
సాక్షి, నల్లగొండ : జిల్లాలో శనివారం విషాద సంఘటన చోటు చేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన ముక్కుపచ్చలారని ఐదుగురు చిన్నారులు జలసమాధి అయ్యారు. ఈ హృదయ విచారకర ఘటన దేవరకొండ మండలం పెండ్లి పాకల గ్రామ పంచాయితీ పరిధిలోని గుడి తండాలో చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన సంతోష్ (7), రాకేష్ (6), నవదీప్(7), సాత్విక్ (6), శివ(6)లు ఒంటిపూట బడికిపోయి వచ్చి ఆడుకుంటామని ఇంట్లో చెప్పి వెళ్లారు. అయితే ఈ చిన్నారులు ఈతకు వెళ్లి పెండ్లి పాక రిజర్వాయర్‌కు వెళ్లగా.. ప్రమాదవశాత్తు జారి పడ్డారు. ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో చిన్నారులంతా విగత జీవులయ్యారు. ఈ చిన్నారుల మరణంతో ఒక్కసారిగా ఆ గ్రామం శోక సంద్రంలో మునిగిపోయింది.