పట్టా అడిగితే ఫారెస్ట్‌ అధికారుల దాడులు..

Land Registration Required Forest Officials Attacked - Sakshi

సాక్షి, కొల్లాపూర్‌రూరల్‌: మండలంలోని నార్లాపూర్‌ సమీపంలో, మల్లబస్వాపురం శివారులో కుడికిళ్ల గ్రామానికి చెందిన దళిత రైతులు 120 ఎకరాల పోడు భూమిని 1961 సంవత్సరం నుంచి సాగు చేసుకుంటున్నారు. నేటికీ ఆ భూములకు చట్టబద్దత లేదు. గతంలోని పాలకులందరికీ దళిత రైతులు విన్నపాలు చేశారు. కానీ నేటి వరకు ఎలాంటి పట్టాలకు నోచుకోలేదు. సర్వేనంబర్‌ 36/1, 36/2లో 120 ఎకరాల ఫారెస్ట్‌ పోడు భూములను 60 కుటుంబాలకు చెందిన కుడికిళ్ల దళిత రైతులు తాతల కాలం నుంచి సాగు చేస్తున్నారు.
 
బెదిరింపులకు గురిచేస్తున్నారు..  
సాగుచేసుకుంటున్న భూములను తమ పేరుపై పట్టా చేయాలని కోరుతున్నా రైతులను ఫారెస్ట్‌ అధికారులు దాడి చేస్తున్నారు. అయినా మొక్కవోని ధైర్యంతో భూమిలేని నిరుపేద రైతులు శిస్తు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చేముందు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఫారెస్ట్‌ భూములకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. దళితులు సాగు చేస్తున్న భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటై మూడు నెలలు కావస్తున్నా నేటివరకు ఎలాంటి స్పందన లేదు. ఎన్నో ఏళ్లుగా ఫారెస్ట్‌ భూములు సాగు చేసుకుని అనుభవిస్తున్న కుడికిళ్ల దళిత రైతులకు పట్టాలివ్వాలని కోరుతున్నారు. ప్రతిఏటా ఫారెస్ట్‌ అధికారులు భయభ్రాంతులకు గురిచేస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. పాలకులు, రెవెన్యూ, ఫారెస్ట్‌ అధికారులు తక్షణం స్పందించి శిస్తు చేసుకుని అనుభవిస్తున్న పోడు భూములపై సర్వే నిర్వహించి పట్టాలకు ప్రపో జల్స్‌ పంపాలని రైతులు కోరుతున్నారు.
  
హక్కు కల్పించాలి 
మండల పరిధిలోని నార్లాపూర్‌ గ్రామ సమీపంలో మల్లబస్వాపూర్‌ శివారులో శిస్తు చేసుకుని అనుభవిస్తున్న ఫారెస్ట్‌ భూములకు పట్టాలివ్వాలి. రెండు, మూడు తరాల నుంచి పోడు భూములను శిస్తు చేసుకుని అనుభవిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పట్టాలు ఇవ్వాలి.  
– శ్రీనివాసులు, కుడికిళ్ల 

కేసు పెట్టినా వెనక్కి తగ్గం 
మల్లబస్వాపూర్‌ శివారులో 36 సర్వేనంబర్‌లో 120 ఎకరాల భూములను 60 కుటుంబాలకు చెందిన మా తాతలు, తండ్రులు శిస్తు చేసుకుని అనుభవిస్తున్నారు. ఆ సమయంలో ఫారెస్ట్‌ అధికారులు దాడులు చేసి కేసులు పెట్టారు. అయినా కూడా నేటి వరకు శిస్తు చేసుకుని అనుభవిస్తున్నాం. ముఖ్యమంత్రి హామీ ప్రకారం పోడు భూములకు పట్టాలిస్తారనే ఆశ ఉంది. ప్రభుత్వం, అధికారులు స్పందించి పట్టాలివ్వాలి.                 
– బిచ్చయ్య, కుడికిళ్ల  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top