మైనార్టీల అభివృద్ధికి కృషి

This Is Muslims Development Govt Says Mahmood Ali Adilabad - Sakshi

మంచిర్యాలటౌన్‌: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక, మొదటిసారి ఏర్పడిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ, మైనార్టీ ప్రజల అభివృద్ధికి తీవ్ర కృషి చేస్తోందని రాష్ట్ర ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. మంగళవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణంలోని క్వారీ రోడ్డులో 2 వేల గజాల స్థలంలో నిర్మించనున్న క్రిస్టియన్‌ కమ్యూనిటీ భవన నిర్మాణానికి పునాది రాయి వేసి, జిల్లా కలెక్టర్‌ భారతి హోళీకేరీతో కలిసి శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం పటేల్‌ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన క్రిస్టియన్‌ మైనార్టీల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడక ముందు మైనార్టీలను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు. దేశం మొత్తమ్మీద మైనార్టీలకు రూ.4,700 కోట్ల బడ్జెట్‌ కేటాయిస్తే, తెలంగాణ ప్రభుత్వం రూ.2 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించిందని చెప్పారు.

గత టీడీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు మైనార్టీ ప్రజలను అస్సలు పట్టించుకోలేదని, అందుకే పూర్తిగా వెనకబడి పోయారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీ మేరకు 206 మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలను ప్రారంభించామని, ఒక్కో విద్యార్థిపై గతంలో రూ.20 వేలను ఖర్చు చేయగా, ప్రస్తుతం తాము రూ.1.35 లక్షలు ఏడాదికి ఖర్చు చేస్తున్నామని అన్నారు. ఫాదర్లకు వేతనాలు ఇవ్వాలని పలువురు క్రిస్టియన్లు కోరుతున్నారని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గౌరవ వేతనం ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్‌ మాట్లాడుతూ క్రిస్టియన్ల కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని, మంచిర్యాలలో కమ్యూనిటీ భవన నిర్మాణానికి రూ.57.50 లక్షలు కేటాయించారని, తన నిధుల నుంచి రూ.10 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎంపీ బాల్క సుమన్‌ తన నిధుల నుంచి రూ.10 లక్షలు కేటాయిస్తానని హామీనిచ్చారు.

ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ వివేకానంద మాట్లాడుతూ తన తండ్రి వెంకటస్వామి పేరిట ఏర్పాటు చేసిన ట్రస్తు ద్వారా రూ.3 లక్షలు అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పురాణం సతీశ్, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా ఇంచార్జి అరిగెల నాగేశ్వర్‌రావు, తాజా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, బెల్లంపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మామిడిశెట్టి వసుంధర, వైస్‌ చైర్మన్‌ నల్ల శంకర్, మహిళా శిశు సంక్షేమశాఖ రీజనల్‌ ఆర్గనైజర్‌ అత్తి సరోజ, జెడ్పీటీసీ రాచకొండ ఆశాలత, ఐక్య క్రిస్టియన్ల సంఘం గౌరవ అధ్యక్షురాలు చల్లగుల్ల విజయశ్రీ, జిల్లా అధ్యక్షుడు సామ్యేల్, ప్రదాన కార్యదర్శి రజిని కుమార్, కల్వరి వ్యవస్థాపకుడు ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.
 
ముస్లింలకు ప్రత్యేక పాఠశాలలు
ముస్లిం మైనార్టీలకు ప్రత్యేక మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ అన్నారు. జిల్లా కేంద్రంలోని షాదీఖానా ముస్లిం మైనార్టీ ఫంక్షన్‌హాలులో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీ నాయకులు జుల్ఫేకర్, మీనాజ్, షఫి, బద్రుద్దీన్, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top