నమ్మించి..నట్టేట ముంచారు 

Pooja Silks Lucky Draw Fraud - Sakshi

లక్కీ డ్రా పేరుతో మోసం  

రాధిక చౌరస్తాలోని పూజా సిల్క్స్‌ ఎదుట బాధితుల ఆందోళన 

5 వేల మంది నుంచి రూ.కోటికి పైగా వసూలు

కుషాయిగూడ : లక్కీ డ్రా పేరుతో తమను మోసం చేశారని ఆరోపిస్తూ బాధితులు రాధిక చౌరస్తా లోని పూజ సిల్క్స్‌ ఎదుట ఆందోళన దిగిన సంఘటన శుక్రవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెలితే.. పదేళ్లుగా రాధిక చౌరస్తాలో పూజ సిల్క్స్‌ అండ్‌ జ్యూవెలర్స్‌ పేరుతో బట్టలు, నగల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గత కొంత కాలంగా కస్టమర్లను ఆకట్టుకునేందుకు వెండి ఆభరణాలపై లక్కీ డ్రా పథకాన్ని ప్రవేశ పెట్టారు. వినియోగదారులు ప్రతి నెల రూ. 100 నుంచి రూ.వెయ్యి వరకు చెల్లించేలా పలు స్కీంలను ఏర్పాటు చేశారు. ప్రతి నెల డ్రాలో గెలుపొందిన వారు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. వారికి స్కీంను బట్టి బహుమతి అందజేస్తారు.  వివిధ స్కీంలలో సమారు 5 వేల మందికి పైగా వినియోగదారులు రూ.కోటికి పైగా డబ్బులు చెల్లించారు.  

అయితే ఇటీవల భాగస్వాముల మధ్య విబేధాల కారణంగా షాపు సక్రమంగా తెరవక పోగా, వెండి ఆభరణాలను షో రూంలోంచి తీసివేశారు. దీంతో అనుమానం వచ్చిన ఏజెంట్లు షాపు నిర్వాహకులను నిలదీయగమేగాక డబ్బులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేశారు. దీంతో కొందరికి  డబ్బులు తిరిగి ఇచ్చినట్లు తెలియడంతో శుక్రవారం పెద్ద సంఖ్యలో మహిళలు షాపు వద్దకు చేరుకున్నారు. అయితే షాపు తెరవక పోవడంతో అక్కడే బైఠాయించి న్యా యం చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో కుషాయిగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. షోరూం యజమానులతో చర్చించగా, ఇప్పటికే దాదాపు రూ.60 లక్షలు చెల్లించాలమని, మరో రూ.40 లక్షల  చెల్లించాల్సి ఉందని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,   కొద్దిరోజుల్లోనే అందరి డబ్బులు చెల్లిస్తామని చెప్పగా బాధితులు నిరాకరించారు. దీంతో వారికి రావాల్సిన డబ్బులకు బదులుగా షోరూంలో బట్టలు, వస్తువులు ఇచ్చేలా అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top