‘తుంగపాడు’ను రక్షించాలి! | Protect tungapadu | Sakshi
Sakshi News home page

‘తుంగపాడు’ను రక్షించాలి!

Feb 11 2016 3:37 AM | Updated on Aug 20 2018 9:26 PM

‘తుంగపాడు’ను రక్షించాలి! - Sakshi

‘తుంగపాడు’ను రక్షించాలి!

నల్లగొండ జిల్లా దామరచర్లలో 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం వల్ల కృష్ణా నది, తుంగపాడు వాగులు కలుషితం కాకుండా కేంద్ర పర్యావరణ..

యాదాద్రి ప్లాంట్‌కు ప్రత్యేక షరతులతో కేంద్రం ఆమోదం
తుంగపాడు వాగు, కృష్ణా నది కలుషితం కావొద్దు
వాగుకు ఇరువైపులా 100 మీటర్ల బఫర్ జోన్


సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా దామరచర్లలో 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం వల్ల కృష్ణా నది, తుంగపాడు వాగులు కలుషితం కాకుండా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక రక్షణ కల్పించింది. విద్యుత్ కేంద్రం కోసం సేకరించిన ప్రాజెక్టు స్థలం మధ్యలో నుంచి వెళ్తున్న తుంగపాడు వాగును పరిరక్షించాల్సిందేనని, ఎట్టిపరిస్థితుల్లో ఈ వాగును మళ్లించరాదని తేల్చి చెప్పింది. తుంగపాడు వాగు, కృష్ణా నదిల సంరక్షణకు ప్రత్యేక షరతులతో గత నెల 29న యాదాద్రి విద్యుత్ కేంద్రం ‘టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ (టీఓఆర్)’ను ఆమోదించింది. తాజాగా ఈ పత్రాన్ని కేంద్ర పర్యావరణ శాఖ బహిర్గతం చేసింది.

దీని ప్రకారం.. తుంగపాడు వాగుకు ఇరువైపులా కనీసం 100 మీటర్ల బఫర్ జోన్‌ను ఏర్పాటు చేయాలి. ఈ ప్రాంతాన్ని అడవులుగా అభివృద్ధి చేయాలి. వాగులో ప్రవాహం పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. ఈ వాగు ప్రవాహ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎగువన ఉన్న జలాశయం నుంచి క్రమం తప్పకుండా నీటిని విడుదల చేస్తుండాలి. బూడిద కొలను స్థల విస్తీర్ణాన్ని తగ్గించుకోవడానికి ప్రాజెక్టుకు ఉత్తర భాగంలో నిర్మించాలి. అదేవిధంగా తుంగపాడు వాగుకు, బూడిద కొలను మధ్య కనీసం 500 మీటర్ల బఫర్ జోన్‌ను ఏర్పాటు చేయాలి. వాగులో గానీ, కృష్ణా నదిలో కానీ ఎలాంటి కాలుష్య వ్యర్థాలను విడుదల చేయరాదు. గండ్లను పూడ్చి వాగు/నది గట్టును బలోపేతం చేయాలి. సహజ ప్రవాహానికి అడ్డంకిగా మారిన పూడికలను తొలగించాలి. ప్రవాహం నుంచి నీటిని తీసుకోరాదు.

 అడవులను పునరుద్ధరించాలి
ఈ ప్రాజెక్టు ప్రాంతంలో విద్యుత్ కేంద్రం అవసరాలకు వినియోగించని పీఠభూములు తీవ్రంగా కుంగిపోయి ఉన్నాయి. అసలైన అటవీ పర్యావరణ వ్యవస్థకు తగ్గట్లు ఈ భూములను పునరుద్ధరించాలి. అరుదైన చెట్లు, స్థానిక మొక్క జాతుల పెంపకంతోపాటు స్థానిక జంతువులకు ఆవాసంగా ఈ భూమిని వినియోగించాలి. అటవీ జీవజాతుల వలసల నివారణతో పాటు కర్బన వాయువులు, కాలుష్య నిర్మూలనకు ఈ అడవులు ఎంతో తోడ్పాటునిస్తున్నాయి. వీటిని పరిరక్షించుకోవాల్సిన అసవరం ఎంతైనా ఉంది. ఈ ప్రాజెక్టు సమీపంలో ఏర్పాటైన సిమెంటు కర్మాగారాలను దృష్టిలో పెట్టుకుని గాలి, నీరు, భూమి, పర్యావరణంపై పడే మొత్తం ప్రభావంపై అధ్యయనం చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement