రిజర్వేషన్లు, ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం

Reservations are important for economic development - Sakshi

     పలు అంశాలపై బీసీ కమిటీ ఏకాభిప్రాయం 

     రెండొందల అంశాలతో ప్రాథమిక నివేదిక 

     మంగళవారం మరోసారి కమిటీ సమావేశం

     బీసీ నివేదికకు తుదిరూపు!

సాక్షి, హైదరాబాద్‌: వెనుకబడిన కులాల సమగ్రాభివృద్ధి కోసం తయారు చేస్తున్న బీసీ నివేదిక రూపకల్పన తుదిదశకు చేరుకుంది. సోమవారం అసెంబ్లీలోని సమావేశ మందిరంలో భేటి అయిన బీసీ కమిటీ సభ్యులు.. నివేదికలోని అంశాలపై మరోమారు చర్చించి పలు అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. సుమారు రెండొందల అంశాలతో రూపొందించిన ప్రాథమిక నివేదికలో రిజర్వేషన్లు, విద్య, ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యమిచ్చారు. ప్రస్తుతానికి తుదిదశలో ఉన్న ప్రాథమిక నివేదికపై సభ్యులు మంగళవారం మరోమారు భేటీ కానున్నారు. అనంతరం పూర్తిస్థాయి నివేదికను ముఖ్యమంత్రికి సమర్పిస్తామని కమిటీ సభ్యుడు, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. రాష్ట్రంలో బీసీల అభివృద్ధి కోసం శాసనసభ స్పీకర్‌ మధుసుదనాచారి, మండలి చైర్మన్‌ స్వామిగౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న, మంత్రులు ఈటల రాజేందర్, పద్మారావుతో పాటు బీసీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.  

‘ఐఐటీ, ఐఐఎం’లోనూ రీయింబర్స్‌మెంట్‌
బీసీ నివేదికలో విద్యకే ప్రాధాన్యమిచ్చారు. పోస్టుమెట్రిక్‌ కోర్సులు చదువుతున్న బీసీ విద్యార్థులకు ర్యాంకుతో నిమిత్తం లేకుండా పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింపజేయాలనే అంశంపై సభ్యులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఐఐటీ, ఐఐఎం, నీట్‌ విద్యార్థులకూ రీయింబర్స్‌మెంట్‌ వర్తింపజేయాలనే అంశానికి మెజారిటీ సభ్యులు మద్దతు తెలిపారు. 2017–18లో 119 గురుకులాలు ప్రారంభించినా జనాభాకు అనుగుణంగా గురుకులాలు ఏర్పాటు చేయాలనే వాదన వినిపించాయి. దీంతో 119 గురుకులాల ఏర్పాటుకు సభ్యులు మద్దతు తెలిపారు. దీంతో ప్రతి నియోజకవర్గంలో బాలబాలికలకు వేర్వేరుగా గురుకులాలు ఏర్పాటు కానున్నాయి. మరో 61 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయడంతో పాటు ఉమ్మడి జిల్లాల్లో బీసీ స్టడీ సర్కిళ్ల సంఖ్య పెంచడం, కొత్త జిల్లాల్లోనూ సర్కిళ్లు ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించింది. విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 34 నుంచి 50కి పెంచాలని, నామినేటెడ్‌ పోస్టుల్లోనూ 50 శాతం సీట్లు ఇవ్వాలని నిర్ణయించారు.  
బీసీ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు.. 
బీసీ ఉన్నతాధికారులకు ప్రాధాన్యమున్న పోస్టులు ఇవ్వడం లేదనే విమర్శలకు చెక్‌ పెడుతూ కీలక విభాగాల్లో బీసీ అధికారులు ఉండాలనే డిమాండ్‌కు మెజార్టీ సభ్యులు మద్దతు తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం ప్రఖ్యాత సంస్థల భాగస్వామ్యంతో శిక్షణ ఇప్పించాలనే అంశం చర్చలో భాగంగా ప్రస్తావనకు వచ్చింది. ఏటా బీసీ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు, బీసీ ఫెడరేషన్లకు జనాభా ప్రాతిపదికన నిధులివ్వాలనే అంశంపైనా చర్చించారు. బీసీలకు పారిశ్రామిక పాలసీలో ప్రాధాన్యంపైనా సభ్యులు ఏకాభిప్రాయానికి వచ్చారు. బీసీ కులాల రిజర్వేషన్లపై బీసీ కమిషన్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైంది. మొత్తంగా మంగళవారం మరోసారి కమిటీ సభ్యులు సమావేశమై నివేదికను ఫైనల్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top