సాయి కృష్ణకి అండగా ఉంటాం - కేటీఆర్

KTR Responds Over Short Fire On Telugu Student In America - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అమెరికాలో దుండగుల చేతిలో కాల్పులకు గురై చికిత్స పొందుతున్న మహబూబాబాద్ కు చెందిన విద్యార్థి సాయి కృష్ణ కు పూర్తి అండగా ఉంటామని మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. సాయి కృష్ణ కుటుంబ సభ్యులు ఈరోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో కేటిఆర్ ని కలిసి ప్రభుత్వ సహకారాన్ని కోరారు.  సాయి కృష్ణ తల్లిదండ్రులు వెంటనే అమెరికాకి వెళ్లేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. (అమెరికాలో తెలుగువిద్యార్థిపై కాల్పులు)

తనను కలిసిన సాయికృష్ణ కుటుంబ సభ్యులను సాయి కృష్ణ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సాయి కృష్ణ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారని అయితే పలు శస్త్ర చికిత్సలు ఆయనకు అవసరమని అక్కడ ఉన్న సాయి కృష్ణ మిత్రులు తమకు తెలియజేశారని తల్లిదండ్రులు కేటీఆర్ కు తెలిపారు. ఇప్పటికే సాయి కృష్ణ కు అవసరమైన  తక్షణ వైద్య సహాయం గురించి అమెరికాలోని కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి తమ ఎన్ఆర్ఐ శాఖ అధికారులు సమాచారం అందించారని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు.

అవసరమైతే మరింత సహకారం కోసం కేంద్ర ప్రభుత్వం విదేశీ వ్యవహారాల శాఖ తరఫున సహాయం కోసం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తో మాట్లాడుతామని సాయి కృష్ణ కుటుంబ సభ్యులకు కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ నేరుగా సుష్మాస్వరాజ్ గారిని కలిసిన్నట్లు కేటీఆర్ తెలిపారు. సాయి కృష్ణ వైద్య సహాయం ప్రస్తుతం ఎలాంటి ఆటంకాలు లేకుండా అందుతుందని, అయితే ఆయనకి భీమా సౌకర్యం లేకపోవడంతో తమకు ఆర్థిక సహాయం అవసరమవుతుందని ఈ సందర్భంగా కేటిఆర్ ను సాయి కృష్ణ కుటుంబ సభ్యులు కోరారు.

సాయి కృష్ణ ను అన్ని విధాల ఆదుకుంటామన్న కేటీఆర్, ముందుగా కుటుంబ సభ్యులు అమెరికా వెళ్లేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని తక్షణం అందించాలని ముఖ్యమంత్రి కార్యాలయ స్పెషల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి కి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సాయి కృష్ణ కుటుంబ సభ్యులు అమెరికా వెళ్లేందుకు అవసరమైన అత్యవసర వీసాలను  జారీ చేయాల్సిందిగా హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జర్నల్ కేథరిన్ హెడ్డా తోనూ కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. కుటుంబ సభ్యుల రవాణా ఖర్చులతోపాటు, కొంత ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున తక్షణమే అందిస్తామని సాయి కృష్ణ కుటుంబ సభ్యులకు కేటీఆర్ తెలిపారు. కష్ట కాలంలో తమ కుటుంబానికి ఆసరాగా నిలబడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి సాయి కృష్ణ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top