breaking news
Kamareddy Degree College
-
మళ్లీ కబ్జా లొల్లి..!
సాక్షి, కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూముల కబ్జా ప్రయత్నాలు మళ్లీ మొదలయ్యాయి. రూ.వందల కోట్ల విలువైన కాలేజీ ఆస్తులను కాపాడేందుకు కాలేజీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో దశాబ్దాలుగా పోరాటాలు జరిగాయి. ఫలితంగా వివాదంలో లేని భూములన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే, కోర్టు కేసుల్లో నానుతున్న స్థలాలకు సంబంధించిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. కేసులు తెగకుండా కొందరు కేసుల మీద కేసులు వేస్తూ, ఆస్తులను కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోందని డిగ్రీ కాలేజీ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 1964లో కామారెడ్డి కాలేజీ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించిన అప్పటి పెద్దలు కాలేజీ ఏర్పాటుకు సేకరించిన భూముల విలువ ఇప్పుడు రూ.వందల కోట్లకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కాలేజీ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చొరవతో కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి విన్నవించారు. కలెక్టర్ సత్యనారాయణ చొరవ చూపడంతో కాలేజీకి సంబంధించిన 158.07 ఎకరాల భూమిని గవర్నర్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే కాలేజీ ఆట స్థలంగా ఉన్న 8.25 ఎకరాల భూమికి సంబంధించి పాత పట్టాదారులు తమదేనంటూ కోర్టుల్లో కేసులు వేయడంతో ఆ భూమి వివాదంలో ఉంది. అప్పట్లో తమదేనంటూ కొందరు గ్రౌండ్‌ను దున్నేశారు కూడా. దీంతో విద్యార్థులు, ఉద్యమకారులు అడ్డు తగలడంతో వెనక్కు తగ్గారు. అలాగే మరో 6.38 ఎకరాల భూమి విషయంలోనూ రకరకాల వ్యక్తులు కోర్టులకు వెళ్లారు. ఇటీవల ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యం 25 ఎకరాల భూమి విషయంలో కోర్టులో కేసులు వేసింది. తెర వెనుక బడాబాబులు.. కాలేజీ ఆస్తులకు సంబంధించి కేసులు నమోదు చేసే విషయంలో బడాబాబుల హస్తం ఉందని కాలేజీ ఆస్తుల పరిరక్షణ కమిటీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రూ.వందల కోట్ల విలువైన ఆస్తులపై కన్నేసిన కొందరు బడాబాబులు కోర్టు కేసులతో ఆ భూములను స్వాధీనం చేసుకుని లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. కాలేజీ ఆస్తులను ఎలాగైనా కాజేయాలన్న ఉద్దేశ్యంలో కొందరు పాత పట్టాదారులను ముందుకు తెస్తున్నారని ఆరోపిస్తున్నారు. అలాగే ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు కోసం లీజుకు తీసుకున్న ప్రైవేటు యాజమాన్యం 25 ఎకరాల భూమిని తమ ఆధీనంలో తీసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. వారికి కూడా కొందరు స్థానికులు అండగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అంగులం కబ్జా కానివ్వం.. కాలేజీ ఆస్తుల విషయంలో దశాబ్దాల కాలంగా పోరాడుతున్నామని, అంగుళం భూమి కూడా కబ్జా కానిచ్చేది లేదని ఆస్తుల పరిరక్షణ కమిటీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా 158 ఎకరాల భూమిని ప్రభుత్వం పేరిట రిజిస్ట్రేషన్ చేయించామని, మిగతా భూములను కూడా అలాగే స్వాధీనం చేసుకునే వరకు పోరాడుతామని కమిటీ ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రంలో ఏ కాలేజీకి లేనంత భూమి ఇక్కడ అందుబాటులో ఉన్నందున ప్రభుత్వం ఎడ్యుకేషనల్ హబ్‌గా అభివృద్ధి చేసి, కబ్జాదారుల నుంచి కాలేజీ భూములను కాపాడాలని వారు కోరారు. -
కూలుతున్న విద్యావృక్షం
కామారెడ్డి డిగ్రీ కళాశాల ఒకప్పుడు ప్రతిభావంతులకు నిలయం. ఇక్కడ చదివిన ఎందరో దీని కీర్తి ప్రతిష్టలను ఎల్లలు దాటించారు. ఇప్పుడు ఈ కళాశాల పరిస్థితి దయనీయంగా ఉంది. వందల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నా నిర్వహణ భారంగా మారింది. ఎందరికో జీవిత పాఠాలు నేర్పి ఉన్నతులుగా తీర్చిదిద్దిన విద్యావృక్షమది. రాష్ట్రంలో ఎక్కడా లేని ప్రత్యేక కోర్సులతో అలరారుతోంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన విద్యార్థులు ఆ చదువులమ్మ చెట్టు నీడలోనే విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. పల్లె నుంచి వచ్చినోళ్లయినా.. పట్నం పిల్లాడికైనా చక్కని విద్యాఫలాలను అందించింది. అలా చదువుకున్నోళ్లలో చాలామంది దేశ, విదేశాల్లో ఉన్నతమైన స్థానాల్లో కొలువుదీరారు. ‘నీ డిగ్రీ ఎక్కడ చేశావ్..’ అని ఎవరైన అడిగితే.. ‘కామారెడ్డి డిగ్రీ కాలేజీలో..’ అని గర్వంగా చెప్పుకునేవాళ్లు. అలాంటి యాభయ్యేళ్ల ఘన చరిత్ర కలిగిన కళాశాల ఇప్పుడు దీన స్థితికి చేరుకుంది. చెప్పుకోవడానికి వందల ఎకరాల భూములున్నట్లేగానీ.. తన పేరిట ఒక్క ఎకరమైనా లేని దుస్థితి. దీంతో న్యాక్ గుర్తింపునకు నోచుకోక.. యూజీసీ నిధులూ రాక.. సరైన వసతులూ లేక.. స్వర్ణోత్సవాల వేళలో చావుకళతో నిట్టూరుస్తోంది. ఎందరెందరికో విద్యాబుద్ధులు పంచిపెట్టిన తనను ఆదుకునేవారు లేరా.. అన్నట్లుగా కన్ను ఆర్పకుండా ఎదురు చూస్తోంది. కామారెడ్డి ‘కాలేజీ’ కథ వందల కోట్ల ఆస్తులు ఉన్నా అనాథగా.. తన పేరిట ఎకరం భూమి కూడా లేని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫలితంగా న్యాక్, యూజీసీ గుర్తింపునకు నోచుకోలేని దుస్థితి యూజీసీ నిధుల్లేవ్.. వసతుల కల్పన దేవుడెరుగు స్వర్ణోత్సవ సంబురాల వేళలో చావు కళ కళ్లు తెరవకుంటే భవిత ఉండదంటున్న మేధావులు ఉద్యమిస్తామంటున్న విద్యార్థి సంఘాలు కామారెడ్డి : ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా 263 ఎకరాల భూమిని కలిగి ఉన్న ఈ కళాశాల తనపేరున ఒక్క ఎకరమైనా లేకపోవడంతో ప్రభుత్వపరంగా అందాల్సిన నిధులు, ప్రోత్సాహకాలకు దూరమ వుతోంది. అన్నింటికి మించి యూజీసీ, న్యాక్ గుర్తింపునకు నోచుకోలేక పోయింది. ఫలితంగా కళాశాల అభివృద్ధికి రావలసిన కోట్లాది రూపాయలు రాకుండా పోయాయి. స్వర్ణోత్సవ సంబురాలు జరుపుకోవాల్సిన ఈ విద్యావృక్షం అందరూ ఉన్న అనాథలా తయారైంది. కాలేజీ పుట్టుక.. కామారెడ్డి.. నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల కూడలి ఇది. జాతీయ రహదారితో పాటు రైల్వే మార్గం కలిగిన పట్టణమిది. అప్పట్లో ఇక్క డ విద్యావసతులు లేకపోవడంతో పదో తరగతితోనే చదువుకు ఫు ల్‌స్టాప్ పెట్టేవారు. అప్పట్లో కొంతమంది పెద్దలు మన ఊర్లో.. మన పిల్లల కోసం ఓ కళాశాల స్థాపించాలన్న ఆలోచనతో ముందుకు కదిలారు. వీరికి అప్పటి జిల్లా కలెక్టర్ బీఎన్ రామన్ సహకరించారు. బీఎన్రామన్ అ ధ్యక్షతన కేఆర్ రాజారెడ్డి, కేపీ రాజారెడ్డి, జి.విఠల్‌రెడ్డి, వి.నారాయణరావు, బాదల్చంద్, నర్సాగౌడ్ తదితరులు సభ్యులుగా ‘కామారెడ్డి కాలేజ్ ఎడ్యుకేషన్ సొసైటీ’ ఏర్పాటైంది. గంజ్‌లో క్రయవిక్రయాలకు వచ్చే ధాన్యం, బెల్లంపై కొంత సుంకం విధించి, ఆ డబ్బును కళాశాల కోసం వెచ్చించారు. కొందరు రైతులు ఉచితంగా, మరి కొందరు డబ్బులకు ఇచ్చిన భూములు కలిపి.. మొత్తం 263 ఎకరాలను సేకరించారు. ముందుచూపుతో భారీ భవనాన్ని నిర్మించి, 1964 ఆగస్టు 10న ‘కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల’ పేరుతో ఎయిడెడ్ కళాశాలను ప్రారంభించారు. తొలుత బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులతో తరగతులు ప్రారంభమయ్యాయి. 1979లో బీఎస్సీ ఫారెస్ట్రీ, బీఎస్సీ ఫిషరీష్, బీఎస్సీ డెయిరీ, బీఏ రూరల్ ఇండస్ట్రీ వంటి అరుదైన కోర్సులు ప్రారంభించారు. స్వాధీనం చేసుకోవాలని తరువాతి కాలంలో విద్యార్థులు భరించలేని ఫీజులు, నియామకాల్లో అక్రమాలు.. ఇలా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని విద్యార్థులు ఉద్యమాలు లేవదీశారు. చివరకు 1987లో కళాశాలను ప్ర భుత్వం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. కొంతకాలానికి కళాశాల కమిటీ తిరిగి కోర్టుకు వెళ్లడంతో కళాశాల ఆస్తిని విద్యాకమిటీకి ఇవ్వాలని తీర్పును వెలువరించారు. దీంతో మళ్లీ కళాశాల సొసైటీ చేతుల్లోకి వెళ్లింది. మళ్లీ ఉద్యమాలు జరిగాయి. నాలుగేళ్ల క్రితం కళాశాల కమిటీ తమ వద్ద ఉన్న రికార్డులను ప్రభుత్వానికి అప్పగించింది. రికార్డుల్లో మాత్రం కళాశాల కమిటీ పేరే చెల్లుబాటవుతోంది. కరిగిపోతున్న భూములు.. కళాశాల కమిటీ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కు పెద్దఎత్తున భూ పంపిణీ చేయడంతో ఇప్పుడు కేవలం 60ఎకరాలే మిగిలినట్లు తెలుస్తోంది. సబ్స్టేషన్లకు 12ఎకరాలు, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలకు 6ఎకరాలు, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీకి 25ఎకరాలు, డెయిరీ కళాశాలకు 62ఎకరాలు, జూనియర్ కాలేజీకి 5ఎకరాలు, కర్షక్ బీఈడీ కాలేజీకి 5ఎకరాలు, సరస్వతీ శిశుమందిర్ కు రెండెకరాలు, ఫారెస్టు నర్సరీకి ఎకరం, టీవీ స్టేషన్ కు ఎకరం, జీవీఎస్ కాలేజీకి 5ఎకరాలు, స్టేడియం నిర్మాణానికి 11ఎకరాలు, పోలీసు స్టేషన్‌కు 2ఎకరాలు, హాస్టళ్లకు 23ఎకరాలు, పారిశ్రామిక వాడకు 20ఎకరాలు, మైనారిటీ కాలేజీకి రెండెకరాలు, మున్సిపల్ నీటిశుద్ధి, ట్యాంకులకు నాలుగెకరాలు.. తాజాగా పీహెచ్సీ భవనానికి 2ఎకరాలు కేటాయించారు. అలాగే ఆక్రమణలకు కూడా అడ్డులేకుండా పోయింది. యూజీసీ, న్యాక్ గుర్తింపు లేక రాష్ట్రంలోనే పేరొందిన కామారెడ్డి డిగ్రీ కాలేజీకి ఇప్పటికీ యూజీసీ, న్యాక్ గుర్తింపు లేకపోవడం శోచనీయం. ప్రభుత్వం కళాశాలను స్వాధీనం చేసుకుని మూడు దశాబ్దాలు కావస్తున్నా ఇప్పటికీ కాలేజీ పేరిట భూమి లేకపోవడంతో న్యాక్, యూజీసీ గుర్తింపు దక్కడం లేదు. దీంతో కళాశాలలో స్పోర్ట్స్, అకడమిక్, లైబ్రరీ, భవనాల నిర్మాణం, లాబోరేటరీలు, ఆడిటోరియం, హాస్టల్ భవనాలు... ఇలా ఎన్నింటికో రావలసిన కోట్లాది రూపాయలు రాకుండా పోయాయి. కాలేజీ ఏర్పడి యాబై ఏళ్లవుతున్న సందర్భంలో స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలి. కాని ఇక్కడ కాలేజీని పట్టించుకునేవారు లేక, ఏ గుర్తింపులేని పరిస్థితుల్లో అనాథలా మారింది. తెలంగాణ రాష్ట్రంలోనైనా ఎన్నోఏళ్లుగా నిరాదరణకు గురైన కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు తెలంగాణ రాష్ట్రంలోనైనా తగిన గుర్తింపు లభిస్తుందా.. అన్న ఆశతో ఇక్కడి విద్యాభిమానులు ఎదురు చూస్తున్నారు.