‘సాక్షి’ డబుల్ ధమాకా

‘సాక్షి’ డబుల్ ధమాకా - Sakshi


 తెలంగాణరాష్ట్రావతరణ వేడుక ల సందర్భంగా రెండు ఉత్తమ అవార్డులు

 ఉత్తమ కళాకారుడిగా కార్టూనిస్టు శంకర్

 ఉత్తమ ఫొటో జర్నలిస్టుగా అర్వపల్లి విలేకరి శ్రీరంగం వెంకన్న

 ఇద్దరికీ నేడు జిల్లా మంత్రి చేతుల మీదుగా పురస్కారం


 

 నల్లగొండ టుటౌన్: తెలుగు పత్రికా రంగంలో తనదైన శైలిలో పాఠకులకు సమాచారాన్ని చేరవేస్తున్న ‘సాక్షి’ దినపత్రికకు తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా సముచిత గౌరవం లభించింది. ‘సత్యమేవ జయతే’ అంటూ ‘రేపటికి ముందడుగు’ వేయాలన్న స్ఫూర్తితో ముందుకెళుతోన్న ‘సాక్షి’ కుటుంబానికి చెందిన ఇద్దరు సభ్యులకు జిల్లా స్థాయి ఉత్తమ అవార్డులు లభించాయి. హైదరాబాద్‌లోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో కార్టూనిస్టుగా పనిచేస్తున్న మన జిల్లా వాసి పామర్తి శంకర్‌కు ఉత్తమ కళాకారుడి కేటగిరీలో పురస్కారం లభించింది. అదే విధంగా అర్వపల్లి మండల విలేకరిగా పనిచేస్తున్న శ్రీరంగం వెంకన్నకు ఉత్తమ జర్నలిస్టు ఫొటో కేటగిరీలో పురస్కారం వచ్చింది. ఈ రెండు పురస్కారాలను మంగళవారం ఉదయం జిల్లా కేంద్రంలోని పోలీస్‌పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న రాష్ట్రావతరణ వేడుకల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి అందజేయనున్నారు.

 

 దశాబ్దాలుగా సేవలు...

 జిల్లా కేంద్రానికి చెందిన పామర్తి శంకర్ వివిధ పత్రికలలో 18 సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు. ‘‘సాక్షి’’ స్థాపించినప్పటి నుంచి పని చేస్తున్న శంకర్ గతంలో వార్త, ఆంధ్రజ్యోతిలలో పని చేశారు. శంకర్ వేసిన పొలిటికల్ కార్టూన్లకు  దేశ, అంతర్జాతీయ స్థాయిలో 40 వరకు అవార్డులు వచ్చాయి. అదే విధంగా ఇటీవల వరల్డ్ ప్రెస్ కార్టున్ అనే అంతర్జాతీయ అవార్డు లభించింది. ఆయన ప్రస్తుతం ఫోరం ఫర్ పొలిటికల్ కార్టునిస్ట్ హైదరాబాద్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. అర్వపల్లి మండల రిపోర్టర్ శ్రీరంగం వెంకన్న ఎంతో సాహసోపేతంతో ఉగ్రవాదుల ఫొటోలు తన కెమెరాలో చిత్రీకరించి ప్రపంచానికి చూపించారు. ఈయన 1993 నుంచి పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నారు. మొదట ఆంధ్రభూమి, ఆంద్రజ్యోతి, ఈనాడు పత్రికలలో పని చేశారు. ఆ తర్వాత ‘‘సాక్షి’’ ప్రారంభం నుంచి అర్వపల్లి మండల విలేకరిగా విధులు నిర్వహిస్తున్నారు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top