మిస్‌ ఇండియా.. ఓ సర్‌‘ప్రైజ్‌’

Miss India Winner Suman Rao Special Interview - Sakshi

ఆమె తాజా భారతీయ సౌందర్యం. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పుట్టి ముంబయిలో పెరిగిన ఈ బ్యూటీ  2019కి గాను  మిస్‌ ఇండియా కిరీటాన్ని స్వంతం చేసుకుంది. ఈ నేపధ్యంలో నగరానికి వచ్చిన సుమన్‌రావ్‌...సెంట్రోమాల్‌లో ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...

సాక్షి, సిటీబ్యూరో:‘‘ఒక కాలేజీ విద్యార్ధిని (20)గా సుమన్‌ లండన్‌లో జరగబోతున్న మిస్‌ వరల్డ్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించబోతోంది’’అనేది ఇప్పటికీ నాకు ఆనందాశ్చర్యాలు కలిగిస్తూనే ఉంది. తొలుత మిస్‌ నవీ ముంబయి బ్యూటీ కాంటెస్ట్‌ సరదాగా, మిస్‌ రాజస్థాన్‌ గెలుపు కాస్త సీరియస్‌గా... మిస్‌ ఇండియా దగ్గరకు వచ్చేసరికి పూర్తి అంకిత భావంతో ఒక్కో అడుగు వేశాను. వీటన్నింటికి మించి ఇప్పుడు మిస్‌ వరల్డ్‌ వైపు ప్రయాణం చేస్తున్నాను.

మహిళల స్థాయి పెరగాలి...
మహిళల స్థితిగతులు మారాలి అనే సదుద్ధేశ్యంతో ఫ్యాషన్‌ రంగంలోకి వచ్చా. మహిళలు మరింత స్వతంత్రంగా మారాలని  ఆర్ధిక స్వావలంబన సాధించి సమాజంలో సమాన స్థాయి రావాలని నేను పుట్టిన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని దుంగార్పూర్‌ జిల్లాలో ఒక ట్రైబల్‌ ప్రాంతాల్లో ప్రగతి అనే ప్రాజెక్ట్‌ చేస్తున్నాను.  దీనికి స్ఫూర్తి ‘బ్యూటీ విత్‌ పర్పస్‌ అనే కాన్సెప్ట్‌’ దీనిని ు మిస్‌ వరల్డ్‌ నిర్వాహకులు చైర్‌ పర్సన్‌ జులియా మోర్లె ప్రారంభించారు. ప్రతి అందాల రాణి ఒక సముచిత సామాజిక బాధ్యతతో ఉండాలని ఆమె ఉద్దేశ్యం.  పుట్టిన ప్రాంతం నుంచే మార్పు తేవాలనుకుంటున్నాను. తర్వాత దేశం, తర్వాత ప్రపంచం... అలా. 

సినిమా కష్టమే... కానీ ఇష్టమే
సినిమా అవకాశాల విషయంలో చాలా మంది అమ్మాయిలు  సమస్యలు ఎదుర్కుంటున్నట్టు గమనిస్తున్నాను. అయినప్పటికీ నేనునటించడానికి సిద్ధమే. ఈ భూమ్మీద అతి కష్టమైన పని ఏదైనా ఉందంటే అది
గ్లామర్‌ వరల్డ్‌లో ముఖ్యంగా సినీ పరిశ్రమలో రాణించడమే. ఎందుకంటే దీనికి చాలాటాలెంట్‌ కావాలి. ఒకవేళ అలాంటి అవకాశమే గనుక వస్తే దాన్ని అన్ని విధాలుగాశ్రమించి సద్వినియోగం చేసుకుంటాను.  

లైట్‌గా తింటే..బ్రైట్‌గా ఉంటాం...
నేను జంక్‌ ఫుడ్‌ తినను. వీలైనంత వరకూ హోమ్‌ ఫుడ్‌ మాత్రమే తింటాను. ఇటీవలే జిమ్‌కి వెళుతున్నా. పిలాటెస్‌ చేస్తున్నా. వీలైనంతగా నీళ్లు తాగడం, మంచి నిద్ర కూడా ఫిట్‌నెస్‌కు మేలు చేస్తుంది. మన శరీరానికి నప్పే ఆహారాన్ని పరిశీలించి ఎంచుకోవాలి. అలాగే అమితాహారం వద్దు. మనకు పొట్ట ఫుల్‌ అనిపించగానే తినడం ఆపాలి.  

కలలు సాకారం చేసిన కథక్‌...
చిన్నప్పటి నుంచీ నాకు డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. సంప్రదాయ నృత్యం సాధన చేస్తున్నా.  గత నాలుగేళ్లుగా కథక్‌ నేర్చుకుంటున్నా. దీని వల్ల కామ్‌నెస్, మరింత క్రమశిక్షణ వస్తాయి.  సానుకూల దృక్పధం కూడా అలవడింది. మిస్‌ ఇండియా పోటీల్లో ఈ తత్వం నాకు చాలా ఉపకరించింది. ప్రపంచస్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి కూడా నా డ్యాన్స్‌ తోడ్పడుతుందనుకుంటున్నా. మిస్‌ వరల్డ్‌ పోటీల్లో డ్యాన్స్‌ రౌండ్‌ కూడా ఉంది.  

హైదరాబాద్‌మళ్లీ మళ్లీ వస్తా...
ఈ సిటీ గురించి చాలా విన్నాను.  మరిన్ని సార్లు వచ్చి సిటీ మొత్తం తిరగాలని చూస్తా. పుట్టిన ఉదయ్‌పూర్, పెరిగిన ముంబయి రెండూ నాకు ఇష్టమే. అలాగే నేను మిస్‌ ఇండియాగా తిరిగే ప్రతి నగరం నా జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. నవతరం అమ్మాయిలకు చెప్పేది ఒకటే... ఒక లక్ష్యం కోసం మనం మనసా వాచా సిద్ధమైతే, శరీరంలోని ప్రతి నరం, కణం అదే దిశగా ప్రయాణం చేస్తుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top