నిజామాబాద్ జిల్లా: రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇటీవల తగ్గిపోవడంతో కొందరు తమ స్థిరాస్తిని విక్రయించేందుకు నయా ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. మోర్తాడ్‌కు చెందిన ఓ వ్యక్తి రూ. 18 లక్షలు విలువ చేసే 110 గజాల తన ఇంటిని కేవలం రూ. ఆరు వేలకే లక్కీ డ్రాలో పొందవచ్చంటు కరపత్రాల ద్వారా ప్రచా రం చేస్తున్నాడు. 300 మందికి సభ్యత్వం కల్పిస్తూ రూ.18లక్షలు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.
మహాశివరాత్రి రోజున నిర్వహించే లక్కీ డ్రాలో బంపర్ ప్రైజ్‌గా రూ.18లక్షల విలువ చేసే ఇంటిని, 30 మందికి గృహోపకరణాలను బహుమతిగా ప్రకటించారు. ఇలా ఎంతో మంది తమ పాత కార్లు, ఇంటి స్థలాలను, ఇతర సామగ్రిని మార్కెట్‌లో విక్రయించుకోలే లక్కీ డ్రా ద్వారా మార్కెటింగ్ చేసుకునే పద్ధతిని ఎంచుకుంటున్నారు. లక్కీ డ్రా నిర్వహణపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నా కొందరు ఇలాంటి ప్రయత్నాలను మానడం లేదు.
కఠిన చర్యలు తీసుకుంటాం
ఎవరైనా ప్రభుత్వ అనుమతి లేకుండా లక్కీడ్రాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. మోర్తాడ్‌లో లక్కీడ్రా విషయం మా దృష్టికి వచ్చింది. సదరు వ్యక్తిని హెచ్చరించాం. ప్రజలు లక్కీడ్రాలను నమ్మి మోసపోవద్దు.
– రాము, ఎస్సై, మోర్తాడ్


