నేశారు. ఇందుకోసం నిబంధనలను కూడా మార్చేస్తున్నారు. అనుకూలంగా లేదంటే టెండర్లను రద్దుచేసి మళ్లీ పిలుస్తున్నారు. రాష్ట్రంలో అధిక ఆదాయం వచ్చే ఏడు ప్రధాన ఆలయాల్లో సెక్యూరిటీ ఉద్యోగుల నియామకానికి ఉమ్మడిగా పిలిచిన టెండర్లే దీనికి ఉదాహరణ.
సింహాచలం, అన్నవరం, ద్వారక తిరుమల, విజయవాడ దుర్గగుడి, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం ఆలయాల్లో మొత్తం 1,072 మంది సెక్యూరిటీ గార్డులు, 30 మంది సెక్యూరిటీ సూపర్‌వైజర్లు, 12 మంది సెక్యూరిటీ ఆఫీసర్లు, ఆరుగురు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్లను ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించేందుకు ఈ నెల 30వ తేదీ వరకు గడువుతో మళ్లీ టెండర్లు పిలిచారు. ఈ సెక్యూరిటీ ఉద్యోగులకు నెలకు దాదాపు రూ.2.5 కోట్లను వేతనాల రూపంలో ఆయా ఆలయాలు చెల్లిస్తాయి.
వీరిని సమకూర్చే కాంట్రాక్టరుకు ప్రతి నెలా దీన్లో కమీషన్ లభిస్తుంది. ఈ కమీషన్‌ను తక్కువగా కోట్ చేసినవారికి ఈ కాంట్రాక్టు ఇస్తారు. ఈ ఉద్యోగాల నియామకానికి జూన్‌లో టెండర్లు పిలిచారు. నలుగురు టెండర్లు దాఖలు చేశారు. ఈ ఆలయాల్లో ఒకదానికి ఇప్పటివరకు సెక్యూరిటీ సిబ్బందిని సరఫరా చేస్తున్న కాంట్రాక్టరు దాఖలు చేసిన బిడ్ అనర్హమైనదని అధికారులు తిరస్కరించారు. మిగిలిన ముగ్గురిలో నెలకు రూ.23 లక్షల కమీషన్ ఇవ్వాలని దాఖలు చేసిన టెండరును ఎల్–1గా నిర్ధారించారు. తిరస్కరణకు గురైన బిడ్‌ను దాఖలు చేసిన కాంట్రాక్టరు హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు ఆదేశాల మేరకు అతడి బిడ్‌ను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఆ బిడ్ ఓపెన్ చేస్తే ఆ కాంట్రాక్టరు ఎల్–1 అవుతారన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు తనకే ఇవ్వాలని తొలుత ఎల్–1గా వచ్చిన బిడ్ దాఖలు చేసిన వ్యక్తి మంత్రి ద్వారా, కోర్టుకు వెళ్లిన వ్యక్తి సీఎంవోలోని ఒక అధికారి ద్వారా పైరవీలు మొదలుపెట్టారు. రెండువైపులా ఒత్తిడితో దేవదాయశాఖ అధికారులు ఆ టెండర్లను సెపె్టంబర్‌లో రద్దుచేసి, మళ్లీ టెండర్లు పిలిచారు.
గతంలో విడివిడిగా.. ఇప్పుడు ఉమ్మడిగా..
ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వారికి కోట్ల రూపాయల పనులు అప్పగించేందుకు దేవదాయశాఖలో ఇష్టానుసారం టెండరు నిబంధనలు మార్చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో ఆలయం అవసరాన్ని బట్టి పారిశుద్ధ్య పనులకు, రక్షణ విధులకు ఎక్కడికక్కడే టెండర్లు పిలిచేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ పనులకు ఏడు ఆలయాలకు ఉమ్మడిగా టెండర్లు పిలిచారు. ఈ ఏడు ఆలయాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణకు పిలిచిన టెండర్లను కూడా ఒకసారి రద్దుచేశారు.
ప్రభుత్వ పెద్దలకు కావాల్సినవారికి ఆ పనులు అప్పగించేందుకు మొదట పిలిచిన టెండర్లను రద్దుచేసి, నిబంధనలు మార్చి ఈ ఏడాది జూన్‌లో రెండోసారి టెండర్లు పిలిచారు. దాదాపు రూ.వందకోట్ల విలువ ఉండే ఆ టెండరు చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు బంధువుగా పేర్కొన్న వ్యక్తికి సంబంధించిన సంస్థకే దక్కడం గమనార్హం.


