పేరు మార్పిడికి మోక్షం లభించేనా..? | Singareni Employees Await Their Name Change | Sakshi
Sakshi News home page

పేరు మార్పిడికి మోక్షం లభించేనా..?

Jun 28 2019 2:54 PM | Updated on Jun 28 2019 2:56 PM

Singareni Employees Await Their Name Change - Sakshi

సాక్షి, కొత్తగూడెం: మారుపేర్ల మార్పు కోసం సింగరేణి కార్మికులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. గత గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ముందు సీఎం కేసీఆర్‌ హామీ కూడా ఇచ్చారు. శ్రీరాంపూర్‌లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో కూడా చెప్పారు. కానీ ఇంతవరకూ నెరవేర్చలేదు. సంస్థవ్యాప్తంగా సుమారు 7వేల మందికి పైగా మారుపేర్ల మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి ఆత్మీయ సమ్మేళన జరిగి సుమారు రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఈ అంశం కొలిక్కి రాకపోవడంతో కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 రిటైర్డ్‌ కార్మికులకు తప్పని ఇబ్బందులు 

బాయిపైన ఒకపేరు.. సొంత గ్రామంలో మరో పేరు ఉండటంతో ఉద్యోగ విరమణానంతరం పింఛన్‌ కోసం కార్మికులు పడుతున్న బాధ వర్ణనాతీతం. ఊర్లోని పేరుతో భూములు, ఇళ్లు ఉండటం, బాయిమీద ఇంకో పేరు ఉండటంతో ఏ పేరుతో కొనసాగాలో తెలియక తర్జన భర్జన పడుతున్నారు. ఊర్లో పేరు మార్చిన భూముల రికార్డులన్నీ మారి పోతాయి.. బాయి మీద పేరుమార్చితే పింఛన్‌ నిలిచిపోతోంది. దీంతో కార్మికులు సతమతమవుతున్నారు. 

రికార్డుల్లో సరిగా ఉన్నా..

 35ఏళ్ల పాటు సంస్థలో పనిచేసిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలిచ్చే విషయంలో యాజమాన్యం మెలిక పెడుతోంది. రికార్డుల్లో తండ్రీ కొడుకుల పేర్లు సరిగానే ఉన్నప్పటికీ విజిలెన్స్‌ విచారణ పేరుతో ఊర్లో వేరే పేరు ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొడుక్కు ఉద్యోగం ఇచ్చేందుకు అభ్యంతరం చెబుతోంది. ఉద్యోగం చేసినంత సేపు లేని మారు పేరు ఇబ్బంది అతని మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ పూర్తయి కొడుక్కి ఉద్యోగం ఇచ్చే విషయంలో మాత్రం అభ్యంతరం తెలపడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గనిపైన ఉన్న పేరుతోనే పిల్లలు చదివినా కొడుకు ఉద్యోగం విషయానికి వచ్చే సరికి విజిలెన్స్‌ విచారణ పేరుతో ఊర్లో తండ్రి పేరు వేరే ఉంటే ఉద్యోగాన్ని నిలిపివేస్తున్నారు. ఈతరహాలో సింగరేణి వ్యాప్తంగా 68 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. యాజమాన్యం నిర్ణయం కోసం సదరు కార్మికుల కుటుంబాలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాయి.  

సీఎండీ సమావేశంలో పరిష్కారమయ్యేనా..?

వచ్చే నెల 2,3 తేదీల్లో సింగరేణి సంస్థ సీఎండీ స్థాయి జేసీసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనైనా మారు పేర్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందని కార్మికులు ఆశిస్తున్నారు. ఈ స్ట్రక్చరల్‌ సమావేశంలో మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ కార్మిక కుటుంబాలకు న్యాయం జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే టీబీజీకేఎస్‌ ఒత్తిడిపైనే ఈఅంశం ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement