తొలిరోజు 31 నామినేషన్లు

Panchayat Third Phases Nominations Adilabad - Sakshi

ప్రారంభమైన మూడోవిడత నామినేషన్ల ప్రక్రియ

తొలిరోజు సంక్రాంతి ఎఫెక్ట్‌

ఇచ్చోడ(బోథ్‌): జిల్లాలో మూడోవిడత జరిగే పంచాయతీ ఎన్నికలకు బుధవారం నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ నెల 18 వరకు నామినేషన్ల ప్రకియ కొనసాగనుంది. తొలిరోజు జరిగిన నామినేషన్ల ప్రకియ మందకొడిగా సాగింది. జిల్లాలో మూడోవిడతలో ఇచ్చోడ, సిరికొండ, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ, ఉట్నూర్‌ మండలాల్లోని 163 సర్పంచ్‌ స్థానాలకు, 1358 వార్డు స్థానాలకు ఎన్నికలు  జరగనున్నాయి. తొలిరోజు నామినేషన్లు నామమాత్రంగానే వచ్చాయి.

163 పంచాయతీలకు 31 నామినేషన్లు దాఖలు అయ్యాయి. 1358 వార్డులకు 28 మాత్రమే వచ్చాయి. బుధవారం సంక్రాంతి కావడంతో ఎక్కువగా నామినేషన్లు దాఖలు కాలేకపోయాయి. గురువారం, శుక్రవారం రోజు అత్యధికంగా నామినేషన్లు దాఖలు కానున్నట్లు తెలుస్తోంది. చాలామంది అభ్యర్థులు ముహూర్తం చూసుకుని నామినేషన్‌ వేసేందుకు సిద్ధమవుతున్నారు. మూడోవిడతలో జరిగే ఎన్నికల్లో అత్యధికంగా ఏజెన్సీ  గ్రామాలు ఉండడంతో ఏకగ్రీవ ఎన్నికలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
 
ముహూర్తం చూసుకున్నాకే..
ఐదేళ్లపాటు సర్పంచ్‌ పదవిలో కొనసాగాలంటే మంచి ముహూర్తం చూసుకోవాలంటున్నారు చాలామంది అభ్యర్థులు. ఈనేపథ్యంలో మూడో విడత తొలిరోజు నామినేషన్లు నామమాత్రంగానే వచ్చాయి. బుధవారం కనుమ పండుగ కావడం, ముహూర్తం కలిసిరాకపోవడంతో గురు, శుక్రవారాల్లో నామినేషన్‌ వేసేందుకు సిద్ధమయ్యారు. నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది. 19న నామినేషన్ల పరిశీలన, 20న అప్పీల్, 21న విచారణ, 22న నామినేషన్ల ఉపసంహరణ, అదేరోజు అభ్యర్థులతోపాటు గుర్తులు ప్రకటిస్తారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top