
పీఐబీ అడిషనల్ డైరెక్టర్ టీవీకే రెడ్డి (ఫైల్‌ఫోటో)
తొలి దశ ఎన్నికలు ప్రారంభమైతే ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం..
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికలు ముగిసే వరకూ మీడియాపై కొంత మేర నియంత్రణ అవసరమని పీఐబీ అడిషనల్ డైరెక్టర్ టీవీకే రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రక్రియలో మీడియా చాలా అవసరమని, రహస్య ఓటింగ్ ప్రాంతానికి మినహా అన్ని ప్రాంతాల్లో మీడియా వెళ్లేందుకు అనుమతి ఉందన్నారు. ఇక 126 (ఏ) ప్రకారం ఎగ్జిట్ పోల్స్ ను ప్రసారం చేయరాదని, మొదటి దశ ఎన్నికలు ప్రారంభం అయిన తరువాత ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం.ఉంటుందని చెప్పారు. మిగిలిన ఎన్నికలపై అవి ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే ఓపీనియన్ పోల్స్‌పై ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేశారు.
ఎన్నికలకు 48 గంటల ముందు సోషల్ మీడియాకు సైతం ఎలక్ర్టానిక్, ప్రింట్ మీడియా మాదిరిగానే నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు. అభ్యర్ధులు చివరి 48 గంటల్లో ఛానెల్స్ ద్వారా కూడా ప్రచారం చేయవద్దని కోరారు. పోలింగ్‌కు 48 గంటల ముందు వరకూ ఎలక్ర్టానిక్ మీడియాలో వచ్చే ప్రకటనలకు ప్రి సర్టిఫికేషన్ ఇవ్వాలని తెలిపారు. ఇక ప్రింట్, ఎలక్ర్టానిక్ మీడియాకు వర్తించే నిబంధనలు సోషల్ మీడియాకు వర్తిస్తాయన్నారు. సోషల్ మీడియాపై నిరంతర నిఘా ఉంటుందని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అభ్యర్థి తన ఫేస్‌బుక్ ఖాతాకు సంబంధించి సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇవ్వాలని టీవీకే రెడ్డి పేర్కొన్నారు.
పెయిడ్ న్యూస్..
క్విడ్ ప్రోకోలా వార్తలు ఉంటే పెయిడ్ న్యూస్‌గా పరిగణిస్తారని అన్నారు. పెయిడ్ న్యూస్ మీద ఢిల్లీ హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని చెప్పారు. పెయిడ్ న్యూస్ విషయంలో మీడియాకు ఎన్నికల కమిషన్ ఎలాంటి నోటీస్ ఇచ్చే అధికారం లేదని, ఎన్బీఏ, పీసీఐకి మాత్రమే అధికారాలుంటాయని స్పష్టం చేశారు. అభ్యర్థికి మాత్రమే ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చే అధికారం ఉందని చెప్పుకొచ్చారు. ఒకే వార్త వివిధ పత్రికల్లో ఒకే విధంగా ప్రచురిస్తే అది పెయిడ్ న్యూస్‌గా పరిగణిస్తారన్నారు. గత ఎన్నికల్లో 972 పెయిడ్ న్యూస్ కేసులు నమోదయ్యాయని, 2018 కర్ణాటక ఎన్నికల్లో 15 కేసులు నమోదయ్యాయన్నారు.