చెర్లగూడెం ఎంపీటీసీ స్థానానికి 11న రీపోలింగ్ | on the position of mptc 11 repoling | Sakshi
Sakshi News home page

చెర్లగూడెం ఎంపీటీసీ స్థానానికి 11న రీపోలింగ్

Apr 7 2014 12:20 AM | Updated on Oct 20 2018 5:53 PM

ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం సంగారెడ్డి మండలంలోని ఓ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్‌కు దారితీసింది.

సంగారెడ్డి రూరల్, న్యూస్‌లైన్: ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం సంగారెడ్డి మండలంలోని ఓ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్‌కు దారితీసింది. బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థుల పేర్లు త ప్పుగా ముద్రించడంతో చెర్లగూడెం ఎంపీటీసీ స్థానం పరిధిలోని కాశీపూర్‌లో గల 43వ పోలింగ్ కేంద్రంలో ఈనెల 11న రీపోలింగ్ నిర్వహించనున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మితా సబర్వాల్ రీపోలింగ్ విషయాన్ని ప్రకటించారు. దీంతో 11వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు కాశీపూర్‌లోని 43వ పోలింగ్ కేంద్రంలో ఎంపీటీసీ స్థానానికి మాత్రమే తిరిగి పోలింగ్ నిర్వహిస్తారు.
 
సంగారెడ్డి మండలం చెర్లగూడెం ఎంపీటీసీ స్థానానికి సంబంధించి చెర్లగూడెం, కలివేముల, కాశీపూర్ గ్రామాల్లో మొత్తం ఆరు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కాశీపూర్‌లో 43వ, 44వ నంబర్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 43వ నంబరు పోలింగ్ కేంద్రంలో ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.

బ్యాలెట్ పత్రాల్లో ఎంపీటీసీ అభ్యర్థుల పేర్లు తప్పుగా ఉన్నాయని మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పలువురు ఓటర్లు గుర్తించి విషయాన్ని అధికారులకు తెలియజేశారు.మండలంలోని పోతిరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని మూడో ఎంపీటీసీ స్థానానికి చెందిన బ్యాలెట్ పత్రాలు పొరపాటున కాశీపూర్‌లోని 43వ నంబరు పోలింగ్ కేంద్రానికి వచ్చినట్టు ఎన్నికల సిబ్బంది గుర్తించారు.
 
అప్పటికే 187 ఓట్లు పోల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న జెడ్పీ సీఈఓ ఆశీర్వాదం, ఎన్నికల అధికారి యాస్మీన్ బాషా, ఎంపీడీఓ సంధ్యాగురునాథ్ కాశీపూర్‌కు చేరుకుని ఎంపీటీసీ బ్యాలెట్ పత్రాలను పరిశీలించారు. ఆ వెంటనే చెర్లగూడెం, కలివేములలో అదనంగా ఉన్న ఎంపీటీసీ బ్యాలెట్ పేపర్లను తెప్పించి ఎన్నికల సిబ్బందికి అందజేశారు. దీంతో తిరిగి 43వ నంబరు పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ తిరిగి ప్రారంభమైంది. సాయంత్రం వరకు మొత్తం 550 ఓట్లు పోలయ్యాయి.
 
అయితే కాశీపూర్ 43వ పోలింగ్ కేంద్రంలో ఎంపీటీసీ బ్యాలెట్ పత్రాల ముద్రణలో జరిగిన తప్పిదం తెలుసుకున్న కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి స్మితా సబర్వాల్ రీపోలింగ్ నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపారు. వీటిని పరిశీలించిన ఎన్నికల కమిషన్ సదరు కేంద్రంలో కేవలం ఎంపీటీసీ స్థానానికి మాత్రమే ఈనెల 11న రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది.  బ్యాలెట్ పత్రాల పంపిణీలో నిర్లక్ష్యం వహించిన ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ ఆఫీసర్, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి స్మితా సబర్వాల్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement