మేడారం.. అందరికీ ఉచితమే.. | Medaram fair free for all | Sakshi
Sakshi News home page

మేడారం.. అందరికీ ఉచితమే..

Jan 26 2016 4:42 AM | Updated on Oct 9 2018 5:58 PM

మేడారం.. అందరికీ ఉచితమే.. - Sakshi

మేడారం.. అందరికీ ఉచితమే..

మేడారం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యం కోసం అధికార యంత్రాంగం పలు కొత్త నిర్ణయాలు తీసుకుంది. భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యమిస్తూ..

రూ. 100 ప్రత్యేక దర్శనం రద్దు
 
 సాక్షిప్రతినిధి, వరంగల్: మేడారం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యం కోసం అధికార యంత్రాంగం పలు కొత్త నిర్ణయాలు తీసుకుంది. భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యమిస్తూ.. దర్శనం, ఎత్తు బంగారం, క్యూలైన్ల ఏర్పాట్లను చేస్తున్నారు. ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు మేడారం మహాజాతర జరుగనుంది. రెం డేళ్లకోసారి నిర్వహించే ఈ జాతరకు సగటున కోటి మంది భక్తులు వస్తారు. ప్రస్తుత జాతరకు 1.10 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. వన దేవతల దర్శనం గత జాతర వరకు రెండు రకాలుగా ఉండేవి. సామాన్య భక్తులకు ఉచిత దర్శనంతోపాటు రూ.100 టికెట్‌తో ప్రత్యేక దర్శనం ఉండేది. ప్రస్తుత జాతరలో ప్రత్యేకదర్శనం సేవలను రద్దు చేశారు.

ఐదు క్యూ లైన్లలో మూడింటిని ఉచిత, రెండింటిని ప్రత్యేక దర్శనం కోసం కేటాయించేవారు. ఇప్పుడు అన్ని క్యూలైన్లు ఉచిత దర్శనం కోసమే వినియోగించనున్నారు.  మరోవైపు భక్తులు మొక్కుల రూపంలో బెల్లం(బంగారం) సమర్పించే ప్రక్రియ కూడా ఈసారి పూర్తి ఉచితంగానే ఉండనుంది. గతంలో దేవతలకు బెల్లం మొక్కు సమర్పించేందుకు రూ.1,116 రుసుముతో టికెట్ ఉండేది. తాజా జాతరలో ఈ ప్రక్రియనూ ఉచితంగా మార్చారు. మేడారం జాతరలో గతంలో లడ్డూ ప్రసాదం ఉండేది. వచ్చే జాతరలో ఇదీ ఉండడం లేదు. ప్రసాదం కోసం భక్తుల తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉండడంతో లడ్డూ ప్రసాదంను అధికారులు తొలగించారు.

 సౌకర్యాలకే ప్రాధాన్యం
 మేడారం జాతర కోసం ప్రభుత్వపరంగా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రత్యేక దర్శనం, బంగారం మొక్కులు, లడ్డూ ప్రసాదం టికెట్ల రూపంలో గతంలో కోటి రూపాయలకుపైగా ఆదాయం వచ్చేది. భక్తులకు సౌకర్యం కల్పించాలని ఈ రెండు ప్రక్రియలను పూర్తి ఉచితంగా మార్చాం. ఈసారి కోడె మొక్కులను కొంచెం దూరంలో పెడుతున్నాం.  
 - తాళ్లూరి రమేశ్‌బాబు,  మేడారం ఈవో

Advertisement
 
Advertisement
Advertisement