ఎంఐఎంతో అంటకాగొద్దు! | MIM antakagoddu! | Sakshi
Sakshi News home page

ఎంఐఎంతో అంటకాగొద్దు!

Mar 31 2015 1:02 AM | Updated on Aug 14 2018 5:56 PM

మజ్లిస్‌తో దోస్తీని విడనాడకుంటే పార్టీ ఘోరంగా దెబ్బతింటుందని టీఆర్‌ఎస్‌లోని ముస్లిం మైనారిటీ నేతలు కొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు.

  • టీఆర్‌ఎస్ మైనారిటీ నేతల కొత్త వాదన
  •  ఎంఐఎం దోస్తీతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నష్టమేనంటున్న నాయకులు
  •  ముస్లింల్లో పార్టీకి ఆదరణ ఉందని ఇద్దరు మంత్రులకు వివరించిన నేతలు
  •  అధినేత కేసీఆర్‌కు విన్నవించే ప్రయత్నాలు
  • సాక్షి, హైదరాబాద్: మజ్లిస్‌తో దోస్తీని విడనాడకుంటే పార్టీ ఘోరంగా దెబ్బతింటుందని టీఆర్‌ఎస్‌లోని ముస్లిం మైనారిటీ నేతలు కొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ)ను కైవసం చేసుకోవాలని భావిస్తున్న టీఆర్‌ఎస్ మహా నగరంలోని ముస్లిం మైనారిటీ ఓట్ల కోసం ఎంఐఎంతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తోంది. అయితే, టీఆర్‌ఎస్‌లోని ముస్లిం నేతలకు ఇది మింగుడు పడడం లేదు.

    సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన చోట విజయం సాధించకున్నా, ఆ తర్వాత ప్రభుత్వం ముస్లింల కోసం చేపట్టిన వివిధ కార్యక్రమాలతో సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన వచ్చిందని వారు చెబుతున్నారు. హైదరాబాద్‌లో 75 వేల వరకూ ముస్లింలు టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్నారని, దీనిని బట్టి వారిలో పార్టీకి ఆదరణ ఉందన్న విషయం తేలిపోయిందని అంటున్నారు. ‘గతంలో ఏ పార్టీ ముస్లిం మైనారిటీలకు ఇవ్వనంత గుర్తింపు టీఆర్‌ఎస్ ఇచ్చింది. ఒక ముస్లిం మైనారిటీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది.

    ముస్లిం యువతుల వివాహ ఖర్చులు భరిస్తోంది. ఏరకంగా చూసినా.. వారి సంక్షేమానికి పెద్ద పీట వేసింది. ఈ పరిస్థితుల్లో ఇంకా ఎంఐఎంతో అంటకాగాల్సిన అవసరం టీఆర్‌ఎస్‌కు లేదు..’ అని ఆ పార్టీ మైనారిటీ నాయకులు తమ అగ్రనేతల వద్ద ప్రస్తావించడం మొదలు పెట్టారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు ఇదంతా వివరించినట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు వాస్తవ పరిస్థితిని వివరిస్తామని, ఆయన అపాయింట్‌మెంటు ఖరారు చేయించాలని కూడా వీరు కోరినట్లు తెలిసింది.
     
    ఎంఐఎంతో పొత్తు.. పార్టీకి నష్టం..

    గతంలో ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ లాభపడలేదని, కాంగ్రెస్ అంతకు ముందు టీడీపీ ఇదే తరహాలో హైదరాబాద్‌లో దెబ్బతిన్నాయని వీరు గుర్తు చేస్తున్నారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి దేవీప్రసాద్ ఓటమికి దారితీసిన కారణాల్లో ఎంఐఎంతో దోస్తీ కూడా ఒకటని పేర్కొంటున్నారు. ముస్లిం మైనారిటీల ఓట్లు పడడమేమో కానీ, హిందువుల ఓట్లు మైనస్ అయ్యాయని విశ్లేషిస్తున్నారు. తమ పార్టీకి ముస్లింలలో మంచి ఆదరణ ఉందని చెపుతున్నారు.

    పరిస్థితి బాగున్నా ప్రతీ విషయంలో ఎంఐఎంకు పార్టీ అగ్రనాయకత్వం ప్రాధాన్యం ఇవ్వడాన్ని టీఆర్‌ఎస్ మైనారిటీ నాయకత్వం జీర్ణించుకోలేక పోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తామెలా ఎదుగుతామని వీరు ప్రశ్నిస్తున్నారు. రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ సొంతంగా బరిలోకి దిగాలన్న అభిప్రాయాన్ని వీరు వ్యక్తం చేస్తున్నారు.

    హైదరాబాద్‌లో ఎంఐఎంను నమ్ముకోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. ‘‘ఎంఐఎంతో మనకు పొత్తు వద్దు. ఈ విషయంలో సీఎంకు అన్ని అంశాలూ వివరించండి. మాకు సమయం ఇప్పించండి. మా దగ్గర ఉన్న సమాచారం ఆయనకు వివరిస్తాం..’’ అని కొందరు మైనారిటీ నేతలు ఇద్దరు మంత్రులకు తేల్చి చెప్పారని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement