రిటైర్మెంట్‌ వయసు పెంపుపై పరిశీలన | Observation on Retirement age hike | Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్‌ వయసు పెంపుపై పరిశీలన

Feb 24 2019 4:52 AM | Updated on Mar 25 2019 3:09 PM

Observation on Retirement age hike - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచాలన్న అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనేది త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత సంకీర్ణ రాజకీయాలే రాజ్యమేలే పరిస్థితులున్నాయన్నారు. అప్పుడు కేంద్రంలో టీఆర్‌ఎస్‌ కీలకపాత్ర పోషించే ఆస్కారం ఏర్పడుతుందని రాష్ట్ర ప్రయోజనాలు సాధించుకునే అవకాశం ఉంటుందన్నారు. అందుకే ఇక్కడ పూర్తిస్థాయి బడ్జెట్‌ కాకుండా ఓటాన్‌ బడ్జెట్‌ను పెట్టినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం 20 లక్షల మంది దరఖాస్తు చేసుకుని ఉండొచ్చని, అయితే వారిలో 75 శాతం మంది చిన్న వ్యాపారాలు, ప్రైవేట్‌ ఉద్యోగాలు, ఇంకా ఏవైనా పనులు చేసుకునే వారు కూడా ఉంటారని చెప్పారు.

ఈ అంశాలన్నీ పరిశీలించి అసలు ఏమీ లేని వారికి నిరుద్యోగ భృతి అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. శనివారం శాసన మండలిలో బడ్జెట్‌ ప్రసంగంపై చర్చకు ఈటల సమాధానమిచ్చారు. ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం తమదని, మార్వాడీకొట్టు మాదిరిగా లాభనష్టాలు బేరీజు వేసుకోదన్నారు. ఈ వ్యాఖ్యలపై షబ్బీర్‌ అలీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో అవి సరికాదనుకుంటే ఉపసంహరించుకుంటామని ఈటల చెప్పారు. రాబోయే 3, 4 నెలల్లోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మరుగుదొడ్లు, స్నానాల గదులు, మెరుగైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడతామన్నారు. పీఆర్సీ తదితర అంశాల్లో మెరుగైన చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన కేసులు కోర్టులో ఉన్నందున, అవి తేలేలోగా పర్మనెంట్‌ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తున్నామని చెప్పారు.

ప్రాజెక్టులపై విమర్శలు సరికాదు...
ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న విమర్శలు సరికాదని మంత్రి అన్నారు. ప్రభుత్వంపై బీజేపీ సభ్యుడు రామచంద్రరావు చేసిన విమర్శలపై స్పందిస్తూ.. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక గొప్ప పరిపాలనను అందిస్తుందని ఊహించినా అది జరగలేదని ఈటల అన్నారు. బడ్జెట్‌లో స్పష్టత కొరవడిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. అర్హులైన నిరుద్యోగులందరికీ భృతి అందేలా చూడాలన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన చేసినట్లు చెబుతున్నా ఇంకా 10 లక్షల మంది రైతులకు పాస్‌ పుస్తకాలు అందలేదన్నారు. పూర్తిస్థాయి బడ్జెట్‌లోనైనా టీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీలు నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలని ఎంఐఎం సభ్యుడు అమీనుల్‌ జాఫ్రీ సూచించారు. ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థను పటిష్టం చేసి, వొకేషనల్‌ కోర్సులు ప్రవేశపెట్టాలని కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి కోరారు. కొత్త పీఆర్‌సీని వేయాలని, మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలన్నారు. ఉద్యోగుల హెల్త్‌ స్కీంను మరింత పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement