ఆట.. పాట.. చైతన్యం | Special Story About Lahari And Laxmipriya | Sakshi
Sakshi News home page

ఆట.. పాట.. చైతన్యం

Apr 13 2020 5:06 AM | Updated on Apr 13 2020 5:06 AM

Special Story About Lahari And Laxmipriya - Sakshi

కళాకారులకు లాక్‌డౌన్‌ అడ్డుగాలేదు... ఒంట్లోకి, ఇంట్లోకి కరోనా రానివ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి.. ఆ వైరస్‌ తెచ్చినlకష్టం కలకాలం ఉండదని.. ఏకాంతంలో ఉంటూ సమష్టి బాధ్యతలో పాలుపంచుకోవాలనే చైతన్యాన్ని కళనే మాధ్యమంగా వాట్సప్, యూట్యూబ్‌ వేదికల ద్వారా పంచుతున్నారు ఈ అక్కాచెల్లెళ్లు లహరి, లక్ష్మీప్రియ..

ఈ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కూచిపూడి కళాకారులే. అక్క లహరి.. హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్శిటీలో కూచిపూడిలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చేస్తోంది. చెల్లి.. లక్ష్మీప్రియది డ్యాన్స్‌లోనే డిగ్రీ. సమయం, సందర్భానుసారం  ప్రదర్శనలిచ్చే వీరు ఇప్పుడు దానిని కూచిపూడిలోకి కన్వర్ట్‌ చేశారు.. కరోనా వ్యాప్తిని ఎలా నిరోధించాలో చెప్పడానికి. చేతులు శుభ్రంగా కడుక్కోవడం... అత్యవసరమై బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు మనిషికి మనిషికి మధ్య కనీస దూరం పాటించడం... వంటి జాగ్రత్తలను కూచిపూడి నాట్యరూపంలో చెప్తూ వీరు తీసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

‘జనతా కర్ఫ్యూ పాటించిన ఆదివారం.. ఊరికే ఇంట్లో కూర్చోని ఏం చేయాలా అని అనుకుంటూండగా ఈ ఆలోచన తట్టింది. అప్పటికప్పుడు ఈ మూడు జాగ్రత్తలకు కొరియోగ్రఫీ చేసి. చెల్లి, నేను కలిసి డ్యాన్స్‌ చేశాం. ఆ వీడియో ను ముందు తెలిసినవాళ్లకే పంపాం. బాగుంది... కరోనామీద అవేర్‌నెస్‌ కల్పించే వీడియో ఇది. అందరికీ తెలియాలి.. అని మా ఫ్రెండ్స్‌.. తెలిసినవాళ్లు.. సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. అలా అది వైరల్‌ అయింది’ చెప్పింది లహరి.

అందరికీ చేరే మీడియం..
‘సామాజిక సమస్యల మీద ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ఇలాంటి కళారూపాలు ఎంతో ఉపయోగపడ్తాయి. నేను డ్యాన్స్‌స్కూల్‌ నడుపుతున్నాను. స్త్రీ శక్తి, మహిళా సమస్యలకు సంబంధించిన అంశాలను తీసుకొని డాన్స్‌ కంపోజ్‌ చేసి నా సంస్థలోని పిల్లలతో ప్రదర్శనలిప్పిస్తుంటాను. దీనివల్ల డ్యాన్స్‌ చేసిన పిల్లలూ తమ హక్కులను ఎలా కాపాడుకోవాలో.. ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలో తెలుసుకుంటారు.  అందుకే ఏ మాత్రం అవకాశం దొరికినా.. ఈ కళను సామాజిక చైతన్యానికి సాధనంగా ఉపయోగించుకుంటూంటాను’ వివరించింది లహరి. 

పాటిస్తే దక్కేవి ప్రాణాలే..
కనోనాను అడ్డుకోవడానికి ప్రభుత్వం చెప్తున్న సూచనలు, చేస్తున్న హెచ్చరికలు పెడచెవిన పెట్టకండి. ప్రమాదంలో పడకండి.. సూచనలు పాటిస్తే దక్కేవి మన ప్రాణాలే.. ఏకాంతం లో ఉంటూ సమష్టి బాధ్యతలో పాలుపంచుకోండి అనే సారంతో యూట్యూబ్‌లో ఒక పాట బాగా వైరల్‌ అవుతోంది. ఆ పాటను పాడింది ఈ అక్కాచెల్లెళ్లే. అక్క పేరు జాహ్నవి.. చెల్లి లాస్య. టీవీలో రియాలిటీ షోస్‌ చూసేవాళ్లకు ఈ ఇద్దరూ సుపరిచితులు. 2017.. పాడుతా తీయగా విన్నర్‌ జాహ్నవి. జీ సరిగమలు లిటిల్‌ చాంప్స్‌ ఫైనలిస్ట్‌ లాస్య. ప్రతివారం.. ఆ వారంలో జరిగిన సంఘటన.. లేదా ఆ వారంలో బాగా పాపులర్‌ అయిన అంశం మీద ఇలా పాటను రికార్డ్‌ చేసి ‘జాహ్నవి సింగర్‌’ అనే యూట్యూబ్‌ చానల్‌లో పోస్ట్‌ చేయడం వీరి హాబీ.

అలా ఈసారి... ప్రపంచాన్నే వణికిస్తోన్న కరోనాకు చెక్‌ పెట్టడానికి ఈ పాట పాడారు. ‘మా పాట మాకే కాదు పదిమందికీ మేలు చేయాలి కదా.. అందుకే ఇలాంటి వాటినీ పాడుతూంటాం’ అంటుంది పదిహేనేళ్ల జాహ్నవి. ఈ పాటను రాసింది వాళ్లమ్మ చోడవరపు లక్ష్మీశ్రీ. ఇదొక్కటే కాదు... వారం వారం ‘జాహ్నవి సింగర్‌’ యూట్యూబ్‌ చానల్‌లో అప్‌లోడ్‌ అయ్యే ప్రతి పాటా ఆమే రాస్తారు. ‘ఆట, పాట, చదువు ఎంత ముఖ్యమో .. తోటివారితో సఖ్యంగా ఉండడం.. సమాజం పట్ల బాధ్యతగా నడుచుకోవడమూ అంతే ముఖ్యమని, దీన్ని నేర్పాల్సిన బాధ్యత అమ్మగా నాదేననీ నమ్ముతా’ అంటారు లక్ష్మీశ్రీ. వీరే కాదు జానపద కళాకారులు నల్గొండ గద్దర్‌ నర్సిరెడ్డి, సాయిచంద్, ప్రముఖ చిత్రకారులు కూడా తమ పాటలు, బొమ్మలతో ప్రజల్లో చైతన్యం పెంచేందుకు కృషిచేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement