గత ఐదేళ్లలో ‘ఐటీ’ రెట్టింపు..

KTR Meeting With IT employees - Sakshi

ప్రస్తుతం రాష్ట్ర ఉత్పత్తులు రూ.1.10 లక్షల కోట్లు  

నివాసయోగ్య నగరాల్లో హైదరాబాద్‌కు అగ్రస్థానం 

ఢిల్లీలో ‘జిస్కా లాఠీ ఉస్కా భైన్స్‌’ నడుస్తోంది 

అందుకే రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ 16 సీట్లు గెలవాలి 

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు 

ఐటీ ఉద్యోగులతో భేటీ 

హైదరాబాద్‌: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో గత ఐదేళ్ల కాలంలో అనూహ్య ప్రగతి సాధించామని, 2014 నాటికి రూ. 50 వేల కోట్ల ఐటీ ఉత్పత్తులు ఎగుమతి కాగా, ఇప్పుడు రూ.1.10 లక్షల కోట్లకు పెంచగలిగామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు పేర్కొన్నారు. ఆదివారం రాయదుర్గంలోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాజశేఖర్‌రెడ్డిని ఐటీ ఉద్యోగులకు పరిచయ కార్యక్రమం కేటీఆర్‌ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. బెంగళూర్‌కు దీటుగా ఐటీ రంగాన్ని విస్తరిస్తున్నామని, నగరంలో 200 స్టార్టప్‌లు పనిచేస్తున్నాయన్నారు. టీహబ్‌ ప్రారంభించామని, టీహబ్‌ ఫేస్‌–2ను త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. 2014కు ముందు మైక్రోసాఫ్ట్‌ మాత్రమే ఉండేదని, ప్రస్తుతం గూగుల్, యాపిల్, ఫేస్‌బుక్, అమెజాన్‌ వంటి కంపెనీలు తమ ప్రధాన కార్యాలయాలను హైదరాబాద్‌లోనే ప్రారంభించాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇండస్ట్రియల్, ఐటీ పాలసీలతో ఇక్కడ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయన్నారు. 24 గంటలు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో సక్సెస్‌ అయ్యామని చెప్పారు.  

అభివృద్ధి అన్ని వైపులా... 
ఐటీ కారిడార్‌.. గచ్చిబౌలి, మాదాపూర్‌కే పరిమితం కాకుండా అన్ని వైపులా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్‌ అన్నారు. కొంపల్లి, మల్కాజిగిరి, ఎల్‌బీనగర్, ఉప్పల్, షామీర్‌పేట్‌ వైపు ఐటీ కంపెనీలను విస్తరిస్తామని చెప్పారు. సనత్‌నగర్, కాటేదాన్, జీడిమెట్లలోని పరిశ్రమలతో కాలుష్యం పెరిగిందన్నారు. నగరానికి ఉత్తర, దక్షిణ, తూర్పు వైపులా అన్ని రకాల పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందిం చామని తెలిపారు. మెట్రో రైలు సౌకర్యాన్ని నగర శివార్లకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ కల్పించడంపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. మైండ్‌స్పేస్‌ నుంచి ఎయిర్‌ పోర్ట్‌.. నాగోల్‌æ, ఫలక్‌నుమా నుంచి ఎయిర్‌పోర్టుకు పొడిగిస్తామన్నారు. రెండవ దశ మెట్రోకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని, అందులో భాగంగా చందానగర్, లక్డీకాపూల్, నాగోల్, ఎల్‌బీనగర్, ఈసీఐఎల్‌ వంటి ప్రాంతాలకు కూడా కలుపుతామన్నారు.  

స్మార్ట్, సేఫ్‌ సిటీగా హైదరాబాద్‌.. 
ఐదేళ్లుగా దేశంలోనే అత్యంత నివాసయోగ్య నగరంగా హైదరాబాద్‌ గుర్తింపు పొందిందని, దీన్ని స్మార్టర్, సేఫర్‌ సిటీగా మారుస్తున్నామన్నారు. ప్రధానంగా మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు ఇతరులకు పూర్తి భద్రత కల్పించడంపై దృష్టి పెట్టామన్నారు. నగరంలో 6 లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వీటిని మరింతగా పెంచుతామన్నారు. న్యూయార్క్, లండన్‌ తర్వాత కమాండ్‌ కంట్రోల్‌ ఉన్న నగరంగా హైదరాబాద్‌కు గుర్తింపు రానుందని తెలిపారు. 

నీటి సరఫరా మెరుగు.. 
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దూరదృష్టితోనే నగరంలో నీటి సరఫరాకు సమగ్ర విధానం రూపొందించారని కేటీఆర్‌ తెలిపారు. 10 టీఎంసీల కెపాసిటీ ఉన్న రిజర్వాయర్‌ను కేశవాపూర్, మరో 10 టీఎంసీలతో చౌటుప్పల్‌ సమీపంలో దేవలమ్మ నాగారంలో నిర్మాణం చేస్తామని తెలిపారు. ఓఆర్‌ఆర్, రీజనల్‌ రింగ్‌ రోడ్డు లోపల నీటి సమస్య లేకుండా చేయడానికి రిజర్వాయర్లు నిర్మాణం చేస్తున్నామని, అలాగే ఇప్పటికే సాగుతున్న హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ను కూడా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. శేరిలింగంపల్లి, ఎల్‌బీనగర్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, కాప్రా వంటి ప్రాంతాల్లో రూ.2,100 కోట్లతో మంచినీటి సమస్య తీరుస్తున్నామని, రూ.3,100 కోట్లతో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని పేర్కొన్నారు. నగరంలో వాహన, పారిశ్రామిక కాలుష్య నివారణకు చర్యలు ప్రారంభించామన్నారు. పరిశ్రమలన్నింటినీ ఓఆర్‌ఆర్‌ బయటకు మారుస్తున్నామని చెప్పారు. దశలవారీగా ఆర్టీసీ బస్సులన్నింటినీ ఎలక్ట్రిక్‌ బస్సులుగా మార్చాలని నిర్ణయించామని తెలిపారు.

సంకీర్ణంలో టీఆర్‌ఎస్‌ పార్టీది కీలక పాత్ర..
కేంద్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ కీలకపాత్ర పోషించాలంటే రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు గెలవాల్సిన అవసరం ఉందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు పేర్కొన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ‘జిస్కా లాఠీ ఉస్కా భైన్స్‌’ అన్నట్లుగా నడుస్తోందని ఆయన గుర్తు చేశారు. బీజేపీ 150–160 సీట్లు, కాంగ్రెస్‌ పార్టీ 100 సీట్ల లోపే గెలుస్తాయని సర్వేలు చెబుతున్నాయని వెల్లడించారు. ఇక కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే నేపథ్యంలో 16 సీట్లు గెలిస్తే ప్రధాని నియామకంలో టీఆర్‌ఎస్‌ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఈ సందర్భంగా చేవెళ్ల నుంచి పోటీ చేస్తున్న రంజిత్‌రెడ్డిని, మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేస్తున్న రాజశేఖర్‌రెడ్డిని ఆయన ఐటీ ఉద్యోగులకు పరిచయం చేశారు. వీరిని గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం ఉద్యోగులు అడిగిన పలు ప్రశ్నలకు కేటీఆర్, రంజిత్‌రెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి సమాధానమిచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top