చరితారెడ్డిపై విధి చిన్నచూపు.. | Software Engineer Charitha Reddy Died in Car Accident America | Sakshi
Sakshi News home page

రేణుకానగర్‌లో విషాదఛాయలు

Jan 1 2020 8:13 AM | Updated on Oct 17 2021 3:38 PM

Software Engineer Charitha Reddy Died in Car Accident America - Sakshi

ఎల్ల చరితారెడ్డి (ఫైల్‌)

నేరేడ్‌మెట్‌:  తమ కూతురు మంచి ఉద్యోగం చేస్తూ జీవితంలో స్థిరపడి కుటుంబానికి అండగా ఉంటుందని ఆశపడ్డారు ఆ తల్లిదండ్రులు. అనుకుంటున్నగానే చదువులో రాణిస్తూ పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరుకుంది. నేరేడ్‌మెట్‌ డివిజన్‌ రేణుకానగర్‌కు చెందిన చంద్రారెడ్డి, శోభ దంపతులు కూతురు ఎల్ల చరితారెడ్డిపై విధి చిన్నచూపు చూసింది. భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్న యువ సాఫ్ట్‌వేర్‌ ప్రాణాలను  అమెరికాలో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. దాంతో రేణుకానగర్‌లోని చరితారెడ్డి కుటుంబంలో విషాదచాయలు ఆలుముకున్నాయి.

తల్లిదండ్రులు కూతురుకు ఇక్కడ వివాహం చేయడానికి ఇటీవల ప్రయత్నాలు చేస్తున్నట్టు సన్నిహితులు చెప్పారు. ఇందు కోసం మరో రెండు నెలల్లో చరితారెడ్డి భారత్‌కు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో ఆమె దుర్మరణం చెందటం తల్లిదండ్రులను, బంధువులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.  శుక్రవారం స్నేహితులతో కలిసి చరితారెడ్డి కారులో వెళ్లారు. అమెరికాలోని మిచిగావ్‌లో రోడ్డు పక్కన  ఆగి ఉన్న వారి కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టడంతో బ్యాక్‌సీటులో కూర్చున చరితారెడ్డి బ్రెయిన్‌డెడ్‌ అయి మృతి చెందారు. కూతురు మృతి వార్త తల్లిదండ్రులు, సోదరుడు యశ్వంత్, బంధువులను దిగ్బ్రాంతికి గురి చేసింది.

విద్యాభ్యాసం..
నేరేడ్‌మెట్‌ మధురానగర్‌లో సమార్టన్‌ హైస్కూల్, నారాయణ కళాశాలలో చరితారెడ్డి విద్యాభ్యాసం కొనసాగింది. గీతం కళాశాలలో ఇంజనీరింగ్‌ చదివిన ఆమె 2015లో ఎంఎస్‌ చదవటానికి అమెరికాకు వెళ్లారు. అక్కడ ఎంఎస్‌ పూర్తి చేసిన తరువాత తిరిగి ఇండియాకు వచ్చిన ఆమెకు డెలాయిట్‌ కంపెనీలో ఉద్యోగ అవకాశం రావడంతో తిరిగి అమెరికా వెళ్లారు. మూడేళ్లుగా అక్కడ ఉద్యోగం చేసున్నారు. ఉద్యోగంలో చేరిన సమయంలో చరితారెడ్డి అవయవదానం చేసినట్టు సన్నిహితులు చెప్పారు. ఆమె మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావడానికి బంధువులు అమెరికా వెళ్లారు. 

తొమ్మిది మంది జీవితాల్లో వెలుగు నింపిన చరితారెడ్డి..
చరితారెడ్డి తాను చనిపోయి కూడా.. తొమ్మిది మంది జీవితాల్లో వెలుగు నింపారు. గత శుక్రవారం మిచిగావ్‌లో మృతిచెందిన అవయవదానం ఆపరేషన్‌ ముగిసింది. ఆమె కిడ్నీలను, కాలేయం, గుండె కవాటాలు, కళ్లను వైద్యులు సేకరించారు. ఈ విషయం అమెరికా వైద్యులు అధికార ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం చరితారెడ్డి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement