మేఘం కురవక.. పుడమి తడవక..

No Rains Across Telangana - Sakshi

రాష్ట్రంలో కరువు ఛాయలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని జిల్లాల్లోనైతే ఏకంగా తీవ్ర దుర్భిక్షం నెలకొందని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి బుధవారం నివేదించింది. రుతుపవనాలు సకాలంలో రాకపోవడం, వచ్చినా వర్షాలు కురవకపోవడంతో పరిస్థితి అత్యంత దారుణంగా మారిందని పేర్కొంది. జూన్, జూలైలో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 33% లోటు వర్షపాతం నమోదైందని వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమయంలో ఇప్పటివరకు సాధారణంగా 197.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 133.2 మి.మీ. రికార్డయింది. గతేడాది ఇదే సమయంలో ఏకంగా 237.6 మి.మీ. నమోదు కావడం గమనార్హం. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో తీవ్ర దుర్భిక్షం నెలకొని ఉందని వ్యవసాయ శాఖ తెలిపింది. కొమురంభీం, వరంగల్‌ అర్బన్, సిద్దిపేట, కరీంనగర్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, నారాయణపేటల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలో అత్యంత దారుణంగా 68% లోటు వర్షపాతం నమోదైంది. ఆ జిల్లాల్లో జూన్‌ 1 నుంచి నుంచి బుధవారం నాటికి సాధారణంగా 181.8 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 58.3 మి.మీ.లే రికార్డయింది. సూర్యాపేట జిల్లాలో 67%, నల్లగొండ జిల్లాలో 66% లోటు నమోదైంది. సూర్యాపేటలో జూన్‌ 1 నుంచి ఇప్పటివరకు సాధారణంగా 152 మి.మీ.లు వర్షం కురవాల్సి ఉండగా, 50.9 మి.మీ.లే నమోదైంది. నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు 132.3 మి.మీ.లు నమోదు కావాల్సి ఉండగా, 45.2 మి.మీ.లే నమోదైంది.

వర్షాలు లేక పత్తి డీలా..
ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 43.33 లక్షల (40%) ఎకరాలకే పరిమితమైంది. అందులో అత్యధికంగా పత్తి 27.05 లక్షల ఎకరాల్లో సాగైంది. ఆహారధాన్యాల సాగు సాధారణ విస్తీర్ణం 48.25 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 10.98 లక్షల (23%) ఎకరాలకే పరిమితమైంది. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10.37 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.82 లక్షల (46%) ఎకరాల్లో సాగైంది. అందులో కంది సాధారణ సాగు విస్తీర్ణం 7.29 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3.66 లక్షల (50%) ఎకరాల్లో సాగైంది. మరో కీలకమైన వరి సాధారణ సాగు విస్తీర్ణం 24.11 లక్షల ఎకరాలు కాగా, 1.46 లక్షల ఎకరాల్లో మాత్రమే (6%) నారు పోశారు. మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 12.52 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.15 లక్షల (33%) ఎకరాల్లో సాగైంది. పెద్ద ఎత్తున పత్తి సాగు చేసినా వర్షాలు లేకపోవడంతో మొలక దశలోనే మాడిపోతున్నాయి. కొన్నిచోట్ల వేసిన గింజలు భూమిలోనే మాడిపోతున్నాయి. 25 రోజుల కింద పత్తి విత్తనాలు చల్లినా దుక్కులు దున్నిన భూములుగానే దర్శనమిస్తున్నాయి. వేల రూపాయల పెట్టుబడి పెట్టి పత్తి సాగు చేస్తే ఇప్పుడు పరిస్థితి ఇలా తయారైందేంటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పత్తి విత్తనం మొలకెత్తలేదు..
ఆరున్నర ఎకరాల్లో పత్తి విత్తనాలు చల్లి 25 రోజులైంది. ఆ తర్వాత సరైన వర్షాలు రాక 2% మాత్రమే మొలకెత్తాయి. మిగిలిన విత్తనాలు భూమి లోనే మాడిపోతున్నాయి. పత్తి పంట పోయినట్లే. మళ్లీ దున్ని ఏం చేయాలన్న దానిపై రైతులం చర్చిస్తున్నాం. ఇప్పటివరకు రూ.50 వేలు పెట్టుబడి పెట్టి నష్టపోయాం. ఏం చేయాలో అర్థంకావట్లేదు.
ఇందుర్తి రంగారెడ్డి, పోచారం, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top