మాకొద్దీ పోలీసు కొలువు!

Police Constable Candidates Started Training In Telangana State Police Academy - Sakshi

ఉద్యోగంపై ఆసక్తి చూపని 1,370 మంది

శిక్షణ కోసం 3,800 మంది టీఎస్‌ఎస్‌పీ అభ్యర్థుల ఎదురుచూపులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో తెలంగాణ పోలీసు కానిస్టేబుల్‌ అభ్యర్థుల శిక్షణ ప్రారంభమైంది. వివిధ రకాల పోస్టులకు దాదాపు 16 వేల మంది ఎంపికయ్యారు. ఈ సమయంలో 2 విషయాలు చర్చనీయాంశంగా మారాయి. మొదటిది 1,370 మంది పోలీసు ఉద్యోగానికి ఎంపికైనా చేరడానికి ఆసక్తి చూపలేదు. వీరిలో ఎంపిక ప్రక్రియ పూర్తయ్యాక 500 మంది ప్రాథమిక సమాచారం ఇవ్వ లేదు. శిక్షణకు రాలేమని లిఖితపూర్వకంగా రాసిచ్చారు. మరో 750 మంది అసలు అటెస్టేషన్‌ ఫామ్‌లనే సమర్పించలేదు. మిగిలిన 120 మంది మెడికల్‌ పరీక్షలకు హాజరవ్వలేదు.

వీటి వెనక వ్యక్తిగతమైన అంశాలు కారణమై ఉండొచ్చని టీఎస్‌ఎల్‌ పీఆర్‌బీ చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు శుక్రవారం అధికారిక ప్రకటనలో వెల్లడించారు. ఇక రెండో అంశం 3,800 మంది తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌ (టీఎస్‌ఎస్‌పీ) అభ్యర్థులు ఉద్యోగానికి ఎంపికైనా శిక్షణ కోసం పిలుపురాలేదు. వీరి శిక్షణ విషయంపై తెలంగాణ పోలీసుశాఖ ఇంకా ఒక నిర్ణయానికి రాకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఇక సివిల్, ఏఆర్, ఎస్పీఎఫ్, ప్రిజన్స్, ఫైర్, మెకానిక్, డ్రైవర్, ఐటీ విభాగాలు కలిపి దాదాపు 9,200 మంది ట్రైనీలకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 28 కేంద్రాల్లో శిక్షణ ప్రారంభించారు.

వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ.. 
మరో 900 మందిలో 500 మంది వరకు క్రిమినల్‌ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు రిక్రూట్‌మెంట్‌ బోర్డు కమిటీని ఏర్పాటు చేసింది. 200 మంది వైద్య పరీక్షలో విఫలం కాగా, 200 మంది అసంపూర్తిగా వివరాలు సమర్పించారు. టీఎస్‌ఎస్‌పీ శిక్షణ జాప్యమవుతున్న విషయాన్ని ఉన్నతాధికారులు ముందే తెలియజేశారు. సీనియారిటీపై ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే శిక్షణకు సంబంధించిన సమాచారం తెలియజేస్తామంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top