ఇక వేసవిలో మూడు ముహూర్తాలే..

No Dates For Marriages in Summer After Lockdown Free Hyderabad - Sakshi

కనిపించని  పెండ్లి సందడి

పరిమిత సంఖ్యలో అతిథులు  

ఇక వేసవిలో మూడు ముహూర్తాలే..

ఈ నెల 29, జూన్‌ 10, 11  తేదీల్లో..  

తర్వాత జూలై చివరి వారంలో మరోరెండు

చూపులతో మొదలై.. మూడు ముళ్లతో ముగిసే పెళ్లికి హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ఒక ఇంట్లో పెళ్లంటే.. బంధువుల ఇళ్లలోనూ హడావుడి మొదలవుతుంది. ఎన్నో రోజుల ముందు నుంచే పెళ్లి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. వందలు, వేల సంఖ్యలో వచ్చే వారి ఆశీర్వాదం కోసం వధూవరులు సిద్ధమవుతారు. ఎక్కడెక్కడి నుంచో బంధువులు, స్నేహితులు చేరుకుంటారు. తోడూ నీడగా నూరేళ్ల జీవితాన్ని గడపాలని ఆ రోజున ముక్కోటి దేవతలు దీవిస్తారని నమ్ముతారు. పంచ భూతాల సాక్షిగా ఇద్దరు ఒక్కటవుతారు. ఇదంతా గతం.. ప్రస్తుతం వైభవంగా పెళ్లిళ్లను నిర్వహించాలనుకున్న వారికి మాత్రం లాక్‌డౌన్‌ నిరాశే మిగిల్చింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు పెళ్లిళ్లకు వచ్చే వారి సంఖ్యను తగ్గించాలని సూచించడంతో కొద్ది మంది సమక్షంలోనే పెళ్లిళ్లు జరుగుతున్నాయి.

సాక్షి, సిటీబ్యూరో  :కరోనా లాక్‌డౌన్‌తో కల్యాణ శోభ మారుతోంది. హంగూ, ఆర్భాటాలు లేకుండా పరిమిత సంఖ్య అతిథుల మధ్య సాదాసీదాగా వివాహాలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు కరోనా వైరస్‌ భయం, మరోవైపు లాక్‌డౌన్‌ కట్టడి కష్టాలు తెచ్చిపెట్టింది. అతిథులు సైతం శుభకార్యాలయాలకు హాజరయ్యేందుకు భయపడుతున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ కంటే ముందే నిర్ణయించుకున్న పెళ్లిళ్లు చాలా వరకు వాయిదా పడగా, కొందరు ముహూర్తాలు దగ్గర్లో లేకపోవడంతో ఇళ్లలోనే పెళ్లి తంతు కానిచ్చేశారు. వాస్తవానికి దగ్గర్లో  మంచి ముహూర్తాలు లేకుండా పోయాయి. ఇప్పటికే పలు ముహూర్తాలు ముగిసిపోగా, ఇక గురు, శుక్ర మూఢాలు, అధిక అశ్వీయుజ మాసం, ఆషాఢం, భాద్రపదం తదితర కారణంతో శుభకార్యాలు చాలా తక్కువ. 

ఎన్నో రంగాలకు గడ్డు పరిస్థితులు 
పెళ్లిళ్లపై ఆధారపడిన రంగాలకు గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. వివాహాది శుభకార్యాలకు అనుసంధానంగా ఉండే రంగాలపై ప్రభావం పడింది. ఆయా వర్గాలకు మునుపెన్నడూ లేనివిధంగా ఉపాధి దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ఫంక్షన్‌ హాల్స్, కల్యాణ మండపాలు, డీజేలు, బ్యాండ్‌ బాజా, సన్నాయి మేళం, క్యాటరింగ్, వంటలు వండే వారు, మేకప్, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్, టెంట్‌హౌస్, పెళ్లి దుస్తులు, దర్జీలు, ఫొటోలు, వీడియోగ్రాఫర్లు, పురోహితులు,బంగారం, పూలు, పెళ్లిపందిరి, కూరగాయలు, అద్దె వాహనాల ఉపాధి దెబ్బతిసినట్లయ్యింది.  

ముహూర్తాలు ముగిసిపోగా..
వేసవి కాలం ముహూర్తాల్లోనే వివాహాలు జరుపుకునేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. సెలవు కాలం అందరికీ కలిసి వస్తోందని భావిస్తారు. ఈ వేసవి కాలంలోని ఏప్రిల్, మే నెలల్లోనే చాలా వరకు ముహూర్తాలు ఇప్పటికే ముగిసిపోగా, ఈ నెల 29, వచ్చేనెల 10, 11 తేదీల్లోనే శుభ ముహూర్తాలు ఉన్నాయి. మే 30 నుంచి జూన్‌ 9 వరకు 10 రోజుల పాటు మూఢం కారణంగా   శుభకార్యాలకు వీలుండదు. ఆ తర్వాత రెండురోజులు ముహూర్తాలు ఉన్నా.. జూలై 20 వరకు ఆషాఢమాసం.. శూన్యమాసం కావడంతో శుభకార్యాలు ఉండవు. జూలై 23 నుంచి వరుసగా రెండు రోజులపాటు శుభముహూర్తాలు ఉన్నాయి. తిరిగి వారం రోజుల తర్వాత ఆగస్టు 2, 7, 8, 14వ తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. వర్షాకాలం కావడంతో ఈ సమయం అత్యధిక శాతం శుభకార్యాలకు ఆసక్తి కనబర్చరు. ఇక ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్‌ 17 వరకు భాద్రపదం, శూన్యమాసం కావడంతో శుభకార్యాలు ఉండవు. ఆ తర్వాత అక్టోబర్‌ 16వ వరకు నెల రోజులు అధిక అశ్వీయుజ మాసం, శూన్యమాసం కావడంతో మంచి ముహూర్తాలకు అవకాశం లేకుండా పోయింది. అక్టోబర్‌ 21, 28, 29, 30, నవంబర్‌ 6, 11 నుంచి డిసెంబర్‌ 6 వరకు మంచి ముహూర్తాలు ఉన్నా శుభకార్యాల కోసం పెద్దగా ఆసక్తి కనబర్చరు.

ప్రణాళికలను సైతం పక్కన పెట్టి.. 

తాజాగా మరింత విస్తరిస్తున్న కరోనాతో లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశాలు ఉండటంతో తక్కువ బంధువులతో నిబంధనలకు లోబడి వివాహాలు జరిపించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే పెండ్లి నిర్వహణ కోసం రూపొందించుకున్న ప్రణాళికలను సైతం పక్కన పెట్టి పరిస్థితులకు అనుగుణంగా స్వల్ప ఏర్పాట్లతో సిద్ధమవుతున్నారు. పెళ్లి శుభలేఖలను సైతం వాట్సాప్‌ల ద్వారా పంపించి సెల్‌ఫోన్‌ లేదా వీడియో కాలింగ్స్‌ ద్వారా ఆహ్వానం పలుకుతున్నారు. పెళ్లిలకు ఇరవై మంది వచ్చినా సరే అంటూ పెళ్లిలకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇక అనుమతి తప్పనిసరి..
కరోనా కట్టడికి లాక్‌డౌన్‌లో వివాహాలు జరుపుకునేందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఖచ్చితమైన  నిబంధనల మేరకు పెళ్లిలు జరిపించాల్సి ఉంటుంది. పెండ్లి తరఫు కుటుంబీకులు పోలీసులకు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి. బ్యాండ్‌ బాజా పెట్టుకోవద్దు. బరాత్‌లు నిర్వహించుకోరాదు. సామూహిక భోజనాలు పెట్టకూడదు. పరిమిత సంఖ్యలో అతిథులను మాత్రమే ఆహ్వానించాలి. భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు చేపట్టాలి. ఇవ్వన్నీ పాటిస్తామంటేనే అనుమతి లభిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top