రేపు సరూర్‌నగర్‌లో సకలజనుల భేరి సభ!

Sakala Janula Bheri Meeting At Saroornagar - Sakshi

సాక్షి, సంగారెడ్డి: ఆర్టీసీ కార్మికులు 25 రోజులుగా చేపడుతున్న నిరవధిక సమ్మెను చూస్తుంటే గర్వంగా ఉందని టీజేఎస్‌ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సంగారెడ్డి బస్టాండ్‌లో మంగళవారం ఆర్టీసీ కార్మికులను కలిసి సంఘీభావం తెలిపిన ఆయన సమ్మెకు టీజేఎస్‌ తరఫున మద్దతు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు చేసే సమ్మెకు గొప్ప విశిష్టత ఉందని అభిప్రాయపడ్డారు. బుధవారం హైదరాబాద్ సరూర్‌నగర్‌ గ్రౌండ్‌లో.. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే సకలజనుల భేరి సభకు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ సమ్మెకు మద్దతిచ్చి ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకోవాలని ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

సమ్మె విరమించకపోతే ప్రైవేట్ బస్సులను నడిపిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్మికులను బెదిరిస్తున్నారని కోదండరాం విమర్శించారు. సమ్మె ముందు ఆర్టీసీ 25 రోజుల ఆదాయం.. సమ్మెలో ఉన్నప్పుడు 25 రోజుల ఆదాయాన్ని కేసీఆర్‌ గమనించాలని అన్నారు. సీఎం కేసీఆర్‌కు పరిపాలన ఎలా చేయాలో చెప్పాల్సిన దుస్థితి వచ్చిందని కోదండరాం మండిపడ్డారు. ఎంతో మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు అనంతరం చర్చలకు పోతే.. 500 మంది పోలీసులను చుట్టూ పెట్టుకొని చర్చలు జరుపుతారా అని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు  ప్రత్యేక జీత భత్యాల కోసం సమ్మె చేయడం లేదని, న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నారని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top