కేసీఆర్ ఫ్యామిలీ బడ్జెట్: రేవంత్ రెడ్డి
తెలంగాణ విషయంలో అన్యాయంగా వ్యవహరిస్తే ఏపీ సర్కార్ పై పోరాటానికి తాము సిద్ధమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్: కేసీఆర్ సర్కార్ పై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగడతామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే మాకు అభ్యంతరం లేదు అని ఆయన అన్నారు.
తెలంగాణ విషయంలో అన్యాయంగా వ్యవహరిస్తే ఏపీ సర్కార్ పై పోరాటానికి తాము సిద్ధమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ఆర్ధిక బడ్జెట్ ను మంత్రులకు ఏమాత్రం సంబంధం లేకుండా ప్రవేశపెడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
శాసన సభలో ప్రవేశపెట్టేది ప్రజల బడ్జెట్ కాదు.. కేసీఆర్ ఫ్యామిలీ బడ్జెట్ అని రేవంత్ రెడ్డి విమర్శించారు. చెరువుల పునరుద్ధరణ, సాగునీటి పేరుతో హరీష్ 35 వేల కోట్లు, వాటర్ గ్రిడ్, రోడ్ల కోసం కేటీఆర్ కు మరో 35 వేల కోట్లు కేటాయిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఛత్తీస్ ఘడ్ పర్యటనతో ఇప్పటికిప్పుడు ఒక్క యూనిట్ విద్యుత్ వస్తుందా అని ఆయన ప్రశ్నించారు. తన బంధువుల పవర్ ప్రాజెక్ట్ ల పర్మిషన్ కోసమే కేసీఆర్ చత్తీస్ ఘడ్ పర్యటన చేశారని ఆయన అన్నారు. అవిశ్వాసం అనేది ఇప్పుడు అప్రస్తుతం అని రేవంత్ రెడ్డి ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.