చినబాబూ చిటికేశాడా? | Lokesh babu is struck to investigate on Revanth reddy's | Sakshi
Sakshi News home page

చినబాబూ చిటికేశాడా?

Jun 12 2015 2:26 AM | Updated on Sep 3 2017 3:35 AM

చినబాబూ చిటికేశాడా?

చినబాబూ చిటికేశాడా?

ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబే కాకుండా ఆయన కుమారుడు లోకేశ్ కూడా ఇరుక్కున్నట్లు తెలుస్తోంది.

* ఓటుకు నోటు కేసులో లోకేశ్ పాత్రపై అనుమానాలు
* మత్తయ్య ఫోన్ నుంచి స్టీఫెన్‌తో ‘చినబాబు’ సంభాషణ
* మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో ఏసీబీ
* కుట్రపన్నిన టీడీపీ ఐదు ముఠాల్లో ఉన్నదెవరు?
* ముగ్గురు ఎంపీలు, మాజీ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల పాత్ర!
* రేపోమాపో ఎఫ్‌ఐఆర్‌లో మరికొందరి పేర్లు చేర్పు
* కోర్టులో మెమో దాఖలు చేసే అవకాశం

 
 సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబే కాకుండా ఆయన కుమారుడు లోకేశ్ కూడా ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో జరిగిన బేరసారాలు, సంప్రదింపుల్లో లోకేశ్ కూడా జోక్యం చేసుకున్నారని సమాచారం. ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా ఉన్న మత్తయ్య వినియోగించిన ఫోన్ నుంచి ‘చినబాబు’ మాట్లాడినట్లు అవినీతి నిరోధక శాఖ భావిస్తోంది. ఈ ఫోన్ సంభాషణల రికార్డులను కూడా సేకరించింది. అయితే అందులోని మాటలు లోకేశ్‌వేనా కాదా అని నిర్ధారించుకునేందుకు ఏసీబీ ప్రయత్నిస్తోంది.
 
 అలాగే ఎమ్మెల్యేల ఓట్ల కొనుగోలు వ్యవహారంలో చంద్రబాబు కుమారుడి పాత్రపై దర్యాప్తు అధికారులు మరింత లోతుగా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ఫోన్ రికార్డులు బట్టబయలైన సంగతి తెలిసిందే. తాజాగా చినబాబు ఫోన్ సంభాషణలు కూడా ధ్రువీకరణ అయితే ఆయన మెడకూ ఈ కేసు చుట్టుకోనుంది. కాగా, ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు ఆధారంగా మరికొందరి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేరుస్తూ రేపోమాపో కోర్టులో ఏసీబీ మెమో దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది. నోట్లకట్టలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని, మరో ఇద్దరు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించడం వల్ల కీలక సమాచారం లభించినట్లు అధికారులు చెబుతున్నారు.
 
 మరింత మంది నేతల పాత్ర

 ఈ వ్యవహారంలో పలువురు టీడీపీ కీలక నేతల పాత్రపైనా ప్రాథమిక ఆధారాలను ఏసీబీ సంపాదించినట్లు సమాచారం. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఐదు ముఠాలను టీడీపీ రంగంలోకి దింపిందని.. అందులో ఒక ముఠా పట్టుబడటంతో మిగతా నాలుగు ముఠాలు మెల్లగా వెనక్కి జారుకున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం ఆరోపించడం ఇందుకు బలం చేకూర్చుతోంది. ఆ ఐదు ముఠాల్లో ఉన్న నేతలెవరన్నది చర్చనీయాంశమైంది.
 
 రేవంత్‌తో పాటు టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు, ఓ మాజీ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు ఓట్ల కొనుగోలు వ్యవహారంలో పాల్గొన్నట్లు ఏసీబీ ఇప్పటికే అంచనాకు వచ్చింది.  స్టీఫెన్‌సన్‌తోపాటు 8 మంది ఎమ్మెల్యేల ఓట్ల కొనుగోలుకు భారీ మొత్తం లోనే నగదు లావాదేవీలు జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. కొందరు ఎమ్మెల్యేలకు అడ్వాన్సులు ఇచ్చేందుకు ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ నివాసంలోనే మంతనాలు జరిగాయని, అక్కడి నుంచే రూ.1.50 కోట్లు పంపిణీ అయినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఆయనకు సంబంధించిన కంపెనీల ఖాతాలు, బ్యాంకు లావాదేవీల వివరాలను సేకరిస్తున్నారు.
 
 ఆ డబ్బుతోనే గుట్టు రట్టు!

 మరోవైపు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వద్ద స్వాధీనం చేసుకున్న నగదు ఎక్కడిది.. ఎవరి ఖాతా నుంచి డ్రా చేశారు.. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం కోట్ల మొత్తంలో నగదును ఎవరెవరి నుంచి సేకరించారు.. అనే కోణంలో దర్యాప్తును ఏసీబీ వేగవంతం చేసింది. ఈ నగదు కూపీ లాగితే.. మొత్తంగా ఈ వ్యవహారంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, భేటీలన్నీ బయటపడతాయని, ఈ కుట్రలో పాల్గొన్న వారెవరో తేలిపోతుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే తమ దగ్గరున్న సాక్ష్యాధారాలతో పాటు నగదు లావాదేవీల వివరాలు కూడా ఈ కేసులో కీలకమని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
 
 ఈ కేసులో ప్రమేయమున్న ఎంపీలు, మాజీ ఎంపీలు స్వయంగా సీఎం చంద్రబాబుకు ‘ఆర్థిక కోటరీ’గా వ్యవహరిస్తున్నారనేది కొంతకాలంగా ప్రచారంలో ఉంది. ఈ కోటరీ సమకూర్చిన డబ్బులను పంపిణీ చేసే బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రేవంత్, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. కాల్ డేటాలు, సీసీటీవీ ఫుటేజీలు, డ్రైవర్లు, గన్‌మెన్ల వాంగ్మూలాల ఆధారంగా మరికొందరి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చేందుకు ఏసీబీ సిద్ధమైంది. అయితే ఇందులో చంద్రబాబు పేరు ఉంటుందో లేదోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
 
 ఎన్నికల కమిషన్‌కు నివేదిక
 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముడుపుల కేసులో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అరెస్టుకు సంబంధించిన పూర్వాపరాలతో కూడిన సమగ్ర నివేదికను ఏసీబీ అధికారులు గురువారం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. స్టీఫెన్‌సన్‌కు డబ్బులు ఇవ్వజూపుతూ గత నెల 31న రేవంత్.. ఏసీబీకి చిక్కారు. అదే రోజున కేసు నమోదు చేసే ముందు ఏసీబీ అధికారులు ఈసీకి ప్రాథమిక సమాచారం అందించారు. తాజాగా ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్, కేసు డైరీ వివరాలతో పాటు రేవంత్ పాత్రపై పూర్తిస్థాయి నివేదికను పంపించారు.

Advertisement
 
Advertisement
Advertisement