ఎనిమిదేళ్ల పసివాని దైన్యం
హెచ్‌ఐవీ భయంతో ముఖం చాటేసిన బంధువులు
దగ్గరుండి అంత్యక్రియలు జరిపించిన పోలీసులు
ఎటా (యూపీ): పాపం పాలుగారే పసివాడు! కేవలం ఎనిమిదేళ్ల వయసు. అసలే తండ్రి లేడు. ఇటీవలే హెచ్‌ఐవీతో కన్నుమూశాడు. తల్లి కూడా అదే మహమ్మారితో పోరాడుతూ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. అంతటి విపత్కర పరిస్థితుల్లో కనీసం ఓదార్చేందుకు, మేమున్నామంటూ అక్కున చేర్చుకునేందుకు నా అనేవారంటూ ఎవరూ లేకుండా పోయారు. బహుశా హెచ్‌ఐవీ భయంతోనేమో, కనీసం తల్లి తరఫు దగ్గరి బంధువులైనా ఆస్పత్రి ముఖం కూడా చూడలేదు! దాంతో ఉబికివస్తున్న కన్నీటిని బిగబట్టి, పోస్టుమార్టం గది దాకా తల్లి మృతదేహం వెంట బిక్కుబిక్కుమంటూ ఒక్కడే వెళ్లాడు. ఆ తర్వాత తల్లి ఎడబాటును, ఎద లోతుల్లోంచి తన్నుకొస్తున్న బాధను తట్టుకోలేక గుండెలవిసేలా రోదించాడు. ఈ హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలో గురువారం జరిగింది. చివరికి విషయం తెలుసుకున్న పోలీసులే అతనికి ధైర్యం చెప్పారు. చట్టపరమైన ప్రక్రియలన్నీ దగ్గరుండి పూర్తి చేయడమే గాక అంత్యక్రియల దాకా బాలునికి తోడుగా నిలిచారు.
అన్నీ తామైన పోలీసులు
హెచ్‌ఐవీ చికిత్స నిమిత్తం బాలుని తల్లి రెండు నెలల క్రితం అత్తగారింటికి చేరింది. వ్యాధి బాగా ముదిరిపోవడంతో నెల రోజులుగా నరకయాతన పడింది. అత్తారింటి నుంచి ఐదు రోజుల క్రితం కొడుకుతో పాటు తల్లిగారి వద్దకు వెళ్లింది. పరిస్థితి విషమించడంతో రెండు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ గురువారం మరణించింది. పోస్టుమార్టం సందర్భంగా గది ముందు ఒంటరిగా కూర్చున్న బాలుడు, పోలీసులు ఆరా తీయగా తన దైన్యం గురించి చెప్పుకున్నాడు. అయిన వారెవరూ కనీసం ఆస్పత్రికి కూడా రాలేదని, వారి ఫోన్ నంబర్లు కూడా తన వద్ద లేదని చెప్పాడు. దాంతో పోలీసులే ఆరా తీసి మృతురాలి తండ్రికి, అత్తమామలకూ విషయం చేరవేశారు.
అనంతరం తామే దగ్గరుండి వారందరి సమక్షంలో అంత్యక్రియలు కూడా జరిపారు. ఆ బాలునిది నిరుపేద కుటుంబమని ఇన్‌స్పెక్టర్ రితేశ్ ఠాకూర్ చెప్పారు. ‘‘భూ తగాదాలకు సంబంధించి పెదనాన్న, చిన్నాన్నల నుంచి తనకు ముప్పుందని కూడా పిల్లాడు చెప్పాడు. కానీ అలాంటిదేమీ లేదని విచారణలో తేలింది’’వాళ్లెక్కడో ఢిల్లీలో ఉంటారు. బాలుని తల్లి మరణం గురించి తెలిశాకే ఊరికి వచ్చారు’’అని ఆయన వివరించారు. బాలునికి కూడా హెచ్‌ఐవీ పరీక్షలు జరిపినట్టు ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ రాజేంద్రప్రసాద్ చెప్పారు. అతనికి వ్యాధి ఉన్నదీ లేనిదీ ఫలితాలు వచ్చాకే తెలుస్తుందన్నారు.


