స్వైన్‌ఫ్లూ..కరోనా..డెంగీ.. ఏదైనా ఒకే ఓపీ | Single OP in Gandhi Hospital For All Diseases | Sakshi
Sakshi News home page

స్వైన్‌ఫ్లూ..కరోనా..డెంగీ.. ఏదైనా ఒకే ఓపీ

Published Mon, Feb 17 2020 7:32 AM | Last Updated on Mon, Feb 17 2020 7:33 AM

Single OP in Gandhi Hospital For All Diseases - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో అతిముఖ్యమైన గాంధీ ఆస్పత్రిలో నిర్లక్ష్యపు వైద్యసేవల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా, స్వైన్‌ఫ్లూ, డెంగీ వంటి ప్రాణాంతక వైరస్‌ సంబంధిత వ్యాధులు తీవ్రంగా ప్రబలి, ప్రజలు భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో వైద్యులు, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి. రోగులకు భరోసానిచ్చేలా సేవలందించాలి. కానీ గాంధీలో అడుగడుగునా నిర్లక్ష్యం తాండవిస్తోంది. ముఖ్యంగా వైరస్‌ వ్యాధుల విషయంలో అప్రమత్తం కావాల్సి ఉండగా..అలాంటి చర్యలేవీ ఇక్కడ కన్పించడం లేదు. కరోనా అనుమానితులు, స్వైన్‌ ఫ్లూ,డెంగీ వంటి వ్యాధులతో  చికిత్స కోసం వచ్చిన వారందరినీ ఒకే చోట ఉంచుతున్నారు. ఒకే ఓపీ ఉండడంతో వీరంతా సాధారణ రోగుల మధ్యనే లైన్‌లో ఉంటూ ఓపీ చీటీలు రాయించుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా, స్వైన్‌ఫ్లూ గాలి ద్వారా ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు ఈ విభాగాల ఓపీ సెపరేట్‌గా ఏర్పాటు చేయాలి. కానీ ఇక్కడ అలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సాధారణ జ్వరం, జలుబు, తలనొప్పి వంటి చిన్నచిన్న సమస్యలతో వచ్చిన వారు ఆందోళనకు గురవుతున్నారు. ఫ్లూ వైరస్‌ తమకు ఎక్కడ సోకుతుందోనని వారు భయపడుతున్నారు. 

సిబ్బంది కొరత
గాంధీ, ఉస్మానియా, ఫీవర్‌ ఆస్పత్రులకు వస్తున్న రోగుల నిష్పత్తికి అనుగుణంగా ఆయా ఆస్పత్రుల్లో మందులు, వైద్య పరికరాలు, నిపుణులు, స్టాఫ్‌ నర్సులు, ఇతర పారా మెడికల్‌ స్టాఫ్‌ లేకపోవడంతో వైద్య సేవలకు విఘాతం కలుగుతోంది. అంతే కాదు సాధారణ రోగుల మధ్యే ప్రమాదకరమైన ఫ్లూ, కరోనా అనుమానితులు తిరుగుతుండటం, వారిని గుర్తించేందుకు ఆస్పత్రుల్లో ప్రత్యేక వ్యవస్థ అంటూ ఏమీ లేకపోవడం, వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి విస్తరించే ప్రమాదం ఉండటంతో గ్రేటర్‌ వాసుల్లో ఆందోళన వ్యక్త మవుతుంది . 

ప్రస్తుతం నగరంలో 15 రకాల వైరస్‌లు ఉన్నట్లు అంచనా. వీటికి తోడు తాజాగా కరోనా వైరస్‌ వచ్చి చేరుతుండటంతో గ్రేటర్‌ వాసుల్లో ఆందోళన మొదలైంది. ఈ బాధితులకు చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రి సహా గాంధీ ఆస్పత్రులను ప్రత్యేక నోడల్‌ కేంద్రాలుగా ఎంపిక చేసింది. ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రి, సరోజినిదేవి కంటి ఆస్పత్రి, ఉస్మానియాలోనూ వార్డులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ..అక్కడ సరైన మౌలిక సదుపాయాలు లేక పోవడంతో ఆయా బాధితులంతా చికిత్సల కోసం గాంధీ నోడల్‌ కేంద్రాన్నే ఆశ్రయిస్తున్నారు. వీరికి ఓపీలో ప్రత్యేక బ్లాక్‌ అంటూ ఏమీ లేదు . గాంధీ క్యాజువాలిటీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ వసంత్‌కుమార్‌ ఇదే అంశంపై సదరు అధికారులను ప్రశ్నించడం, వారు ఆయనపై క్రమశిక్షణా చర్యలకు పూనుకోవడం, ఆ తర్వాత ఆయన ఇదే ప్రాంగణంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం, ఆస్పత్రిలోని అక్రమాలు...అధికారుల అవినీతి...వంటి అంశాలపై తీవ్రమైన ఆరోపణలు చేయడం, ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం, విజిలెన్స్‌ విచారణకు ఆదేశించడం తెలిసిందే. ఓపీలో ఫ్లూ, ఇతర రోగుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టలేదు.  

ఏరియా ఆస్పత్రుల్లో అంతంతే...
నగరంలోని బోధనాసుపత్రులపై ఒత్తిడి తగ్గించేందుకే కాదు కుక్కకాటు, డెంగీ, మలేరియా జ్వర పీడితులకు సత్వర వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం వనస్థలిపురం, మలక్‌పేట్, కొండాపూర్, గొల్కొండ, కింగ్‌కోఠి, నాంపల్లి, సూరజ్‌భాను ఏరియా ఆస్పత్రులను ఏర్పాటు చేసింది. అన్ని రకాల వైద్య పరికరాలను సమకూర్చింది. వైద్యసేవలపై సరైన నిఘా లేకపోవడంతో వైద్య సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉదయం పది తర్వాత ఆస్పత్రికి చేరుకోవడం, మధ్యాహ్నం 12.30 తర్వాత మాయమవుతున్నారు. ఆ తర్వాత వచ్చే రోగులను పట్టించుకునే నాధుడే లేకపోవడంతో వారంతా అత్యవసర పరిస్థితుల్లో గాంధీ, ఉస్మానియా, ఫీవర్‌ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. అంతేకాదు నెలలు నిండిన గర్భిణులుకు సుఖ ప్రసవం కోసం ఆయా ఆస్పత్రుల్లో లేబర్‌రూమ్‌లతో పాటు పీడియాట్రిక్‌ వార్డులను కూడా ఏర్పాటు చేసినప్పటికీ..సాయంత్రం తర్వాత అక్కడ వైద్యులు అందుబాటులో ఉండక వారంతా సుల్తాన్‌ బజార్, పేట్లబురుజు, గాంధీ, నిలోఫర్‌ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు.

పీహెచ్‌సీలు..బస్తీ దవాఖానాల్లోనూ.. 
గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో వందకుపైగా పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉండగా, వీటిలో 24 గంటలు పని చేసే ఆస్పత్రులు తొమ్మిది ఉన్నాయి.  చందులాల్‌ బారాదరి, ముషీరాబాద్, మహారాజ్‌గంజ్, ఆర్‌హెచ్‌ అండ్‌ఎఫ్‌డబ్ల్యూటీసీ, వినాయక్‌నగర్, గా>ంధీఆస్పత్రి, బొల్లారం పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో గత ఐదేళ్ల నుంచి డాక్టరే లేరు.ఇక చార్మినార్, ఈద్‌బజార్, పంజేషా–1,2, హరాజ్‌పెంట, అఫ్జల్‌గంజ్, పాన్‌బజార్, బైబిల్‌హౌస్, బోయిన్‌పల్లి, పికెట్, తిరుమలగిరి, చింతల్‌బస్తీ, తిలక్‌నగర్, బేగంబజార్, అఫ్జల్‌సాగర్, సయ్యద్‌నగర్, ఆఘంపురా, శాంతినగర్, కుమ్మరివాడి, గగన్‌మహల్, కార్వాన్‌–1 పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు కాంట్రాక్ట్‌ వైద్యులే దిక్కయ్యారు. నిజానికి ప్రతి పదివేల మందికి ఒక వైద్యుడు అవసరం కాగా, నగరంలో 30 వేల మందికి ఒక్కరే ఉన్నారు. ఒక్కో వైద్యుడు రోజుకు 25–30 మందికి మాత్రమే వైద్యసేవలు అందించగలరు. కానీ పీహెచ్‌సీల్లో ఒక్కో వైద్యుడు 200 మందిని చూడాల్సి వస్తుంది. వీటితో పాటు కొత్తగా వందకుపైగా బస్తీ దావాఖానాలను ఏర్పాటు చేసింది. వీటిని కూడా వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఆయా ఆస్పత్రుల్లో సరైన వైద్యసేవలు అందక పోవడంతో రోగులంతా గాంధీ, ఉస్మానియా, ఫీవర్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తుండటం, రోగుల నిష్పత్తికి తనగినన్ని వైద్య పరికరాలు, మందులు, వైద్య సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. అంతేకాదు ఈ సాధారణ రోగుల మధ్య ప్రమాదకరమైన ఫ్లూ, కోరానా బాధితులు కూడా తిరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement