మంత్రివర్యా.. నిధులివ్వరూ!  | Muncipality Officers Prepare Plan For Development In Nalgonda | Sakshi
Sakshi News home page

మంత్రివర్యా.. నిధులివ్వరూ! 

Sep 23 2019 6:45 AM | Updated on Sep 23 2019 6:45 AM

Muncipality Officers Prepare Plan For Development In Nalgonda - Sakshi

సాక్షి, నల్లగొండ టూటౌన్‌ : నీలగిరి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అధికారులు చిట్టా తయారు చేశారు. పట్టణ సమగ్రాభివృద్ధి కోసం దాదాపు రూ.150 కోట్లు అవసరమని సంబంధిత అధికారులు ప్రతిపాదనలు తయారు చేసినట్లు తెలిసింది. గతంలో తయారు చేసి పంపిన రూ.55 కోట్ల ప్రతిపాదనలకు తోడుగా కొత్తగా తయారు చేసిన ప్రతిపాదనల ప్రకారం రూ.95 కోట్లు కావాలని, మొత్తం రూ.150 కోట్లు మంజూరు చేస్తే నీలగిరి పట్టణ ముఖచిత్రం మార్చవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం నల్లగొండలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవానికి చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవానికి వస్తున్నారు.

ఈ నేపథ్యంలో నీలగిరి సమగ్రాభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ఆయన ముందు ఉంచి నిధులు రాబట్టాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయించినట్లు తెలిసింది. పట్టణంలో అసంపూర్తి పనులతో పాటు కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టాలంటే మంత్రివర్యులు కనికరిస్తేనే సాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఏడాదిలోగా అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ పూర్తిచేసేలా..
పుష్కర కాలం అయినా పూర్తికాని అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి మరో రూ.15 కోట్లు కావాలని ప్రతిపాదనలు తయారుచేశారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మాణం పూర్తికాకపోవడంతో నీలగిరి పట్టణ డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతున్న విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడాదిలోగా దీనిని పూర్తి చేయాలనే పట్టుదలతో స్థానిక ఎమ్మెల్యే  ఉన్నారు. అదే విధంగా నల్లగొండ పట్టణంలోని కాపురాల గుట్ట, లతీఫ్‌ సా హెబ్‌ గుట్ట, బ్రహ్మంగారి గుట్టల చుట్టూ వరద కాల్వ నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారు. వీటి చుట్టూ వరద కాల్వ నిర్మాణం చేపడితే పట్ట ణం వరద ముప్పు నుంచి బయటపడే అవకా శం ఉంది.

వరద కాల్వల నిర్మాణానికి రూ.10 కోట్లకు ప్రతి పాదనలు తయారుచేశారు. వీటితో పాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పట్టణంలో దెబ్బతిన్న రోడ్లు, డ్రెయినేజీలకు రూ.6 కోట్లు విడుదల చేయాలని మంత్రిని కోరనున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీ దగ్గర ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులు రూ.15 కోట్లు పట్టణ అభివృద్ధి కోసం వాడుకోవడానికి అనుమతించాలని మంత్రికి విన్నవించనున్నారు. 

విలీన గ్రామాల అభివృద్ధికి రూ.30 కోట్లు..
నీలగిరి మున్సిపాలిటీలో పట్టణం చుట్టూ పక్కల ఉన్న ఏడు గ్రామ పంచాయతీలు విలీనమై దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. అక్కడ అరకొర వసతుల నడుమ ప్రజలు అవస్థలు పడుతున్నారు. పదేళ్లు అయినా నిధులు లేకపోవడంతో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. విలీన గ్రామాల్లో మౌలిక వసతులు, సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి రూ.30 కోట్లు అవసరమని ప్రతిపాదనలు తయారు చేశారు. విలీన గ్రామలకు నిధులు సమస్య ఎప్పటి ఉంది. ఇప్పటికైనా నిధుల విడుదలకు మోక్షం కలిగేనా అని ఆయా గ్రామాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. 

ఉదయ సముద్రం అభివృద్ధికి..
పానగల్‌ ఉదయ సముద్రం ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చదిద్దడానికి మున్సిపల్‌ అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. పానగల్, ఉదయ సముద్రం అభివృద్ధి కోసం టీఎఫ్‌ఐడీసీ కింద రూ.55 కోట్లు విడుదల చేయాలని గతంలోనే ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. మున్సిపాలిటీ ప్రతి పాదనలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. కాగా నీలగిరి పట్టణంలో అభివృద్ధికి సంబంధించిన ఆవశ్యకతను మంత్రికి వివరించి కనీసం రూ.150 కోట్లు అయినా విడుదల చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అదే విధంగా నల్లగొండ పట్టణం నుంచి భారీ వాహనాలు వెళ్లకుండా బైపాస్‌ రోడ్డు కూడా అవసరం ఉందని, దాని కోసం మంత్రి దృష్టికి తీసుకుపోయి నిధులు విడుదల చేయించాలని స్థానిక ప్రజాప్రతినిధిలు భావిస్తున్నట్లు సమాచారం. వీటన్నింటిపై మంత్రి కేటీఆర్‌ సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని అధికార పార్టీ నాయకులు భావిస్తున్నారు. 

నేడు మంత్రి కేటీఆర్‌ పర్యటన..
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు సోమవారం నల్లగొండకు రానున్నారు. ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌లో బయలు దేరి మధ్యాహ్నం ఒంటి గంటకు నల్లగొండలోని బీట్‌ మార్కెట్‌కు వస్తారు. రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో కలిసి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మహిళలకు చీరలను అందజేస్తారు. అనంతరం 3 గంటలకు కలెక్టరేట్‌లోని ఉదయాధిత్య భవన్‌లో నిర్వహించనున్న అన్ని శాఖల సమీక్ష సమావేశంలో పాల్గొంటారు.

అన్ని శాఖలకు సంబంధిచిన అభివృద్ధి పనులపై సమీక్ష జరిగిన అనంతరం సాయంత్రం నల్లగొండ పట్టణం మర్రిగూడ స్టేజీ వద్ద ఉన్న లక్ష్మీ గార్డెన్‌లో జరిగే  నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ సమావేశంలో పాల్గొంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement