బీమా.. ధీమా

Rythu Bheema Scheme Benefits To Farmers Families - Sakshi

మహబూబ్‌నగర్‌ రూరల్‌ : రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం రైతు కుటుంబాలకు అండగా నిలుస్తోంది. కుటుంబ పెద్దను కోల్పోయిన రైతు కుటుంబానికి బాసటగా ఉండేలా రూ.5 లక్షల పరిహారం చెల్లించేలా టీఆర్‌ఎస్‌ నేతృత్వంలోని గత ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం విదితమే. గత ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం రైతుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. 

ఇప్పటివరకు.. 
రైతు బీమా పథకం ప్రారంభమయ్యాక జిల్లాలో 350 కుటుంబాలకు పరిహారం అందింది. ఈ పథకం అమల్లోకి వచ్చాక జిల్లాలో 375 మంది రైతులు వివిధ కారణాలతో మృతి చెందారు. ఇందులో 350 కుటుంబాలకు పరిహారం అందజేశారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.16.25 కోట్ల పరిహారం అందింది. మిగతా 25 మంది రైతుల కుటుంబాలకు కూడా త్వరలోనే పరిహారం అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏ కారణంతోనైనా రైతు మృతి చెందితే ఆ కుటుంబానికి బీమా కింద రూ.5 లక్షల పరిహారం అందిస్తారు. ఇందుకు గాను అర్హత ఉన్న రైతులను ఇప్పటికే గుర్తించిన అధికారులు వారి వివరాలు, నామినీల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. అలా అర్హులుగా గుర్తించిన అన్నదాతల్లో ఎవరైనా అకాల మరణం పొందితే ఆ కుటుంబ సభ్యులకు పరిహారం అందుతోంది. 

కుటుంబానికి అండగా నిలిచేలా... 
రైతు అకాల మరణం పొందితే ఆయన కుటుంబం వీధిన పడకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం గత ఆగస్టు 14వ తేదీ నుంచి పథకం అమల్లోకి వచ్చింది. పట్టాదారు పాసు పుస్తకం కలిగి ఉండి 18 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వయస్సు గల రైతులు ఈ పథకానికి అర్హులు. రైతు ప్రమాదవశాత్తు, అనారోగ్యంతోనో మరణించినా.. ఆత్మహత్య చేసుకున్నా..  లేదా ఏ కారణంతో మరణించినా రూ.5 లక్షల బీమా వర్తించేలా జీవిత బీమా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించిన విషయం విదితమే. రైతు మరణించిన 24 గంటల్లోగా అధికారులు బీమా అందించే ప్రక్రియను ప్రారంభించేలా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. పథకానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు సూచించే నామినీ పేరిట బీమా పరిహారానికి సంబంధించిన చెక్కు మంజూరు చేస్తున్నారు.  

గతంతో పోలిస్తే భిన్నం 
గతంలో ఎవరైనా రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటే రూ. 6 లక్షలు పరిహారం ఇచ్చే పథకం అమల్లో ఉంది. అయితే ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన బాధిత రైతు కుటుంబాలు చాలా తక్కువ. చనిపోయిన రైతుకు ఎంత అప్పు ఉందో వాటిని రుజువు చేసుకోవాల్సి వచ్చేది. రైతులు పంటల సాగు కోసం చేసే ప్రైవేట్‌ అప్పులకు రుజువులు దొరికేవి కాదు. వడ్డీ వ్యాపారుల నుంచి సాక్ష్యాలు తీసుకురాలేక బాధిత కుటుంబాలు కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగలేక ఇబ్బందులు పడేవారు. రైతు బీమా పథకం అమల్లోకి వచ్చిన తర్వాత నష్టపరిహారం అందడంలో ఆటంకాలు తొలగిపోయాయి. ఏ కారణంతో మరణించినా రైతు కుటుంబానికి బీమా వర్తిస్తోంది. ఇంటి పెద్దను కోల్పోయి కష్టాల్లో ఉన్న కుటుంబానికి రూ.5 లక్షల బీమా సొమ్ము వస్తుండడంతో రైతుల కుటుంబాలు ఊరట చెందుతున్నాయి. 

పకడ్బందీగా అమలు చేస్తున్నాం.. 
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నాం. ఈ పథకం కింద ఇప్పటి వరకు 350 మంది రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున రూ. 16.25 కోట్ల పరిహారం అందింది. మిగతా 25 మందికి త్వరలోనే పరిహారం అందుతుంది. ఆ ప్రక్రియ నడుస్తోంది. 
– సుచరిత, జిల్లా వ్యవసాయశాఖ అధికారి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top