సీఎం, టీపీసీసీ చీఫ్‌ల మధ్య అరగంట పాటు భేటీ
కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీపై కసరత్తు
పట్టభద్రులు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలపైనా సమాలోచనలు
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల భర్తీపై మళ్లీ కదలిక మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ ప్రత్యేకంగా సమావేశమై పార్టీ, ప్రభుత్వానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించినట్టు సమాచారం. సుమారు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో ముఖ్యంగా..ఇటీవల ఖాళీ అయిన కార్పొరేషన్ చైర్మన్ పదవులతో పాటు కొత్తగా భర్తీ చేయాల్సిన నామినేటెడ్ పోస్టులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలు తమకు అవకాశం దక్కుతుందని ఎదురుచూస్తున్నారు. పార్టీ కోసం పనిచేసినవారికి తగిన గుర్తింపు ఇవ్వడం, సామాజిక సమీకరణాలు, ప్రాంతాలవారీగా ప్రాతినిధ్యం వంటి అంశాలు నియామకాల సమయంలో కీలకం కానున్నాయి. ఇప్పటికే కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లుగా వ్యవహరించినవారి పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలో సీఎం, పీసీసీ అధ్యక్షుడి మధ్య జరిగిన భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఖాళీల భర్తీపై ఏదైనా నిర్ణయం తీసుకున్నారా? కొత్తగా ఎవరికి అవకాశం దక్కనుంది? అనే అంశాలపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఎమ్మెల్సీ స్థానాలపైనా దృష్టి
మరోవైపు, రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ స్థానం నుంచి సామ రామ్మోహన్‌రెడ్డి, నల్లగొండ–ఖమ్మం–వరంగల్ స్థానం నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని బరిలోకి దింపింది. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన వ్యూహం, ఓటర్ల నమోదు, క్షేత్రస్థాయిలో నాయకుల సమన్వయం వంటి అంశాలపై కాంగ్రెస్ నాయకత్వం దృష్టి పెట్టింది.
ఇదే సమయంలో నవంబర్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు మూడు ఖాళీ కానుండటంతో వాటి భర్తీపై కూడా పార్టీలో చర్చ సాగుతోంది. ఈ స్థానాలను ఆశిస్తున్న నేతలు ఇప్పటికే తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సామాజిక వర్గాల సమీకరణాలు, పార్టీకి చేసిన సేవలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం తదితర అంశాలు ఎంపికలో కీలకం కానున్నాయి. కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలు, ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశాలపై సీఎం–పీసీసీ అధ్యక్షుడి భేటీలో చర్చ జరగడం పార్టీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
సీఎంకు దసరా శుభాకాంక్షలు
టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, ఎంపీ అనిల్‌యాదవ్, ఎమ్మెల్యే నవీన్‌యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రోహిన్‌రెడ్డి తదితరులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మంగళవారం ఆయన నివాసంలో కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.


