సెల్ఫీల గోల.. ప్రాణాలు విలవిల

Selfie Accidents And Deaths With Smart Phones - Sakshi

రోజు రోజుకూ పెరుగుతున్న సెల్ఫీల జాడ్యం

ఇదో వ్యసనంగా మారుతున్న వైనం

ప్రాణం మీదకు తెచ్చుకుంటున్న యువత

కలెక్టరేట్‌: చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు కొందరు విచిత్రంగా ప్రవర్తిస్తారు.. చేయిని అలా దూరంగా ఉంచి మొహంలో విచిత్రమైన భావాలు పలికించి స్మార్ట్‌ ఫోన్‌లో ఫొటో తీసుకుంటారు.. దానిని వెంటనే సోషల్‌మీడియాలో అప్‌లోడ్‌ చేయడం.. తరువాత లైక్‌లు..కామెంట్ల కోసం ఎదురు చూడటం పరిపాటిగా మారింది. ఈ జాడ్యం ఇటీవల కాలంలో మరీ ఎక్కువైంది. పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే  ప్రాణాలకు తెగించి మరీ సెల్ఫీలు తీసుకుంటున్నారు.    కెమెరా మొబైల్‌ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చిన తరువాత సెల్ఫీలగోల మరీ ఎక్కువైంది. తమ ముఖాలలోని అన్ని రకాల భావాలను క్షణాల వ్యవధిలో మరొకరితో పంచుకునేందుకు ‘సెల్ఫీ’ని సులభ మార్గంగా నేటి యూత్‌ ఈ ఆధునికత ట్రెండ్‌ను ఎంచుకుంటోంది. ఈ వ్యసనం ప్రతి పదిమందిలో ఆరుగురికి ఉందని సర్వేలు చెబుతున్నాయి. నయా ట్రెండ్‌ రాకతో సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌లు వింత వింత అనుభూతులతో కూడిన సెల్ఫీ ఫోటోలతో దర్శనమిస్తున్నాయి. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయేంత వరకు ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడి నుంచైనా స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా సెల్ఫీ ఫోటోలను చిత్రీకరించి వాటిని తమకు కావల్సిన వారికి షేర్‌ చేసకుంటున్నారు.  

మానవత్వం మరచి..
⇔  మాజీ రాజ్యసభ సభ్యుడు,టీడీపీ నేత నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినపుడు కామినేని ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం విమర్శలకు దారి తీసింది. హరికృష్ణ భౌతిక కాయంతో సెల్ఫీ తీసుకొని సోషల్‌మీడియాలో అప్‌లోడ్‌ చేయడంతో అది వైరల్‌గా మారింది. మానవత్వం మరిచి ఇలా ప్రవర్తించడం ఏంటని చీవాట్లు పెట్టారు. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు విచక్షణ మరచి ప్రవర్తిస్తారా అని దుమ్మెత్తి పోశారు.   

⇔  రెండేళ్ల క్రితం నగరంలో నెహ్రూ జూ పార్క్‌ సందర్శనకు వచ్చిన పదోతరగతి విద్యార్థి ఫౌంటేన్‌పైకి ఎక్కి సెల్ఫీ తీయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో 15 అడుగుల ఎత్తునుంచి జారి నీటిలో పడిపోయాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు.  

మోతీనగర్‌కు చెందిన అభిషేక్‌ అనే బీటెక్‌ విద్యార్థి శామీర్‌పేట మండలం హనుమండ్ల కుంట వద్ద సెల్ఫీ దిగుతున్న క్రమంలో కుంటలో పడి నీటమునిగి మృతి చెందాడు.   

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఓ పదోతరగతి విద్యార్థి గూడ్స్‌ రైలు ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి ప్రమాదానికి గురయ్యాడు.

 రాజస్థాన్‌లో కూతురికి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తరువాత తల్లిదండ్రులు  షాపింగ్‌మాల్‌కు వెళ్లారు. ఎస్కలేటర్‌పై వెళుతూ సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే తల్లి చేతిలో ఉన్న చిన్నారి ఎస్కలేటర్‌ బెల్ట్‌ తగిలి కిందకు పడి ప్రాణాలు కోల్పోయింది. అదే రాష్ట్రంలో కొండపై సెల్ఫీ తీసుకుంటూ ఓ యువకుడు మృతి చెందాడు. పది రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

సెల్ఫీలకు అడిక్ట్‌ అవుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఒంటరిగా బాధపడేవారు సెల్ఫీలను షేర్‌ చేస్తుంటారు. సరదాగా మొదలయ్యే ఈ అలవాటే చివరకు ఒక వ్యసనంలా మారుతుంది. ఈ కారణంగా వారి వ్యక్తిగత జీవితం కూడా నాశనం చేసుకుంటారు. ఒంటరితనం, నిద్రలేమితో బాధపడుతూ అనారోగ్యానికి గురవుతుంటారు. చివరకు జీవితాలు చిన్నాభిన్నం చేసుకుంటారు.ఇటువంటి సమస్య ఉన్న వారు వెంటనే మానసిక వైద్యుడినిసంప్రదించాలి.– డాక్టర్‌ అనిత,  మానసిక వైద్యురాలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top