సిఫార్సు ఉంటేనే సీటు! | Seats are Offered Only to Those Recommended in BC Hostels Nizamabad | Sakshi
Sakshi News home page

సిఫార్సు ఉంటేనే సీటు!

Aug 24 2019 12:00 PM | Updated on Aug 24 2019 12:00 PM

Seats are Offered Only to Those Recommended in BC Hostels Nizamabad - Sakshi

నిర్మల్‌కు చెందిన ఓ విద్యార్థికి ఇంటర్‌లో 952 మార్కులు వచ్చాయి. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్‌ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ బీజెడ్‌సీ కోర్సులో సీటు లభించింది. అయితే నిర్మల్‌ నుంచి వచ్చి నిజామాబాద్‌లో చదువుకోవడం కష్టమవుతుందనే ఉద్దేశంతో బీసీ హాస్టల్‌లో ఉండి చదువుకోవాలనుకుంది. ఇందుకు జిల్లా కేంద్రంలోని బీసీ హాస్టల్‌లో దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తులు చేసుకున్న ఇతర విద్యార్థినుల కంటే ఈ విద్యార్థికి అధికంగా మార్కులున్నాయి. అయినా బీసీ సంక్షేమశాఖ అధికారులు సీటు ఇవ్వలేదు. ఎందుకివ్వడం లేదని అధికారులను అడిగితే మీది వేరే జిల్లా, సీట్లు ఖాళీ లేవని సాకులు చెబుతూ కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు. సదరు విద్యార్థి కన్నా తక్కువ ఉన్న వేరే విద్యార్థినులకు మాత్రం సీటు లభించడం గమనార్హం.

సాక్షి, నిజామాబాద్‌ : వెనుకబడిన తరగతుల(బీసీ) పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్ల సీట్లకు రాజకీయ రంగు పులుముకుంది. మంత్రులు, ఎమ్మెల్యేల రికమండేషన్‌ ఉందా..! అయితే నీకు సీటు ఓకే అంటున్నారు జిల్లా బీసీ సంక్షేమాధికారులు. ఏ నిబంధనలూ చూడకుండా ఆ విద్యార్థికి సీటు పక్కా చేసేస్తున్నారు. దీంతో అన్ని విధాలుగా అర్హులైన నిరుపేద విద్యార్థులకు బీసీ హాస్టళ్లలో సీటు అందని ద్రాక్షలా మారింది. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ఉన్న బీసీ హాస్టళ్లలో సీట్ల కోసం రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు రికమండేషన్‌ లేఖలు రాసి పంపడం చర్చనీయంగా మారింది. జిల్లాలో బీసీ పోస్టు మెట్రిక్‌ హాస్టళ్లు మొత్తం 13 ఉన్నాయి. ఇందులో 7 బాలికలు, 6 బాలుర హాస్టళ్లున్నాయి. ఒక్కో హాస్టల్‌లో ప్రభుత్వం నుంచి 100 సీట్లు మాత్రమే మంజూరు ఉంటాయి. కాగా జిల్లా కేంద్రంలో కళాశాలలు అధికంగా ఉండడంతో ఇక్కడి హాస్టళ్లకు డిమాండ్‌ బాగా పెరిగిపోయింది. ఎంతలా అంటే ఒక సామాన్య పేద విద్యార్థికి మెరిట్‌ మార్కులున్నా అధికారులను ప్రాధేయపడితే గాని సీటు దొరకదు.

ఆ హాస్టల్‌లో ఒక్క సీటు కోసం 170 దరఖాస్తులు
జిల్లా కేంద్రంలో రెండు బాలికలు, రెండు బాలుర హాస్టళ్లు మాత్రమే ఉన్నాయి. నాందేవ్‌వాడలోని బీసీ(ఎ) బాలుర హాస్టల్‌లో ఈ ఏడాది 100 సీట్లకు గాను ఒక సీటు మాత్రమే ఖాళీ ఉంది. ఒక్క సీటు కోసం 170 వరకు దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తుల్లో ప్రజాప్రతినిధులవి ఓ ఇరవై వరకున్నాయి. అయితే అదనంగా 20 సీట్లు బీసీ సంక్షేమ శాఖ నుంచి మంజూరు చేయించుకుని కొంతమందికి సీట్లు ఇచ్చారు. మిగతా 160 మందికి సీట్లు లభించని పరిస్థితి నెలకొంది. అదే విధంగా మిర్చి కాంపౌండ్‌లో ఉన్న బీసీ బాలుర హాస్టల్‌(బి)లో 100 సీట్లు మంజూరు ఉండగా, 23 సీట్లు ఖాళీ ఉన్నాయి. 23 సీట్లకు గాను 74 దరఖాస్తులు వచ్చాయి.

ఈ దరఖాస్తుల్లో కూడా ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలున్నాయి. మొదటి జాబితాలో 23 సీట్లు భర్తీ చేయగా, ఇంకా 50 మందికిపైగా విద్యార్థులకు సీటు దొకరని పరిస్థితి ఉంది. అలాగే దుబ్బలో గల బాలికల (బీ,సీ) హాస్టల్‌లో 200 సీట్లు మంజూరుంటే 40 సీట్లు ఖాళీ ఉన్నాయి. ఈ 40 సీట్లకు గాను 220 వరకు దరఖాస్తులు వచ్చాయి. ఇక్కడ కూడా మంత్రుల, ఎమ్మెల్యేల రికమండేషన్‌ల లేఖలు వచ్చాయి. అయితే మొదటి జాబితాలోనే 40 ఖాళీ సీట్లను భర్తీ చేశారు. ఇంకా 180 మంది విద్యార్థినులకు సీట్లు కలగానే మారాయి. ఇక సుభాష్‌నగర్‌లో గల బాలిక (ఎ) హాస్టల్‌లో సీట్లు ఖాళీగా లేక ఇక్కడ దరఖాస్తులు స్వీకరించలేదు.

మెరిట్‌ నిబంధనలు తూచ్‌
జిల్లా కేంద్రంలో విద్యనభ్యసించే వారు మన జిల్లావారితో పాటుగా కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, వరంగల్‌ జిల్లాలకు చెందిన విద్యార్థులున్నాయి. అయితే బీసీ హాస్టళ్లలో సీటు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ప్రభుత్వ కళాశాలల్లో, పాఠశాలల్లో చదివి ఉండాలి. ఇంటర్, పాలిటెక్నిక్‌ చదువుతున్న వారికి టెన్త్‌లో, డిగ్రీ చదువుతున్న వారికి ఇంటర్‌లో, పీజీ చదివే విద్యార్థులకు డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. మెరిట్‌ మార్కులు ఎవరికి ఎక్కువగా ఉంటే వారికి సీట్లు ఇవ్వాలి.

కానీ బీసీ సంక్షేమాధికారులు ఈ నిబంధనను తుంగలో తొక్కారనే ఆరోపణలు వస్తున్నాయి. హాస్టళ్లలో ఖాళీ ఉన్న ఐదు, పది శాతం సీట్లను కూడా ప్రజాప్రతినిధుల రికమండేషన్‌కు కేటాయిస్తున్నారు. దీంతో అసలైన పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. కాగా మన జిల్లాకు చెందిన వారికి తప్ప.. మెరిట్‌ మార్కులు అధికంగా ఉన్న ఇతర జిల్లాల విద్యార్థులకు సీట్లు దక్కడం లేదు. దీంతో వారి చదువు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఏర్పడుతుందని బాధిత విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని ఓ హాస్టల్‌ వార్డెన్‌తో విద్యార్థి తల్లిదండ్రులు వాగ్వాదం పెట్టుకున్నారు. పేద విద్యార్థులకు సీట్లు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీట్ల పెంపుకోసం కృషి చేయని నాయకులు
జిల్లాలో ఉన్న బీసీ పోస్టుమెట్రిక్‌ హాస్టళ్లలో సీట్ల కోసం ప్రతియేటా వందల కొద్దీ దరఖాస్తులు విద్యార్థుల నుంచి వస్తున్నా, అందులో 20 శాతం మంది విద్యార్థులకు మాత్రమే సీట్లు దొరుకుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్‌కు తగ్గట్లుగా సీట్లను పెంచకపోవడంతో పేద విద్యార్థులందరికీ న్యాయం జరగడం లేదు. అయితే సీటు కావాలని వార్డెన్‌లకు, బీసీ సంక్షేమాధికారులకు లేఖలు రాస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు అదనంగా హాస్టల్‌ కాని, సీట్లు కాని మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడితేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement