breaking news
Government employees retirement age
-
ఉద్యోగుల రిటైర్మెంట్@ 61
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచుతామని మొన్నటి శాననసభ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ హామీ ఇచి్చన నేపథ్యంలో వీలైనంత త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి పెంపుదల వర్తిస్తుందని ఉద్యోగులు ఆశించినప్పటికీ లోక్‌సభ సాధారణ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోయింది. పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచడానికి సంబంధించి తగిన సూచనలు, సలహాలతో నివేదిక ఇవ్వాలని సీఎం జూన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్లు సమాచారం. కేంద్రంతోపాటు దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు రిటైర్మెంట్ వయసును 58, 60 ఏళ్లుగా రెండు శ్లాబ్‌ల్లో అమలుచేస్తున్నాయి. కొత్తగా 61 సంవత్సరాలకు పెంచడం వల్ల ఏమైనా న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయేమోనన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారుల బృందం పలుసూచనలు, సలహాలతో నివేదిక సిద్ధం చేసింది. దీనిప్రకారం 33 సంవత్సరాల సర్వీసు కాలాన్ని పూర్తి చేసిన ఉద్యోగులను ఒక కేటగిరిలోకి, అంతకంటే తక్కువ సర్వీసు కలిగిఉన్న ఉద్యోగులను మరో కేటగిరిలోకి తీసుకుని పదవీవిరమణ వయసు పెంపుదల అమలు చేయాలని భావిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి వచ్చే మార్చి నాటికి పదవీ విరమణ చేసే ఉద్యోగుల జాబితా (సీనియారిటీ ఆధారంగా) సిద్ధం చేసింది. అన్నీ అనుకూలిస్తే అక్టోబర్1 నుంచి పెంపుదలను వర్తింపజేయాలని సీఎం భావిస్తున్నారని ఓ ఉన్నతాధికారి చెప్పారు. వీలైతే ఆగస్టు 15న సీఎం ప్రసంగంలో దీనిని ప్రస్తావించే అవకాశం ఉన్నదని ఆ అధికారి వెల్లడించారు. 33 ఏళ్ల సర్వీసు పూర్తి చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా 58ఏళ్ల నాటికి 33 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వారికి.. మిగిలిన మూడేళ్ల సర్వీసుతో నిమిత్తం లేకుండా ఉద్యోగంలో కొనసాగడానికి అనుమతిస్తారు. ఎవరైనా పదవీ విరమణ చేసిన తరువాత మిగిలిన మూడేళ్ల పాటు ఆ ఉద్యోగంలో కొనసాగడానికి అంగీకరించకపోతే అతనికి లభించే అన్ని ప్రయోజనాలు ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం అమలవుతాయి. ఈ విషయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. 33ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన ఆర్డీవో స్థాయి అధికారి లేదా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు మిగిలిన మూడేళ్లపాటు ఉద్యోగంలో కొనసాగితే అతని హోదా, స్థానం అలాగే ఉంటుందా? లేక మారుస్తారా? అనే విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది తెలియడం లేదు. ఈ విషయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తరువాతే తుది నిర్ణయంతీసుకుంటామని ఓ సీనియర్ అధికారి అన్నారు. సర్వీసు 33 ఏళ్లు లేకపోతే.. అలస్యంగా ఉద్యోగంలో చేరిన వారు త్వరగా పదవీ విరమణ చేస్తే వారికి పూర్తిస్థాయి పింఛను రాదు. అలాంటి వారికి మూడేళ్ల పాటు సర్వీసు కొనసాగించాలన్నది మరో ప్రతిపాదన. ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నాటికి 32 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారికి ఏడాది, 31 ఏళ్లు పూర్తి చేసిన వారికి రెండేళ్లు, 30 ఏళ్లు అంతకంటే తక్కువ సర్వీసు ఉన్నవారికి మూడేళ్లు సర్వీసు పొడిగిస్తారు. ఉదాహరణకు అక్టోబర్ 1వ తేదీ నుంచి పదవీ విరమణ పెంపు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తే అప్పటికీ 30 లేదా అంతకంటే తక్కువ సర్వీసు పూర్తి చేసిన వారికి పదవీవిరమణ పెంపు పూర్తిస్థాయిలో అమలవుతుంది. 61ఏళ్లు నిండేదాకా వారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా అధికారిగానే కొనసాగుతారు. మొత్తానికి అమలు చేస్తే., ఇవేమీ లేకుండా మొత్తం ఉద్యోగులందరికీ 61 ఏళ్లు వర్తింపజేయాలన్నది మరో ప్రతిపాదన. గరిష్ట సీనియారిటీ కలిగిన ఉద్యోగులను మిగిలిన మూడేళ్లు కూడా సర్వీసులో కొనసాగిస్తే వారికి రావాల్సిన జీతభత్యాల్లో అనూహ్యమైన పెరుగుదల ఉంటుందని, ఇది ఖజానాకు భారమవుతుందన్నది ఉన్నతాధికారుల ఆలోచనగా ఉంది. వీటన్నీటి కంటే పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచితే ఏ ఇబ్బందీ ఉండదన్న ఉన్నతాధికారుల సూచనతో సీఎం ఏకీభవించలేదని తెలిసింది. మాటిచ్చిన ప్రకారం 61 ఏళ్లకు పెంచాలన్న అభిప్రాయంతో ఆయన ఉన్నట్లు సమాచారం. ఏదేమైనా ఈ నెలాఖరుకు దీనిపై స్పష్టత వస్తుందని, ఆక్టోబర్ 1 నుంచి అమలు చేసే అవకాశం ఉన్నదని ఉన్నతాధికారవర్గాలు వెల్లడించాయి. ఇవీ ప్రతిపాదనలు... 1. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా 33 యేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారికి మిగిలిన మూడేళ్ల సర్వీసుతో నిమిత్తం లేకుండా ఉద్యోగంలో కొనసాగడానికి అనుమతిస్తారు. వీరికి పదవీ విరమణ రోజున ఉన్న మొత్తం వేతనంలో మూలవేతనం, కరువు భత్యమే మిగిలిన మూడేళ్ల పాటు నెల వేతనం కింద చెల్లిస్తారు. ఇంటి అద్దె అలవెన్స్‌తో పాటు ఇతర ప్రయోజనాలు లభించవు. పదవీ విరమణ పెంపును బట్టి 61 ఏళ్ల దాకా వీరు ఉద్యోగం చేయాలని భావిస్తే 58 ఏళ్లకు రిటైరైతే వచ్చే పెన్షన్ కంటే రెట్టింపు మొత్తంలోనే మూడేళ్ల కాలం పాటు వేతనం లభిస్తుంది. 61 ఏళ్లకు పదవీ విరమణ చేసిన నాటి నుంచి ఉద్యోగికి పింఛన్ ఇవ్వడంతో పాటు ఇతరత్రా అన్ని బకాయిలు చెల్లిస్తారు. 2. సర్వీసు 33 ఏళ్లు లేనివారు విరమణ చేస్తే వారికి పూర్తి పెన్షన్ రాదు. వారు మూడేళ్ల పాటు సర్వీసు కొనసాగించాలన్నది రెండో ప్రతిపాదన. 3. ఇవేమీ లేకుండా మొత్తం ఉద్యోగులందరికీ 61 ఏళ్లు వర్తింపజేయాలన్నది మూడో ప్రతిపాదన. -
రిటైర్మెంట్ వయసు పెంపుపై పరిశీలన
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచాలన్న అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనేది త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత సంకీర్ణ రాజకీయాలే రాజ్యమేలే పరిస్థితులున్నాయన్నారు. అప్పుడు కేంద్రంలో టీఆర్ఎస్ కీలకపాత్ర పోషించే ఆస్కారం ఏర్పడుతుందని రాష్ట్ర ప్రయోజనాలు సాధించుకునే అవకాశం ఉంటుందన్నారు. అందుకే ఇక్కడ పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ బడ్జెట్‌ను పెట్టినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం 20 లక్షల మంది దరఖాస్తు చేసుకుని ఉండొచ్చని, అయితే వారిలో 75 శాతం మంది చిన్న వ్యాపారాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, ఇంకా ఏవైనా పనులు చేసుకునే వారు కూడా ఉంటారని చెప్పారు. ఈ అంశాలన్నీ పరిశీలించి అసలు ఏమీ లేని వారికి నిరుద్యోగ భృతి అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. శనివారం శాసన మండలిలో బడ్జెట్ ప్రసంగంపై చర్చకు ఈటల సమాధానమిచ్చారు. ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం తమదని, మార్వాడీకొట్టు మాదిరిగా లాభనష్టాలు బేరీజు వేసుకోదన్నారు. ఈ వ్యాఖ్యలపై షబ్బీర్ అలీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో అవి సరికాదనుకుంటే ఉపసంహరించుకుంటామని ఈటల చెప్పారు. రాబోయే 3, 4 నెలల్లోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మరుగుదొడ్లు, స్నానాల గదులు, మెరుగైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడతామన్నారు. పీఆర్సీ తదితర అంశాల్లో మెరుగైన చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన కేసులు కోర్టులో ఉన్నందున, అవి తేలేలోగా పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తున్నామని చెప్పారు. ప్రాజెక్టులపై విమర్శలు సరికాదు... ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు సరికాదని మంత్రి అన్నారు. ప్రభుత్వంపై బీజేపీ సభ్యుడు రామచంద్రరావు చేసిన విమర్శలపై స్పందిస్తూ.. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక గొప్ప పరిపాలనను అందిస్తుందని ఊహించినా అది జరగలేదని ఈటల అన్నారు. బడ్జెట్లో స్పష్టత కొరవడిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. అర్హులైన నిరుద్యోగులందరికీ భృతి అందేలా చూడాలన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన చేసినట్లు చెబుతున్నా ఇంకా 10 లక్షల మంది రైతులకు పాస్ పుస్తకాలు అందలేదన్నారు. పూర్తిస్థాయి బడ్జెట్లోనైనా టీఆర్ఎస్ ఎన్నికల హామీలు నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలని ఎంఐఎం సభ్యుడు అమీనుల్ జాఫ్రీ సూచించారు. ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థను పటిష్టం చేసి, వొకేషనల్ కోర్సులు ప్రవేశపెట్టాలని కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి కోరారు. కొత్త పీఆర్సీని వేయాలని, మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలన్నారు. ఉద్యోగుల హెల్త్ స్కీంను మరింత పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. -
ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60ఏళ్లకు పెంపు
హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంపు నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సవరణ బిల్లు-2014కు శాసనసభ సోమవారం ఆమోదం తెలిపింది. దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉద్యోగులకు ఈ నెల నుంచే పదవీ విరమణ వయస్సు పెంపు వర్తించనుంది. ఎన్నికల హామీలో భాగంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు ఫైల్‌పై సంతకం చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ నెలలో పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులందరూ ఈ పెంపువల్ల మరో రెండు సంవత్సరాల పాటు ఉద్యోగంలో కొనసాగతారు.