కార్పొరేషన్ల అభివృద్ధిపై శిక్షణ సమావేశం

KTR Speaks About Corporation Development in Telangana - Sakshi

త్వరలోనే కమిషనర్లు, నిపుణులతో నిర్వహిస్తాం..

వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లపై సమీక్షలో మంత్రి కేటీఆర్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్ల కమిషనర్లకు త్వరలోనే ఒకరోజు శిక్షణ సమావేశం నిర్వహిస్తామని పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రాధాన్యతల గుర్తింపుపై ఈ సమావేశంలో నిపుణులతో చర్చిస్తామన్నారు. ఈ సమావేశానికి ఏర్పాట్లు చేయాలని పురపాలక శాఖ ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలసి గురువారం ఇక్కడ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ప్రజల కనీస అవసరాలపైన ప్రధాన దృష్టి వహించాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాల అమలుపై మరింత చొరవ చూపాలని సూచించారు. మఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెడ్రూం ఇళ్ల నిర్మాణం కార్యక్రమంపై ప్రధాన దృష్టి సారించాలని చెప్పారు. ఈ నగరాల్లోని ఇతర మౌలిక వసతుల కార్యక్రమాల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆయా జిల్లాల మంత్రులకు కేటీఆర్‌ సూచించారు.

ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి.. 
ప్రస్తుతం జరుగుతున్న పనుల్లోనూ ప్రాధాన్యత క్రమంలో ముఖ్యమైనవి వెంటనే పూర్తయ్యేలా కార్యాచరణ చేపట్టాలని ఖమ్మం, వరంగల్‌ జిల్లాల కలెక్టర్లు, కార్పొరేషన్ల కమిషనర్లను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. ఆయా పనులు పూర్తయ్యే తేదీలతో కూడిన ఒక క్యాలెండర్‌ను రూపొందించాలని సూచించారు. పనులు మరింత వేగంగా పూర్తయ్యేందుకు పురపాలక శాఖ తరఫున అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని హామీనిచ్చారు. వరంగల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వివిధ నియోజకవర్గాల వారీగా చేపట్టిన వివిధ కార్యక్రమాలను ఆయా మంత్రులు సమీక్షించారు. ఈ సందర్భంగా స్థానిక మంత్రులు పట్టణంలో నడుస్తున్న పలు కార్యక్రమాల గురించి కేటీఆర్‌కు వివరించారు.

వరంగల్‌ ,ఖమ్మం పట్టణాల్లో రోడ్ల నిర్వహణతో పాటు, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, గ్రీనరీ ఏర్పాటు, జంక్షన్ల అభివృద్ధి, టాయిలెట్ల నిర్మాణం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యతనివ్వాలని కేటీఆర్‌ సూచించారు. ఈ రెండు పట్టణాల్లో మంచినీటి సరఫరా స్థితిగతులను మంత్రులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్పొరేషన్ల పరిధిలోని విలీన గ్రామాల్లో నూతన మున్సిపాలిటీ చట్టం ప్రకారం నిధులు ఖర్చు చేయాలని అధికారులకు మంత్రులు సూచించారు. ఈ నెల మూడో వారంలో వరంగల్, ఖమ్మం పట్టణాల్లో స్వయంగా పర్యటిస్తానని కేటీఆర్‌ చెప్పారు. ఈ సమీక్షలో చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, కడియం శ్రీహరి, ఖమ్మం వరంగల్‌ జిల్లాల కలెక్టర్లు, కార్పొరేషన్ల కమిషనర్లు హాజరయ్యారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top