ఎడారిలా మంజీరా

Manjeera Have No Water In Medak District - Sakshi

ఖరీఫ్‌ సాగుపై నీలి నీడలు

వట్టిపోయిన ఎత్తిపోతల పథకం

పంటల ఎదుగుదల అంతంతే.. రైతుల ఆశలు నీరుగారినట్లే!

రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ నదులు ప్రాజెక్టులు నిండుతున్నాయి. కానీ మంజీరా నది మాత్రం నీరు లేక బోసిపోతోంది. నది గర్భం ఎడారిని తలపిస్తోంది. పరీవాహక ప్రాంతంలోని బోర్లన్నీ వట్టిపోయాయి. లక్షల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాలు ఉత్తగానే ఉన్నాయి. వందలాది ఎకరాల సాగు భూమి బీడుగా మారింది. వ్యవసాయమే జీవనాధారమైన రైతుల ఆశలు అడియాశలయ్యాయి. దీంతో పరీవాహక ప్రాంత రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

సాక్షి, టేక్మాల్‌/ మెదక్‌: మండలంలోని కుసంగి, దనూర, ఎలకుర్తి, శేర్‌పల్లి, ఎలకుర్తి, లక్ష్మణ్‌తండా, చంద్రుతండా, అచ్చన్నపల్లి తదితర గ్రామాలు మంజీర నది పరివాహక గ్రామాలు. నదిని ఆధారంగా చేసుకొనిఒక్కో గ్రామంలో సుమారు 1200 ఎకరాలకు పైగా వరి సాగు చేసేవారు. ఎత్తిపోతల పథకాలతో నిండిన చెరువులు, కుంటలను ఆసరా చేసుకొని పంటలు సాగు చేసుకున్నారు. ఒక్కో రైతు 20 నుంచి 30 ఎకరాల వరకు కౌలు తీసుకొని వ్యవసాయం చేసేవారు. అయితే గతేడాదికి ఇప్పటికి పరిస్థితి తారుమారైంది. అయితే నదీ పరివాహక ప్రాంత సాగు భూములన్నీ బీడు భూములను తలపిస్తున్నాయి. పిచ్చిమొక్కలు మొలిచి వెక్కిరిస్తున్నాయి. కొంతమంది రైతులు ఆశతో పత్తి పంటను సాగు చేసినా ఎదుగదల తగ్గి పెట్టుబడి అధికమవుతుందని రైతులు వాపోతున్నారు. వర్షాలు సరిగా కురవకపోవడంతో సింగూరు వెలవెలబోయింది. మంజీరలో చుక్క నీరులేక ఇసుకదిబ్బలు తేలాయి. లక్షల వ్యయంతో కోరంపల్లి, అచ్చన్నపల్లి శివారుల్లో నిర్మించిన ఎత్తిపోతల పథకాలు వృథాగా మారి దయనీయ స్థితికి చేరుకున్నాయి.

రైతులకు నిరాశే..
గత పదిహేను రోజుల క్రితం కురిసిన కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు నిండి మంజీర నది జలజలా పారుతుందని ఆశపడ్డ రైతులకు నిరాశే మిగిలింది. చిటపట చినుకులకు ఖరీఫ్‌లో వేసిన పంటలకు తాత్కాలిక ఊరట లభిస్తున్నా, భవిష్యత్తు నీటి అవసరాల విషయంలో రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాబోయె రోజుల్లో అయినా గట్టి వర్షాలు కురవకుంటే తాగు, సాగు నీటికి తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు. దట్టమైన మేఘాలు కమ్ముకుంటున్నా చిరుజల్లులతో సరిపెడుతున్నాయి. ఇప్పటికిప్పుడే ప్రమాద ఘంటికలు లేకున్నా, ఖరీఫ్‌ చివరి దశలో, రబీలో పంటల సాగుకు ఇబ్బందులు తప్పవని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి నుంచే మంచినీటి కొరతతో రోజువిడిచి రోజు పద్ధతి, మరికొన్ని గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరికొన్ని నెలల్లో మంచినీటి కొరత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం పత్యామ్నాయ చర్యలు చేపట్టి రైతులకు సాగు, తాగునీటిని అందించాలని వేడుకుంటున్నారు.

25 ఎకరాలు సాగు చేసేటోన్ని..
సమృద్ధిగా వర్షాలు కురిస్తే కౌలుకు 25 ఎకరాలు తీసుకొని వరి సాగు చేసేవాన్ని. సరిపడా నీరు లేనందున కేవలం రెండెకరాల్లో మాత్రమే పంట వేశాను. ఆశలన్నీ ఈ పంటపైనే.. నేటికీ మంజీరా నదిలో చుక్క నీరు లేదు. పంటలు పండకపోతే వలసే గతి. – యాదయ్య, రైతు, కోరంపల్లివృథాగానే ఎత్తిపోతల

రెండెళ్ల క్రితం మా ప్రాంతంలో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. చాలా సంబరపడ్డాం. ఎత్తిపోతల ద్వారా నీటిని తీసుకొని రెండు పంటలు వేసుకోవచ్చు అనుకున్నాం. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఎక్కడా చుక్క నీరులేదు. ఎత్తిపోతలు నిర్మించినా ఉత్తగనే ఉన్నాయి. రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. – సర్దార్‌నాయక్, చంద్రుతండా 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top