సర్పంచులకు వేతనాలు

Sarpanch Salaries Released In Adilabad - Sakshi

మంజూరు చేసిన ప్రభుత్వం

మాజీలకు నాలుగు నెలలు... కొత్తవారికి నాలుగు నెలలు

రూ.1.41 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు

సాక్షి,  జైనథ్‌/  ఆదిలాబాద్‌: తాజామాజీ, కొత్త సర్పంచులకు ఎట్టకేలకు వేతనాలు విడుదలయ్యాయి. నూతన సర్పంచులుగా కొలువుదీరి ఏడు నెలలు గడుస్తుండగా గడిచిన నాలుగు నెలలకు సంబంధించిన వేతనాలు విడుదల చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. 2018లో నాలుగు నెలల పెండింగ్‌ వేతనాలు కూడా విడుదల చేయడంతో మాజీ సర్పంచుల ఎదురుచూపులు ఫలించాయి. కొత్త గ్రామపంచాయతీలు ఏర్పడక ముందు 240 గ్రామ పంచాయతీలు ఉండగా, ప్రస్తుతం 467 గ్రామ పంచాయతీలు జిల్లాలో ఉన్నాయి. అన్ని గ్రామపంచాయతీ సర్పంచులకు వేతనాలు విడుదలకు డీపీవో ఖాతకు నిధులు జమ అయ్యాయి.

రూ. 1.14కోట్లు విడుదల..
జిల్లా వ్యాప్తంగా  467 గ్రామ పంచాయతీలకు రూ.1.14కోట్ల వేతనాలు జమ చేసేందుకు నిధులు విడుదలయ్యాయి. 2018లో మాజీ సర్పంచుల హయాంలో నాలుగు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటికి సంబంధించిన నిధులు సైతం సర్దుబాటు చేసారు. 2018 జనవరి, ఫిబ్రవరి, మార్చి, జూలై నెలలకు సంబంధించిన బకాయి పడిన వేతనాలు మొత్తం డీపీవో ఖాతాలకు జమయ్యాయి. పాత సర్పంచులు 240మందికి ఒక్కొక్కరికి 20వేల (నాలుగు నెలలకు కలిపి) చొప్పున రూ.48లక్షలు విడుదలయ్యాయి. కొత్త సర్పంచులు 2019లో ఫిబ్రవరిలో కొలువు దీరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారికి ఒక్కసారి కూడా వేతనాలు మంజూరు కాలేదు. ప్రస్తుతం ఫిబ్రవరి, మార్చి, ఎప్రిల్, మే నెలలకు సంబంధించిన వేతనాలు అందనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 467 గ్రామ పంచాయతీలకు ఒక్కొక్క సర్పంచ్‌కు రూ.20వేల (నాలుగు నెలలు) చొప్పున మొత్తం 93లక్షలు విడుదలయ్యాయి.

త్వరలోనే జీపీ ఖాతాల్లోకి...
వేతనాలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ   జీపీ ఖాతాల్లోకి డబ్బులు జమ కాలేదు. డీపీవో ఖాతా నుంచి ట్రెజరీకి, అక్కడి నుంచి గ్రామ పంచాయతీల వారీగా ఖాతాల్లోకి జమ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో త్వరలోనే సర్పంచుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. కాగా ఎప్పటి నుంచో వేతనాల కోసం ఎదురు చూస్తున్నామని, వేతనాలు విడుదల చేయడం సంతోషకరమని సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చాలా సంతోషం
సర్పంచులు కొలువుదీరి 7 నెలలు గడుస్తుంది. అయిన ఇప్పటి వరకు వేతనాలు రాలేదు. 7నెలలుగా వేతనాల కోసం ఎదురుచూస్తున్నాము. ఎట్టకేలకు నాలుగు నెలల వేతనాలు విడుదల చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సంతోషంగా ఉంది. ఒక్కొక్కరికి నాలుగు నెలల చొప్పున రూ. 20వేలు వస్తాయి. ప్రభుత్వం నుంచి వేతనాలు అందుకోవడం ఆనందంగా ఉంది. – ఎడ్మల పోతరెడ్డి, సర్పంచ్‌ పూసాయి, జైనథ్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top