బర్డ్స్‌ ఫొటోగ్రఫీ అంత తేలిక కాదు.. | Sakshi
Sakshi News home page

బర్డ్స్‌ ఫొటోగ్రఫీ అంత తేలిక కాదు..

Published Tue, Jul 23 2019 10:44 AM

Retired Employee Birds Photography - Sakshi

పదవీ విరమణ చేసిన తర్వాత చాలా మంది ఉద్యోగిణులు ఇంట్లో టీవీ సీరియళ్లు చూస్తూనో.. కిట్టీ పార్టీల్లో కాలక్షేపం చేస్తూనో.. చుట్టుపక్కల వాళ్లతో సరదాగా షాపింగ్‌ చేస్తూనో గడుపుతుంటారు. అయితే.. డాక్టర్‌ వీ.ఏ.మంగ మాత్రం పదవీ విరమణ అనంతరం తన అభిరుచికి పదును పెట్టుకున్నారు. తనకున్న అలవాటును సద్వినియోగం చేసుకునే దిశగా చాలా ఓర్పుతోఫొటోగ్రఫీ నేర్చుకోవడమే కాదు.. అందమైన పక్షుల చిత్రాలు కూడా తీసి శెభాష్‌ అనిపించుకున్నారు.

హైదరాబాద్‌లోని ఏఎస్‌రావునగర్‌లో నివసించే వీ.ఏ.మంగ నారాయణగూడలోని భవన్స్‌ న్యూసైన్స్‌ కళాశాలలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ 2002లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ప్రకృతి అంటే ఎంతో ఇష్టంగా భావించే మంగ ఆ ప్రకృతిలోని రమణీయమైన పక్షులను ఫొటోలు తీయాలనే ఉద్దేశంతో ప్రారంభించిన బృహత్తర కార్యక్రమం విజయవంతంగా ముగించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎన్నో రకాల పక్షులు ఉన్నాయని, అవి కొండ ప్రాంతాల్లో, చెరువుల వద్ద, అడవులు, పార్కుల్లో ఉన్నాయని తెలుసుకున్న మంగ వాటి ఫొటోలు తీసేందుకు నడుం బిగించారు. ఐదేళ్ల పాటు శ్రమించిన ఆమె 500 పక్షుల చిత్రాలను తీశారు. అందులో 266 రకాల పక్షులున్నాయి. కేవలం ఫొటోలు తీసి గాలికి వదిలేయలేదు. వాటి పూర్తి వివరాలను అందంగా మల్టీకలర్‌లో రూపొందించిన ‘బర్డ్స్‌ ఆఫ్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌’ గ్రంథాన్ని తీసుకొచ్చారు. ఇందుకోసం ఆమెపడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. ఒక లెక్చరర్‌గా ఉండి హైదరాబాద్‌లో ఇన్ని రకాల పక్షులు ఉన్నాయని తెలియజేసిన ప్రయత్నం అద్భుతంగా ఉందని ఐపీఎస్‌ అధికారిణి తేజ్‌దీప్‌కౌర్‌ ఆమెను ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా అభినందించారు. ఈ పక్షుల వివరాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా ఇటీవల ఆమె ప్రారంభించారు. పక్షులకు సంబంధించిన పుస్తకాలు చాలా వచ్చినప్పటికీ మంగ ప్రచురించిన గ్రంథం చాలా ప్రత్యేకంగా, వివరణాత్మకంగా ఉందని, చాలా కొత్త విషయాలు విపులీకరించారంటూ ప్రకృతి ప్రేమికులు ప్రశంసించారు.

వీ.ఏ.మంగ తీసిన పక్షుల ఫొటోలతో ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శన..
బర్డ్స్‌ ఫొటోగ్రఫీ అంత తేలిక కాదు..
తాను సరదాగా ఫొటోలు తీయడం ఆరంభించి, ఆసక్తితో సీరియస్‌ ఫొటోగ్రాఫర్‌గా మారిపోయి ఐదేళ్లు కష్టపడి తీసిన చిత్రాలతో ఈ పుస్తకాన్ని తీసుకొచ్చినట్లు మంగ తెలిపారు. వేలాది ఫొటోలు తీసినప్పటికీ అందులోంచి 500 చిత్రాలను ఎంపిక చేశామని, వీటిలో ఉన్న మరో 226 పక్షులను డాక్యుమెంట్‌ చేయడం జరిగిందన్నారు. ఫొటోగ్రఫీ అంటే తనకెంతో ఇష్టమని, పక్షులంటే ప్రాణమని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం తనకు లభించిన పూర్తి కాలాన్ని సిటీలో ఉన్న పక్షులను చూడటం, కెమెరాల్లో బంధించడం చేస్తూ వచ్చానన్నారు. వన్‌ ట్రీ మెనీ బర్డ్స్‌ పేరిట తొలుత కాఫీ టేబుల్‌ బుక్‌ను విడుదల చేశారు. ఆ పుస్తకానికి లభించిన విశేష స్పందనతో ఇప్పుడు రెండో గ్రంథం బర్డ్స్‌ ఆఫ్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ పుస్తకాన్ని తీసుకొచ్చారు. హైదరాబాద్‌లో పక్షులకు కొదవ లేదని, మిగతా నగరాలతో పోలిస్తే ఇక్కడే పక్షులు ఎక్కువగా ఉన్నాయన్నారు. బర్డ్స్‌ ఫొటోగ్రఫీ అంత ఈజీ కాదని మామూలు కెమెరాలు ఇందుకు సరిపోవని, లాంగ్‌ లెన్స్‌ ఉన్న కెమెరాలు తీసుకొని ప్రతిరోజూ కొండకోనలు, చెరువులు, అడవుల్లో తిరగేదానినని ఆమె వెల్లడించారు. ప్రతిరోజూ 800 నుంచి వెయ్యి వరకు ఫొటోలు తీసినా అందులో అరుదైన ఫొటోలు ఎంపిక చేసుకొని ఎప్పటికప్పుడు కంప్యూటర్‌లో అప్‌లోడ్‌ చేసుకునేదానినని వెల్లడించారు. బర్డ్స్‌ ఫొటోగ్రఫీ చేయాలంటే ముందుగా బర్డ్స్‌ వాచ్‌ ముఖ్యమని, చాలా మంది 20 ఏళ్లు కష్టపడి ఈ ఫొటోలను తీసేవారని, అది కూడా ముగ్గురు, నలుగురు కలిసి తీసేవారని, తాను మాత్రం ఒక్కదాన్నే ఈ ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement