అది ఏకపక్ష కమిషన్‌ | Bhumana Karunakara Reddy Fires On Dinesh Kumar commission Report | Sakshi
Sakshi News home page

అది ఏకపక్ష కమిషన్‌

May 4 2026 5:54 AM | Updated on May 4 2026 5:54 AM

Bhumana Karunakara Reddy Fires On Dinesh Kumar commission Report

చంద్రబాబుకు అనుకూలంగా దినేష్‌కుమార్‌ నివేదిక

టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి మండిపాటు 

తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలవలేదని సీబీఐ సిట్‌ తేల్చింది 

అయినా మమ్మల్ని దోషులుగా చూపించేందుకు కుట్ర 

చంద్రబాబు కంటే ముందుగానే ఎల్లో మీడియాకు నివేదిక   

రెండు రోజులుగా వాస్తవాలకు విరుద్ధంగా కథనాలు 

ఇందాపూర్‌–హెరిటేజ్‌ బంధాన్ని దాచడానికే ఇదంతా

సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏర్పాటు చేసిన దినేష్‌కుమార్‌ ఏకసభ్య కమిషన్‌.. ఏకపక్ష కమిషన్‌గా మారిందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు చెప్పినట్టుగానే దినేష్‌కుమార్‌ తన నివేదికను తయారు చేశారని చెప్పారు. తిరుపతిలోని వైఎస్సార్‌సీపీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ సిట్‌ దాదాపు ఏడాదిన్నర పైగా విచారణ జరిపింది. లడ్డూ కల్తీ వ్యవహారంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేదని సీబీఐ సిట్‌ నివేదిక స్పష్టంగా తెలిపింది. అయినా చంద్రబాబు,పవన్‌లు వైఎస్సార్‌సీపీ పాలనలో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారనే ఆరోపణలు కొనసాగిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం రిటైర్డ్‌ ఐఏఎస్‌ దినేష్‌కుమార్‌తో ఏకసభ్య కమిషన్‌ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌ ఏకపక్షంగా మారి చంద్రబాబు పక్షాన నివేదిక ఇచ్చింది. అది అధికారికంగా విడుదల కాక ముందే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల చేతుల్లోకి వెళ్లి విభిన్న కథనాలు ప్రచారం చేస్తున్నాయి. ఒక పత్రికలో అనిల్‌ సింఘాల్, మరొక దాంట్లో ధర్మారెడ్డి పేర్లు, తర్వాత మా పేర్లను కూడా చేర్చడం అనుమానాలకు తావిస్తోంది. దినేష్‌కుమార్‌ నివేదిక ప్రకారం నేను, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పర్చేజ్‌ కమిటీలో కేవలం ప్రత్యేక ఆహ్వానితులమే. పూర్తి స్థాయి సభ్యులం కాదు. అసలు సభ్యులైన మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని సీబీఐ గంటల తరబడి విచారించగా, నన్ను మాత్రం 15 నిమిషాల్లోనే బయటకు పంపించి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి పంపింది’ అని భూమన తెలిపారు. ఈ సమావేశంలో భూమన ఇంకా ఏమన్నారంటే.. 

దినేష్‌ కుమార్‌కు టీటీడీ చైర్మన్‌ పదవి ఆఫర్‌ 
దినేష్‌కుమార్‌ అనే వ్యక్తి ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఐఏఎస్‌ అధికారిగా పేరుంది. గతంలో చంద్రబాబు హయాంలో చీఫ్‌ సెక్రటరీగా పని చేసిన ఆయనకు ఇప్పుడు టీటీడీ చైర్మన్‌ పదవి ఆశ చూపించి, ఏకసభ్య కమిషన్‌గా నియమించి, చంద్రబాబు చెప్పినట్టుగా నివేదిక ఇప్పించారు. ఆయన విచారణలో అనిల్‌ కుమార్‌ సింఘాల్, ధర్మారెడ్డి వంటి వారిని పిలిచారా? నిందితులుగా పేర్కొంటున్న జగదీశ్వర్‌రెడ్డి, బాలాజీ, విజయభాస్కర్, సురేంద్రనాథ్‌లను విచారించారా? మమ్మల్ని ఎప్పుడైనా విచారణకు పిలిచారా? పిలవకుండానే మీ ఇష్టం వచి్చనట్లు నివేదిక ఎలా ఇస్తారు? ఏడాదిన్నర పాటు సీబీఐ సిట్‌ అధికారులు ఎనిమిది రాష్ట్రాలు తిరిగి వందల మందిని విచారించి ఇచ్చిన నివేదిక కంటే మీ విచారణ గొప్పదా? సీబీఐ మమ్మల్ని ఎవరినీ దోషులుగా నిర్ధారించలేదు కాబట్టి, మమ్మల్ని దోషులుగా చూపించేందుకు ఉద్దేశ పూర్వకంగానే ఈ ఏకసభ్య కమిష¯Œన్‌ను ఏర్పాటు చేశారు. 

దమ్ముంటే కేసులు పెట్టండి? 
దినేష్‌కుమార్‌ నివేదికపై ఈనాడులో కథనం వచ్చిన వెంటనే టీటీడీ బోర్డు సభ్యులు హడావుడిగా మీడియా ముందుకు వచ్చి ఈ నెల 6న బోర్డు మీటింగ్‌లో తీర్మానం చేసి మాపై క్రిమినల్‌ కేసులు పెడతామని చెబుతున్నారు. చాలెంజ్‌ చేస్తున్నాం.. దమ్ముంటే కేసులు పెట్టండి. అదే పత్రికలో నేను, భాస్కర్‌రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులమేనని, చర్యలు బోర్డు నిర్ణయానికే వదిలేశారని రాశారు. అనిల్‌కుమార్‌ సింఘాల్‌పై ఎలాంటి చర్యలకు కమిషన్‌ ఆదేశించకపోయినా, ఆయన కింద ఉన్న సీఈవో బాలాజీ, ధర్మారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డిలపై క్రమశిక్షణ చర్యలు సూచించడం ఆశ్చర్యకరం. బీఆర్‌ నాయుడు వ్యవహారాలపై, కొండపై రెండేళ్లుగా జరుగుతున్న అపచారాలపై కూడా దినేష్‌ కుమార్‌ విచారణ చేయాల్సింది.  
⇒ చంద్రబాబు హయాంలో కిలో నెయ్యి రూ.321తో సరఫరా చేసిన హెరిటేజ్‌తో సంబంధం ఉన్న ఇందాపూర్‌ ఇప్పుడు కిలో నెయ్యి రూ.658తో ఎలా సరఫరా చేస్తోంది? అసలు ఇందాపూర్‌–హెరిటేజ్‌ సంబంధం ఏమిటి? దీనిపై కూడా దినేష్‌కుమార్‌ విచారణ చేయాలి. 2018లో చంద్రబాబు పాలనలోనే బోలేబాబాకు సంబంధించిన హర్‌‡్షప్రెష్‌ డెయిరీకి తలుపులు తెరిచి, ఆ సంస్థ నుంచి సుమారు 82 వేల కేజీల నెయ్యి సరఫరా జరిగిన విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదు? 2019లో మా ప్రభుత్వం వచ్చాక ఒక్క డెయిరీ అయినా వచ్చిందా? 

⇒ 2023లో నేను టీటీడీ చైర్మన్‌ అయ్యాక మళ్లీ నిబంధనలు కఠినతరం చేసినప్పటికీ వైష్ణవి, ప్రీమియం, మావిగంగ డెయిరీలు టెండర్లలో పాల్గొన్నాయి కదా.. కేంద్ర ప్రభుత్వ స్టార్టప్‌ విధానం ప్రకారం స్థానిక డెయిరీలకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము నిబంధనలు మార్చాము. నాణ్యత ప్రమాణాలు తగ్గించామని మీరు ఎందుకు నిరూపించలేకపోతున్నారు?  
⇒ ఇప్పుడు మీరు చెబుతున్న ఆల్ఫా, ప్రీమియం డెయిరీలు 2014–2019 మధ్య 80 శాతానికి పైగా నెయ్యి సరఫరా చేశాయి. అలాగే ఇందాపూర్, ఆల్ఫా, బోలేబాబా డెయిరీలు టెండర్లలో పాల్గొన్నది నిజం కాదా? ఈ విషయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5లతో కలిసి త్రిసభ్య కమిషన్‌ వేయండి.   

మా హయాంలో 18 సార్లు వెనక్కి పంపించాం 
చంద్రబాబు హయాంలోనే కల్తీ నెయ్యిని పట్టుకుని, అదే నెయ్యిని తిరిగి లడ్డూ తయారీలో వాడారని సీబీఐ చెప్పింది. మీరు వెనక్కి పంపిన అదే నెయ్యిని వైష్ణవి డెయిరీ ద్వారా తిరుమలకు పంపించి లడ్డూలు తయారు చేయించింది మీరు కాదా? జంతు కొవ్వు కలిసిందని ప్రచారం చేసిన నెయ్యినే మీరు ఉపయోగించారు. మా హయాంలో బీటా సైటోస్టెరాల్‌ పరీక్షల్లో లోపాలు తేలితే 18 సార్లు నెయ్యిని వెనక్కి పంపించాం. మీ హయాంలో కూడా 14 సార్లు తిరస్కరించారనే విషయం వాస్తవం కాదా? మేం ఎన్‌డీడీబీతో ఒప్పందం చేసుకుని ల్యాబ్‌లను ఆధునీకరించాం, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐతో కలిసి రూ.30 కోట్ల ల్యాబ్‌కు పునాదులు వేసింది కూడా మేమే. ఆ తర్వాత మీరు దేవాన్‌‡్ష పుట్టిన రోజున ఓపెన్‌ చేశారంతే. 2018లోనే మీరు రూ.4.5 కోట్లకు ఫ్లేవర్‌ ఝీ కొనుగోలు చేశారు. మీ లడ్డూ నాణ్యమైనదైతే అది ఎందుకు? ఈ ఏకపక్ష కమిషన్‌ అసలు ఉద్దేశం డైవర్షన్‌ రాజకీయాలే. ఇందాపూర్‌–హెరిటేజ్‌ బంధాన్ని దాచడానికే ఇదంతా. ఈ సమావేశంలో మాజీ మేయర్‌ డాక్టర్‌ శిరీష, పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement