కరాటే ప్రభాకర్‌ మృతి

Person Died In An Accident In Adilabad - Sakshi

గత నెల 25న రోడ్డు ప్రమాదంలో గాయాలు 

హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి 

రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు 

సాక్షి, మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ కార్యాయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రభాకర్‌ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. చెన్నూర్‌కు చెందిన వడ్లకొండ ఎల్లయ్య, ఎల్లమ్మ దంపతుల చిన్న కుమారుడు ప్రభాకర్‌ (కరాటే ప్రభాకర్‌) మంచిర్యాల పట్టణంలోని చున్నంబట్టి వాడ వంద ఫీట్ల రోడ్‌ సమీపంలో గత నెల 25న ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఘటనలో తీవ్రగాయాలుకాగా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై ఓంకార్‌ యాదవ్‌ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

అవయవాలు దానం... 
ప్రభాకర్‌ అంగీకారం మేరకు ఆయన అవయవాలను అతని కుటుంబసభ్యులు దానం చేశారు. అందరికి మార్గదర్శకంగా నిలిచాడు.  

కరాటేలో ప్రావీణ్యుడు 
చిన్నతనం నుంచే కరాటేపై ఉన్న మక్కువతో ఇంటర్నేషనల్‌ చాంపియన్‌షిప్‌ సైతం కైవసం చేసుకున్నాడు. పలుమార్లు జాతీయస్థాయి కరాటే పోటీల్లో పాల్గొని గోల్డ్‌మెడల్స్‌ సాధించాడు. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ మంచిర్యాల జిల్లా కోశాధికారిగా పనిచేశాడు. నేటి యువతకు ఆత్మరక్షణ అవసరమని ఉచితంగా మంచిర్యాల జిల్లాలోని పలు ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో కరాటే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాడు. తద్వారా తన ఇంటిపేరు కరాటేగా ముద్ర పడిపోయింది. వడ్లూరి ప్రభాకర్‌ అంటే ఎవరికీ తెలియదు.. కరాటే ప్రభాకర్‌ అంటేనే రెవెన్యూ అధికారులు, తన స్నేహితులకు తెలుస్తుంది.  

నేడు అంత్యక్రియలు 
అవయవదానం అనంతరం నేడు ప్రభాకర్‌ మృతదేహాన్ని  కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. జైపూర్‌ మండలంలోని చెన్నూర్‌లో ఉన్న ప్రభాకర్‌ వ్యవసాయ భూమిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top