ప్రజలకు మీరు.. మీకు మేము | CM Revanth Reddy at the Martyrs Commemoration Day event | Sakshi
Sakshi News home page

ప్రజలకు మీరు.. మీకు మేము

Oct 22 2026 4:48 AM | Updated on Oct 22 2026 4:48 AM

CM Revanth Reddy at the Martyrs Commemoration Day event

పోలీస్‌ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి , అమరుల కుటుంబీకులకు చెక్‌ అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో డీజీపీ ఆనంద్, సీపీ సజ్జనార్‌

ప్రజలకు పోలీసులు అండగా నిలవాలి 

మీకు, మీ కుటుంబాల భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా ఉంటుంది 

అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి 

2028 నాటికి పోలీస్‌ విభాగంలో ఖాళీలన్నీ భర్తీ చేస్తాం

కొత్త సవాళ్లను ఎదుర్కొనేలా పోలీస్‌ శాఖ ఆధునీకరణ 

హోంగార్డుల కుటుంబాలకుఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలకు పెంపు  

డీజీపీ సీవీ ఆనంద్‌కు సీఎం ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీస్‌ విభాగంలో ఉన్న అన్ని ఖాళీలను 2028 నాటికి భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న ప్రతి అధికారి, ప్రతి సిబ్బందికి క్రమశిక్షణే బలం. మీ నిజాయితీయే మీ గౌరవం. పోలీస్‌ విభాగంలో సాంకేతికత ఎంత పెరిగినా మీలోని మానవతా దృక్పథం పోకూడదు. ప్రజల భద్రత విషయంలో మీరు అందించే భరోసాయే మీకు లభించే గొప్ప గుర్తింపు. ప్రజలకు మీరు అండగా నిలవండి. మీ సంక్షేమానికి, మీ కుటుంబాల భవిష్యత్తుకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది..’ అని హామీ ఇచ్చారు.

అమరులైన హోంగార్డుల కుటుంబాలకు ప్రస్తుతం రూ.5 లక్షల పరిహారం అందిస్తుండగా దాన్ని రూ.10 లక్షలకు పెంచాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. హైదరాబాద్‌లోని గోషామహల్‌ పోలీస్‌ స్టేడియంలో బుధవారం జరిగిన అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అమరుల కుటుంబీకులను సన్మానించి, పరిహారం చెక్కులుఅందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. 

అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం.. 
‘పోలీసు అమరవీరుల్ని స్మరించుకునే రోజు ఎంతో భావోద్వేగమైనది. సమాజం కోసం ప్రాణాలను త్యాగం చేసిన అమరులకు నివాళులు. దేశవ్యాప్తంగా గడిచిన ఏడాది కాలంలో 154 మంది అమరులు కాగా.. రాష్ట్రంలో ఏఎస్సై దేవి సింగ్, కానిస్టేబుళ్లు ఎంపల్లి ప్రమోద్‌ కుమార్, శీలం కమలాకర్‌తో పాటు ఎక్సైజ్‌ విభాగంలో పని చేసిన గాజుల సౌమ్య విధి నిర్వహణలో అశువులు బాశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం వారు చేసిన త్యాగాలను మరువలేం. ఆ అమరుల కుటుంబం ఒంటరిది కాదు.. వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. మీరు కోల్పోయిన వ్యక్తిని ఎవరూ తిరిగి తీసుకురాలేరు. మీ కుటుంబాల్లో ఏర్పడిన లోటును ఎవరూ పూర్తిగా భర్తీ చేయలేరు. కానీ మీ బాధలో మీరు ఒంటరివారు కాదు..ప్రభుత్వం, పోలీసు శాఖ అండగా ఉంటాయి. తెలంగాణ సమాజం అండగా ఉంటుంది.  

పోలీస్‌ శాఖకు అత్యంత ప్రాధాన్యం.. 
రాష్ట్ర అభివృద్ధికి శాంతి భద్రతల పరిరక్షణ ఎంతో కీలకం. అందుకే పోలీస్‌ శాఖకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇప్పటికే ఐదు వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా 112 మంది డీఎస్పీలను నియమించాం. సమాజంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొనే ట్రాన్స్‌జెండర్లను పోలీస్‌ విభాగంలో ట్రాఫిక్‌ అసిస్టెంట్లుగా నియమించి వారి ఆత్మగౌరవాన్ని పెంచాం. విధి నిర్వహణలో వీరమరణం పొందిన కానిస్టేబుళ్ల నుంచి ఉన్నతాధికారుల వరకు వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా గణనీయంగా పెంచాం. ఇది కేవలం ఆర్థిక సహాయం కాదు.. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం. యంగ్‌ ఇండియా పోలీసు స్కూల్‌లో డీజీపీ నుంచి హోంగార్డు వరకు అన్ని స్థాయిల పిల్లలకు అవకాశం ఇచ్చాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు.  

మహిళలు, చిన్నారుల కేసుల్లో జాగ్రత్తగా ఉండాలి.. 
‘కాలంతో పాటు నేర స్వభావం మారుతోంది. దీంతో కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు పోలీసు శాఖను ఆధునీకరించాలని నిర్ణయించాం. పోలీసింగ్‌లో ఆధునిక సాంకేతికతను వినియోగించాలని నిర్ణయం తీసుకున్నాం. డ్రగ్స్, గంజాయి వ్యాప్తి అత్యంత ప్రమాదకరం. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా చూడాలి. డ్రగ్స్‌ నియంత్రణలో ఈగల్‌ ఫోర్స్‌ పనితీరును, డీజీపీని అభినందిస్తున్నా. మహిళలు, చిన్నారులకు సంబంధించిన కేసుల్లో పోలీసులు మరింత సున్నితంగా వ్యవహరించాలి..’అని సీఎం సూచించారు. 

పోలీసులు నైపుణ్యం పెంచుకోవాలి: డీజీపీ సీవీ ఆనంద్‌ 
 ‘తెలంగాణ ఉద్యమాల గడ్డ...నక్సలైట్ల హింసను ఎదుర్కొనే క్రమంలో వందలాది మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారు. కర్రెగుట్టల వంటి మారుమూల ప్రాంతాల్లో జాతీయ జెండాను ఎగురవేయడం పోలీసుల పట్టుదలకు నిదర్శనం. మాదకద్రవ్యాలు, సైబర్‌ నేరాలు, ఆహార కల్తీ, రోడ్డు ప్రమాదాలు, వ్యవస్థీకృత నేరాలు కొత్త సవాళ్లుగా మారుతున్నాయి. వాటిని ఎదుర్కొనేందుకు సిబ్బంది నిరంతరం నైపుణ్యాలు పెంపొందించుకుని, ఇన్‌ సర్వీస్‌ శిక్షణకు ప్రాధాన్యమివ్వాలి..’అని డీజీపీ సీవీ ఆనంద్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనర్, పోలీస్‌ విభాగానికి సంబంధించిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement