‘అకాల’ నష్టం

Mirchi Crops Farmers Loss With Heavy Rains in Khammam - Sakshi

కల్లాల్లో ఆరబోసిన మిర్చి వర్షార్పణం

పంటను కాపాడుకునేందుకు రైతుల ఉరుకులు పరుగులు

భద్రాచలంలో సుమారు రూ.2 కోట్ల నష్టం

కందుల కొనుగోలు కేంద్రం తాత్కాలికంగా నిలిపివేత

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: అన్నదాతపై ప్రకృతి మరోసారి కన్నెర్ర చేసింది. అకాల వర్షంతో రైతులను ఆందోళనకు గురిచేసింది. జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం కురిసిన వర్షానికి మిర్చిపంట దెబ్బతిన్నది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురవగా, మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. ఆకాశం మేఘావృతం కావడంతో రైతులు ఉరుకులు, పరుగులు పెడుతూ కల్లాల్లో ఉన్న మిర్చిపై టార్పాలిన్‌ పట్టాలు కప్పుకున్నారు. మరికొన్ని చోట్ల పంట వర్షార్పణమయింది. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో భారీ వర్షం కురిసింది. రెండు మండలాల్లో సుమారు 15 వేల ఎకరాల్లోని మిర్చిపంట దెబ్బతిన్నది. కోసి కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి తడిసి ముద్దయింది. రబీలో సాగుచేసిన వరిపంటకు సైతం తీవ్ర నష్టం వాటిల్లింది. వరి ప్రస్తుతం సుంకు, పొట్టదశలో ఉండగా, భారీగా కురిసిన వర్షం వల్ల సుంకు రాలి దిగుబడి తగ్గే ప్రమాదం ఉండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షంతో రెండు మండలాల్లో రైతాంగానికి సుమారు రూ.2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. పినపాక నియోజకవర్గంలోని పినపాక, మణుగూరు, కరకగూడెం మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది.

పినపాక మండలంలో సుమారు 200 క్వింటాళ్ల మిర్చి తడిసింది. పాల్వంచ మండలంలో కురిసిన చిరుజల్లులకు ఆరుబయట ఎండపోసిన మిర్చి కొంతవరకు తడిసింది. జూలూరుపాడు మండలంలో అరగంటపాటు మోస్తరు వర్షం కురవడంతో కల్లాల్లో ఉన్న మిర్చి తడిసింది. మండలంలో సుమారు3 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేయగా, ప్రస్తుతం కోత దశలో ఉంది. చెట్ల మీదనే మిర్చి తడిసిపోయింది. మబ్బులు కమ్మి వర్షసూచన కన్పించడంతో కొత్తగూడెం మార్కెట్‌ యార్డులోని కందుల విక్రయ కేంద్రంలో ఉన్న బస్తాలను షెడ్ల కిందకు తరలించారు. కొన్నింటిపై టార్పాలిన్‌ పట్టాలు కప్పారు. హోలి పండుగ, వర్షసూచన ఉండటంతో కందుల కొనుగోలు కేంద్రాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మార్క్‌ఫెడ్‌ అధికారి సుధాకర్‌రావు తెలిపారు. అకాల వర్షంతో తడిసిన మిర్చిని ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు. వ్యవసాయ శాఖాధికారులు ఆలస్యం చేయకుండా వర్షం కురిసిన ప్రాంతాల్లో పర్యటించి నష్టపరిహారాన్ని అంచనావేసి ప్రభుత్వానికి నివేదించాలని, ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top