ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఎంఏ, ఎమ్మెస్సీ కోర్సులు

MA and MSM courses for engineering students - Sakshi

దరఖాస్తుల స్వీకరణ గడువు 12 వరకు పెంపు

25 ఆన్‌లైన్‌ పరీక్ష కేంద్రాల ఏర్పాటు

జూలై 8 నుంచి 22 వరకు ఎంట్రన్స్‌ పరీక్షలు, 31న ఫలితాలు

మూడు విడతలుగా ఆగస్టులో కౌన్సెలింగ్‌

సీపీజీఈటీ–2019 కన్వీనర్‌ కిషన్‌

హైదరాబాద్‌: బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు, ఇతర కోర్సులతోపాటు ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన విద్యార్థులు పలు ఎంఏ, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశానికి అర్హులని కామన్‌ పీజీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీపీజీఈటీ–2019) కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కిషన్‌ శనివారం తెలిపారు. ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన వారు ఎంఏ సోషియాలజీ, ఎంఏ జర్నలిజం, లైబ్రరీ సైన్స్‌ (ఎంఎల్‌ఐసీ), సోషల్‌ వర్క్‌ (ఎంఎస్‌డబ్ల్యూ), ఎమ్మెస్సీ జియో ఇన్ఫర్మేషన్, ఎమ్మెస్సీ ఫుడ్‌సైన్స్‌ అండ్‌ టెక్నా లజీ, ఎంటీఎం, ఎంఐటీ, ఎంహెచ్‌ఆర్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి అర్హులని వివరిం చారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి అన్ని వర్సిటీలకు కలిపి నిర్వహిస్తున్న కామన్‌ పీజీ ఎంట్రన్స్‌ టెస్ట్‌కు 7 వర్సిటీలలో గల 29 వేల సీట్లకు 1.10 లక్షల మంది హాజరవుతారని అంచనా వేయగా ఇంతవరకు 83 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన వివరించారు.  

అపరాధ రుసుము లేకుండా..
సీపీజీఈటీ దరఖాస్తుల స్వీకరణ గడువును విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా జూన్‌ 12 వరకు పొడిగించినట్లు తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో జూన్‌ 22, రూ.2,000 అపరాధ రుసుముతో 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓయూలో 47, కేయూ–37, ఎస్‌ యూ–21, ఎంయూ–17, పీయూ–16, టీయూ –30, జేఎన్‌టీయూలో 3 కోర్సులకు ప్రవేశ పరీక్షలు, కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 25 ఆన్‌లైన్‌ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇంటర్‌ అర్హతతో ఐదేళ్ల ఎంబీఏ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎంఏ ఎకనామిక్స్, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీలో ప్రవేశం పొందవచ్చు. కోర్సుల వివరాలు, ప్రవేశాలకు అర్హతలు, ఇతర పూర్తి వివరాలకు ఉస్మానియా వెబ్‌సైట్లో చూడవచ్చు. ఆన్‌లైన్‌లో సంపూర్ణంగా పరిశీలించి దరఖాస్తు చేయాలని కిషన్‌ సూచించారు.

జూలై 31న సీపీజీఈటీ ఫలితాలు 
సీపీజీఈటీ–2019 ఫలితాలను జూలై 31న విడుదల చేయనున్నారు. ఆగస్టు మొదటివారంనుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియను ప్రారంభించి, ఏడు వర్సిటీలలో సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టనున్నట్లు కిషన్‌ వివరించారు. రాష్ట్రంలో తొలి సారి అన్ని వర్సిటీలకు కలిపి నిర్వహిస్తున్న కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్, కౌన్సెలింగ్‌తో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని కన్వీనర్‌ వివరించారు. ప్రతి యూనివర్సిటీకి దరఖాస్తు చేయకుండా ఒకే దరఖాస్తు, ఒకే పరీక్ష, ఒకేసారి కౌన్సెలింగ్‌కు హాజరై ఏడు వర్సిటీలలో ఏదో ఒకదాంట్లో ప్రవేశం పొందవచ్చన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top