శవం.. ఏడుస్తోంది!

Municipal officials negligence to Cemetery in rajanna district - Sakshi

మృతదేహాలను అనుమతించని యజమానులు

శవాన్ని ఇంటి ఎదుట వేస్తే అరిష్టమనే భయం

రోడ్డున పడుతున్న నేతకార్మికుల బతుకులు

అందుబాటులోకిరాని ‘ముక్తిధామం’

నిర్మాణదశ దాటని శ్మశానవాటిక

నిధులు విడుదలైనా ముందుకు సాగని పనులు

మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యమే కారణం

పదిహేనేళ్లుగా బాధిత కుటుంబాల గోస

కార్యరూపం దాల్చని మంత్రి కేటీఆర్‌ హామీ

జిల్లాకేంద్రంలోని దుస్థితి ఇదీ..

వందల ఏళ్ల చరిత్ర.. ద్వితీయశ్రేణి మున్సిపాలిటీ.. సుమారు లక్ష జనాభా.. అన్నింటికీ మించి రాష్ట్రమంత్రివర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న కల్వకుంట్ల తారక రామారావు సొంత నియోజకవర్గం.. అభివృద్ధి పనుల కోసం అడగకుండానే నిధులు విడుదల చేస్తున్న వైనం.. అయినా మెజారిటీ సామాజికవర్గం పద్మశాలి కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే కనీసం మృతదేహాన్ని ఉంచే స్థలంలేదు.. అద్దెఇళ్లలో బతుకీడుస్తున్న నేతకార్మిక కుటుంబాలు దశాబ్దాలుగా శవాలను రోడ్డుపైనే పెట్టాల్సిన దుస్థితి నెలకొంది.. మృతదేహాన్ని తమ ఇంటి ఎదుట వేస్తే.. అరిష్టమనే మూఢనమ్మకాలతో కొందరు ఇళ్ల యజమానుల తీరు బాధిత కుటుంబాలకు తీరని విషాదం కలిగిస్తోంది.

సిరిసిల్లటౌన్‌: జిల్లాకేంద్రంలో మెజారిటీ సామాజికవర్గం పద్మశాలి కుటుంబాలే ఉన్నాయి. వీరిలో చాలామందికి సొంతిళ్లులేవు. కుటుంబలో ఎవురైనా చనిపోతే రోడ్లే దిక్కవుతున్నాయి. తరచూ తలెత్తే ఇలాంటి ఘటనల్లోంచి బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రి కేటీఆర్‌ ప్రత్యేక భవనం నిర్మించాలని ప్రతిపాదించారు. ఆయన సదాశయాన్ని ఆచరణలో పెట్టడంలో సంబంధిత శాఖ అధికారులు సఫలీకృతులు కాలేకపోతున్నారు. కార్మికక్షేత్రంలో సుమారు 8 వేల కుటుంబాలు అద్దెఇళ్లతోనే నెట్టుకు వస్తున్నాయి. మొత్తానికే ఇల్లులేని వారు కనీసం 3 వేల మంది ఉంటారని అంచనా ఉంది. ఇట్లాంటి వారి కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే.. అంత్యక్రియలు పూర్తిచేసేవరకైనా ప్రత్యేక వసతి కల్పించాలని అధికారులను కోరుతున్నారు.

మరికొన్ని దయనీయ ఘటనలు..
బీవైనగర్‌కు చెందిన ఠాకూర్‌ రవీందర్‌(50) నేతకార్మికుడు. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా భార్య జమున అద్దె ఇంటిని ఖాళీ చేసి తల్లిగారింటికి చేరింది. భర్తను సర్కారు ఆస్పత్రిలో చేర్పించి వైద్యచికిత్సలు చేయిస్తుండగా గత శనివారం ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయాడు. జమున పుట్టింటి వారిక్కూడా సొంతిల్లు లేక రవీందర్‌ మృతదేహాన్ని తెల్లార్లూ రోడ్డుపైనే ఉంచారు. స్థానికులు చందాలు పోగేసి మరుసటి రోజు అంత్యక్రియలు జరిపించారు.  

నెహ్రూనగర్‌కు చెందిన దోమల రమేశ్‌ నేతకార్మికుడు. అప్పులు, ఆర్థిక, కుటుంబ పరిస్థితుల గురించి చెబుతూ మంత్రి కేటీఆర్‌కు లేఖ రాసి గతేడాది డిసెంబర్‌ ఒకటిన ఆత్మహత్య చేసుకున్నాడు. సొంతిల్లు లేక రమేశ్‌ ఖర్మకాండలు చేసేందుకు కుటుంబసభ్యులు నానాయాతన అనుభవించారు.

బీవైనగర్‌కు చెందిన గాజుల అంబదాస్‌–భూలక్ష్మి దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. వీరి చదువులు, ఇంటిఅవసరాల కోసం రూ.లక్షల్లో అప్పు చేశారు. వాటిని తీర్చడానికి ఇల్లు అమ్మినా సరి పోలేదు. దీంతో రెండేళ్ల క్రితం వేములవాడ గుడి చెరువులో దూకి చనిపోయారు. వారి శవాలను సైతం రోడ్డుపైనే ఉంచి మరుసటి రోజు శ్మశాన వాటికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఏప్రిల్‌లో పనులుపూర్తి
వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ముక్తిధామం పనులు సాంకేతిక కారణాలతో నిలిచిపోయాయి. విద్యానగర్, నెహ్రూనగర్‌లో రూ.45 లక్షలు, కొత్తచెరువు ప్రాంతంలో రూ.20 లక్షలు, జేపీనగర్‌లో రూ.10 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో ముక్తిధామాలు నిర్మిస్తాం. విద్యానగర్‌లోని శ్మశానవాటిక నిర్మాణం ఏప్రిల్‌లోగా పూర్తి చేయిస్తాం.
– సామల పావని, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

శిలాఫలకానికే పరిమితం..
మానేరు శివారులో ముక్తిధామం నిర్మాణానికి 22 అక్టోబర్‌ 2002లో అప్పటి ఎంపీ విద్యాసాగర్‌రావు శకుస్థాపన చేశారు. వివిధ కారణాలతో పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన మున్సిపల్‌ పాలకవర్గం.. శ్మశానవాటి నిర్మాణానికి చర్యలు తీసుకోగా.. కోర్టు కేసులు అడ్డుగా మారాయి. శ్మశానవాటిక లేకపోవడంపై స్పందించిన మంత్రి కేటీఆర్‌.. సత్వరమే శ్మశానవాటిక నిర్మించాలని ప్రస్తుత పాలకవర్గాన్ని ఆదేశించారు. స్థల వివాదం సమసిపోయినా పనులు ప్రారంభంకాలేదు.

ఐదు విడతలు.. రూ.2.18 కోట్లు..
పట్టణ శివారులో శ్మశానవాటికి నిర్మాణానికి నాలుగు దఫాల్లో రూ.2.18 కోట్లు మంజూరయ్యాయి. తొలివిడతలో రూ.22 లక్షల వ్య యంతో మున్సిపల్‌ ఆధ్వర్యంలో ప్రహరీ, మానేరువాగువైపు రిటైనింగ్‌వాల్‌ నిర్మించారు. మరో దఫాలో రూ.38 లక్షలు వెచ్చించి స్టోర్‌ రూంలు, హాల్‌ కట్టించారు. తర్వాత పంచా యతీరాజ్‌ ద్వారా రూ.54 లక్షలు కేటాయించి నాలుగు బర్నింగ్‌ ప్లాట్‌ఫారమ్స్, స్టోర్‌ రూమ్స్, టాయిలెట్స్‌ తదితర పనులు చేపట్టారు. నాలుగు, ఐదు విడతలో మున్సిపల్‌ ఆధ్వర్యంలో రూ.1.04 కోట్లు కేటాయించి అన్నదానంహాల్, ఖర్మకాండల గదులు, అదనపు గదులు, ఆరాధన క్షేత్రాలు, గ్రీనరీ, విద్యుద్దీకరణ, ఫ్లోరింగ్, ఫౌంటేన్లు, ఆర్చీల నిర్మాణాలకు టెండర్లు పూర్తి చేశారు. కానీ, పనులు నేటికీ మొదలుకాలేదు. ఇప్పటికీ పలుసార్లు కేటాయించిన నిధుల్లో అవకతవకలు చోటుచేసుకోవడంతో పనులు ముందుకు సాగడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

సిరిసిల్ల సుందరయ్యనగర్‌కు చెందిన నేతకార్మికుడు నాగభూషణం ఆర్థిక ఇబ్బందులు తాళలేక నవంబర్‌ 7న ఆత్మహత్య చేసుకున్నాడు.. ఆస్పత్రిలో ఉన్న శవాన్ని అద్దెఇంటికి తీసుకొచ్చేందుకు కుటుంబసభ్యులు యత్నించినా ఇంటియజమానులు నిరాకరించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న బంధువులు.. అట్నుంచి అటే శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తిచేశారు.

సిరిసిల్ల బీవైనగర్‌కు చెందిన చిలుక నిర్మల(70) బీడీకార్మికురాలు. డిసెంబర్‌ ఒకటిన గుండెపోటుతో చనిపోయింది. మృతదేహాన్ని తన ఇంటిఎదుట వేయొద్దని యజమానురాలు ఆదేశించింది. చేసేదిలేక కుటుంబసభ్యులు శివనగర్‌ మహిళా భవన్‌ ఎదుట రోడ్డుపై టెంటు వేసి శవాన్ని ఉంచారు. ఆమె కూతుళ్లు లక్ష్మి, అనితకూ సొంతిళ్లులేవు.. తెల్లవార్లూ శవం వద్ద జాగరణ చేశారు.. మరుసటిరోజు స్థానికులు విరాళాలు పోగుచేసి అంత్యక్రియలు పూర్తిచేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top