నో స్టాక్‌..!

Stamp Papers No Stock in Hyderabad - Sakshi

నాన్‌ జ్యుడీషియల్‌ పేపర్లకు డిమాండ్‌

నాసిక్‌కు ఇండెంట్‌ పెట్టని అధికారులు

రెండు మాసాలుగా ఆగిన సరఫరా

రూ.100 విలువగలస్టాంప్‌ పేపర్ల కొరత

కనబడని రూ.50ల స్టాంప్‌ పేపర్లు

రూ.20ల స్టాంప్‌ పేపర్లపైనే లావాదేవీలు

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ మహా నగరంలో నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్‌ పేపర్లకు కొరత ఏర్పడింది. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్, ఒప్పం దాలు, ధ్రువీకరణలు, న్యాయపరమైన లావాదేవీలకు అత్యధికంగా వినియోగించే రూ.100లు విలువ గల స్టాంప్‌ పేపర్ల పంపిణీ స్టాంప్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి నిలిచిపోయింది. స్టాంప్‌ వెండర్స్‌ వద్ద పాత స్టాక్‌ ఉన్నప్పటికీ కృత్రిమ కొరత సృష్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.50ల విలువగల నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్‌ పేపర్లు పత్తాలేకుండా పోగా, తాజాగా రూ.100ల స్టాంప్‌ పేపర్లు సైతం అదే జాబితాలో చేరుతున్నట్లు కనిపిస్తోంది. డిమాండ్‌ ఉన్నా ఫలితం లేకుండా పోయింది. వాస్తవంగా రెండు మాసాల నుంచి స్టాంప్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ నాసిక్‌ ముద్రణాలయానికి స్టాంప్‌ పేపర్ల కోసం ఇండెంట్‌ పెట్టనట్లు తెలుస్తోంది. ఫలితంగా అక్కడి నుంచి రిజిస్ట్రేషన్‌ శాఖ స్టాంప్‌ డిపోలకు సరఫరా ఆగిపోయింది. రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి కేవలం రూ.20ల స్టాంప్‌ పేపర్లు మాత్రమే పంపిణీ జరుగుతోంది. దీంతో స్థిరాస్తి దస్తావేజులు మినహా మిగిలిన అన్ని లావాదేవీలు వీటిపైనే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆ నిల్వలు కూడా ఖాళీ అవుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇండెంట్‌పై అనాసక్తి..
స్టాంప్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్‌ పేపర్ల ఇండెంట్‌పై అనాసక్తి కనబరుస్తోంది. నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్‌ పేపర్ల డిమాండ్‌ ఉన్నప్పటికీ నాసిక్‌ ముద్రణాలయానికి ఇండెంట్‌ పెట్టకపోవడం వెనుక కొత్త వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు తరహాలో బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా కొత్త తరహాలో స్టాంప్‌ విలువ విక్రయ సేవలు అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్‌ పేపర్ల ఇండెంట్‌పై అనాసక్తి కనబర్చడం ఇందుకు బలం చేకూరుస్తోంది. స్టాంప్‌ నిల్వలు లేకపోవడంతో జిల్లా స్టాంప్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసుల నుంచి వివిధ విలువలు గల స్టాంప్‌ పేపర్ల విక్రయాలు లేకుండా పోయాయి.  దీంతో బహిరంగ మార్కెట్‌లో పాత స్టాక్‌కు డిమాండ్‌ పెరిగినట్లయ్యింది. 

నాసిక్‌లోనే ముద్రణ..
మహారాష్ట్రలోని నాసిక్‌ నుంచి జ్యుడీషియల్‌ స్టాంప్‌ పేపర్లు దిగుమతి అవుతాయి. నాసిక్‌లోని ముద్రణాలయంలో నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్‌లు, రెవెన్యూ స్టాంపులు ముద్రిస్తారు. స్టాంప్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ  నాసిక్‌ ముద్రణాలయానికి అవసరమైనంత ఇండెంట్‌ పంపించి నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్‌లను తెప్పిస్తోంది. జిల్లా రిజిస్ట్రార్ల ఇండెంట్‌ ప్రకారం వాటిని సరఫరా చేస్తోంది. రాష్ట్ర రిజిస్ట్రేషన్‌ శాఖ నాసిక్‌ నుంచి స్టాక్‌ తెప్పించిన ప్రతిసారి ముందస్తుగా 20 శాతం వరకు సరుకు నిల్వ చేసి మిగితాది జిల్లా రిజిస్ట్రార్‌ సరఫరా చేస్తోంది. జిల్లా రిజిస్టార్‌ ఆఫీస్‌ కూడా స్టాంప్‌ డిపోలో కొంత స్టాక్‌ రిజర్వ్‌డ్‌ చేసుకొని సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల ఇండెంట్‌ డిమాండ్‌ మేరకు పంపిణీ చేస్తోంది. స్టాక్‌ పూర్తి కాకముందే ఇండెంట్‌ పెట్టి తెప్పించుకోవడం ఆనవాయితీ. తాజాగా స్టాక్‌ పూర్తయినా ఇండెంట్‌ ఊసే లేకుండా పోయింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top