‘పాలకుర్తి’ సిద్ధాంతి కన్నుమూత

palakurthi Narasimha Siddhanti passed away - Sakshi

అనేక దేవాలయాలకు ప్రతిష్ఠాపన

ఇతర రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాల్లోనూ వైదిక కార్యక్రమాలు

వేల సంఖ్యలో చండీయాగాలు నిర్వహించిన నృసింహరామశర్మ

జగద్గురువులు, పీఠాధిపతులతో ఆయనకు ప్రత్యేక అనుబంధం

పలు పురస్కారాలను అందుకున్న వేదపండితుడు

కొడకండ్ల: జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వేద పండితుడు, పంచాంగ సిద్ధాంతి పాలకుర్తి నృసింహరామ శర్మ పరమపదించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మూడు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తొర్రూరులోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఆరుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పాలకుర్తి లక్ష్మీనారాయణ శాస్త్రీ, రాధమ్మ దంపతుల కుమారుడు నృసింహరామ శర్మ 1922 జూలై 20న జన్మించారు.

ప్రముఖ వేదపండితుడిగా పేరుగాంచిన ఈయన వేలాది దేవాలయాలకు ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించారు.కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాల్లోనూ వైదిక కార్యక్రమాలు, వేల సంఖ్యలో చండీయాగాలు నిర్వహించారు. శృంగేరి జగద్గురువులు, కంచికామకోటి జగద్గురువులు, హంపి పీఠాధిపతులు, శ్రీకరపాత్ర స్వామి, బసవకళ్యాణ్‌ శ్రీమదనానంద సరస్వతీ స్వామి, తంజావూరు రాంబాబా, కుర్తాళం పీఠాధిపతులు, సిద్ధేశ్వరానంద భారతీ స్వామి, చినజీయర్‌ స్వామి, పుష్పగిరి పీఠాధిపతి, విజయదుర్గ పీఠాధిపతి, శ్రీకృష్ణానంద సరస్వతీ స్వామి, శ్రీమాధవానంద సరస్వతీ స్వామి, సద్గురు శివానందమూర్తి వంటి ఎందరో మహనీయులతో ఆయనకు ప్రత్యేక అనుబంధం

ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1999లో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా రెండుమార్లు ఉగాది పురస్కారాలను అందుకున్నారు. నృసింహరామశర్మ సిద్ధాంతితో కేసీఆర్‌కు విడదీయలేని అనుబంధం ఉన్నది. ప్రత్యేక కార్యక్రమాలకు సిద్ధాంతి చేతనే ముహూర్తాలు పెట్టించేవారు. దర్శనం ఆధ్యాత్మిక పత్రిక వారు నృసింహరామశర్మకు ధార్మిక వరేణ్య బిరుదును ప్రదానం చేయగా కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ హాజరై సిద్ధాంతికి నిర్వహించిన పల్లకీ సేవను స్వయంగా మోసి సన్మానించారు. గతంలో కేసీఆర్‌ సిద్దిపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన సందర్భంలో అనేక కార్యక్రమాలకు సిద్ధాంతి ముహూర్తం నిర్ణయించారు. నృసింహరామశర్మ మృతి పట్ల కేసీఆర్‌తోపాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top