కుంటల్లో కబ్జాదారుల కాసుల పంట | Sakshi
Sakshi News home page

కుంటల్లో కబ్జాదారుల కాసుల పంట

Published Mon, Oct 6 2014 2:01 AM

కుంటల్లో కబ్జాదారుల కాసుల పంట - Sakshi

పట్టణంలోని చెరువులు, కుంటలు కబ్జాదారులకు కాసుల పంట పండిస్తున్నాయి. ఇన్నాళ్లు పట్టణంలోని పలుచోట్ల ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వీరు ప్రస్తుతం కుంటలు, చెరువులపై కన్నేశారు. ఫలితంగా పట్టణంలో భూగర్భ జలాల పెంపు కోసం ఉపయోగపడిన ఈ జలాశయాలు క్రమక్రమంగా కుచించుకుపోతున్నాయి. ఇది చాలా ఏళ్లుగా జరుగుతున్నా అధికారులు మాత్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.       - మహబూబాబాద్
- యథేచ్ఛగా భూ ఆక్రమణలు
- పట్టించుకోని రెవెన్యూ అధికారులు
- చెరువుల కబ్జాతో అడుగంటుతున్న భూగర్భ జలాలు
అడుగంటిన భూగర్భ జలాలు..
కుంటలు, చెరువుల విస్తీర్ణం తగ్గడంతో మానుకోటలో భూగర్భ జలాలు పూర్తిగా పడిపోయాయి. బావుల్లో నీరు అడుగంటి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చేతి పంపులు పనిచేయడం లేదు. అధికారుల అండదండలతోనే కబ్జాదార్లు కబ్జాలు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు కబ్జాదారులు ఏకంగా సంబంధిత బై నంబర్లతో పత్రాలను కూడా తయారు చేయించుకోవడం గమనార్హం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కుంటలను, చెరువులను కబ్జా కాకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. కుంటలకు, చెరువులకు హద్దులు నిర్ణయించి ఫెన్సింగ్, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయూలని వేడుకుంటున్నారు. కబ్జాదారులపై కేసులు నమోదు చేసి, తిరిగి ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
 
పట్టణంలో భూముల ధరలకు రెక్కలు

రెండేళ్ల క్రితం వరకు మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న మానుకోట పట్టణం ప్రస్తుతం మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ అయింది. సుమారు 60 కాలనీలు, లక్ష జనాభాతో దినదినం అభివృద్ధి చెందుతోంది. నివేశన స్థలాలకు ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకున్న కబ్జాదారులు చెరువులు, కుంటలను ఆక్రమిస్తున్నారు. మానుకోట శివారులో ఎకరం ధర రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు పలుకుతోంది. పట్టణ శివారులోనూ గజం ధర రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఉంది.
 
కుచించుకుపోతున్న చెరువులు
పట్టణంలోని  పాతబజార్‌లో నిజాం చెరువు(సర్వే నంబర్ 642) విస్తీర్ణం 29 ఎకరాలు ఉన్నట్లు రికార్డుల్లో ఉండగా ఇందులో ఎఫ్‌టీఎల్ కింద ఉన్న 13 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే బంధం చెరువు(సర్వే నెంబర్ 307) 29 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, ఇందులో చాలా మేరకు కబ్జాకు గురికావడంతో చిన్న కుంటగా మారింది. కంబాల చెరువు(సర్వే నెంబర్ 442) 87 ఎకరాల 7 గుంటల విస్తీర్ణంలో ఉండగా కొంత మేర కబ్జా జరిగింది. రాభద్రు చెరువు 14 ఎకరాల విస్తీర్ణం ఉండగా 2 ఎకరాలకుపైగా కబ్జాకు గురైంది.

జానాల చెరువు 201 ఎకరాల్లో ఉండగా 10 ఎకరాలు కబ్జాకు గురైందని అధికారులు చెబుతున్నప్పటికీ సగానికి పైగా భూములు కబ్జాకు గురై చెరువు విస్తీర్ణం పూర్తిగా తగ్గినట్లు ఆ ప్రాంతాన్ని చూస్తే తెలుస్తుంది. గుండ్లకుంట 9 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా ఎకరంన్నర కబ్జాకు గురైందని అధికారులు చెబుతున్నప్పటికీ సగానికిపైగా కబ్జాకు గురైనట్లు ఆ ప్రాంతంలో వెలిసిన గృహాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటికితోడు పలు పార్టీల ఆధ్వర్యంలో చెరువు శిఖం భూముల్లో కాలనీలు ఏర్పాటు చేయడంతో చెరువులు కుంటలుగా, కుంటలు నీటి మడుగులుగా మారిపోయూయి. అధికారులు మాత్రం ఎఫ్‌టీఎల్ స్థలాల్లో గృహాలు నిర్మించుకున్నవారికి నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు.
 
కబ్జాదారులకు నోటీసులు జారీ చేశాం
రాభ ద్రు చెరువుతోపాటు పలు చెరువు శిఖం భూములు కబ్జాకు గురికాగా కబ్జాదారులకు నోటీసులు జారీ చేశాం. శిఖం భూముల్లో నిర్మాణాలు చేపడుతుంటే కూల్చివేస్తున్నాం. భూములకు హద్దు రాళ్లను కేటాయించాం. కబ్జాకు గురికాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం. కొన్నేళ్ల క్రితమే కొంతభూమి కబ్జాకు గురైంది. ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టాం.    
- తిరుపతి, ఆర్‌ఐ

Advertisement
 
Advertisement
 
Advertisement