మళ్లీ కబ్జా లొల్లి..! | Land Disputes Continues On Kamareddy Govt Degree College | Sakshi
Sakshi News home page

మళ్లీ కబ్జా లొల్లి..!

Aug 6 2019 1:32 PM | Updated on Aug 6 2019 1:32 PM

Land Disputes Continues On Kamareddy Govt Degree College - Sakshi

సాక్షి, కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూముల కబ్జా ప్రయత్నాలు మళ్లీ మొదలయ్యాయి. రూ.వందల కోట్ల విలువైన కాలేజీ ఆస్తులను కాపాడేందుకు కాలేజీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో దశాబ్దాలుగా పోరాటాలు జరిగాయి. ఫలితంగా వివాదంలో లేని భూములన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే, కోర్టు కేసుల్లో నానుతున్న స్థలాలకు సంబంధించిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. కేసులు తెగకుండా కొందరు కేసుల మీద కేసులు వేస్తూ, ఆస్తులను కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోందని డిగ్రీ కాలేజీ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

1964లో కామారెడ్డి కాలేజీ ఎడ్యుకేషనల్‌ సొసైటీని స్థాపించిన అప్పటి పెద్దలు కాలేజీ ఏర్పాటుకు సేకరించిన భూముల విలువ ఇప్పుడు రూ.వందల కోట్లకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కాలేజీ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ చొరవతో కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి విన్నవించారు. కలెక్టర్‌ సత్యనారాయణ చొరవ చూపడంతో కాలేజీకి సంబంధించిన 158.07 ఎకరాల భూమిని గవర్నర్‌ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించారు.

అయితే కాలేజీ ఆట స్థలంగా ఉన్న 8.25 ఎకరాల భూమికి సంబంధించి పాత పట్టాదారులు తమదేనంటూ కోర్టుల్లో కేసులు వేయడంతో ఆ భూమి వివాదంలో ఉంది. అప్పట్లో తమదేనంటూ కొందరు గ్రౌండ్‌ను దున్నేశారు కూడా. దీంతో విద్యార్థులు, ఉద్యమకారులు అడ్డు తగలడంతో వెనక్కు తగ్గారు. అలాగే మరో 6.38 ఎకరాల భూమి విషయంలోనూ రకరకాల వ్యక్తులు కోర్టులకు వెళ్లారు. ఇటీవల ఇంజినీరింగ్‌ కాలేజీ యాజమాన్యం 25 ఎకరాల భూమి విషయంలో కోర్టులో కేసులు వేసింది.

తెర వెనుక బడాబాబులు..
కాలేజీ ఆస్తులకు సంబంధించి కేసులు నమోదు చేసే విషయంలో బడాబాబుల హస్తం ఉందని కాలేజీ ఆస్తుల పరిరక్షణ కమిటీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రూ.వందల కోట్ల విలువైన ఆస్తులపై కన్నేసిన కొందరు బడాబాబులు కోర్టు కేసులతో ఆ భూములను స్వాధీనం చేసుకుని లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. కాలేజీ ఆస్తులను ఎలాగైనా కాజేయాలన్న ఉద్దేశ్యంలో కొందరు పాత పట్టాదారులను ముందుకు తెస్తున్నారని ఆరోపిస్తున్నారు. అలాగే ఇంజినీరింగ్‌ కాలేజీ ఏర్పాటు కోసం లీజుకు తీసుకున్న ప్రైవేటు యాజమాన్యం 25 ఎకరాల భూమిని తమ ఆధీనంలో తీసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. వారికి కూడా కొందరు స్థానికులు అండగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.

అంగులం కబ్జా కానివ్వం..
కాలేజీ ఆస్తుల విషయంలో దశాబ్దాల కాలంగా పోరాడుతున్నామని, అంగుళం భూమి కూడా కబ్జా కానిచ్చేది లేదని ఆస్తుల పరిరక్షణ కమిటీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా 158 ఎకరాల భూమిని ప్రభుత్వం పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించామని, మిగతా భూములను కూడా అలాగే స్వాధీనం చేసుకునే వరకు పోరాడుతామని కమిటీ ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రంలో ఏ కాలేజీకి లేనంత భూమి ఇక్కడ అందుబాటులో ఉన్నందున ప్రభుత్వం ఎడ్యుకేషనల్‌ హబ్‌గా అభివృద్ధి చేసి, కబ్జాదారుల నుంచి కాలేజీ భూములను కాపాడాలని వారు కోరారు.

1
1/1

కబ్జాకు ప్రయత్నాలు జరుగుతున్న ఆటస్థలం ఇదే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement